పేరెంట్స్‌కు బీపీ... నాకూ రావచ్చా?
హైబీపీ కౌన్సెలింగ్
నా వయసు 35. మా కుటుంబంలో తల్లిదండ్రులకు హైబీపీ ఉంది. ఇది నాకు కూడా వస్తుందా? దీన్ని నివారించడానికి నేనేం చేయాలో చెప్పండి.
- నాగరాజు, కూసుమంచి
మీ తల్లిదండ్రులకూ, మీ రక్తసంబంధీకులకూ, మీకు చాలా దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. అయితే, మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా కుటుంబంలో హైబీపీ చరిత్ర ఉన్నప్పటికీ దీన్ని చాలావరకు నివారించుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది చాలా సులభం. అది...
- ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవాలి. అందులో మీరు తీసుకునే సోడియమ్ పాళ్లు 1500 మి.గ్రా.కు మించకుండా చూసుకోవాలి.
- మీరు శారీరక శ్రమను ఇష్టపడుతూ చేయండి. నడక వంటి వ్యాయామాలు దీనికి బాగా ఉపకరిస్తాయి.
- బరువు పెరగకుండా చూసుకోండి. మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో దానికి మించకుండా నియంత్రించుకుంటూ ఉండండి.
- పొగాకు వాడకాన్ని పూర్తిగా మానేయండి.
- ఆల్కహాల్ పూర్తిగా మానేయండి.
హైబీపీ ఉన్నవారు ఎప్పుడూ కాస్త చాలా ఒత్తిడితో బాధపడుతున్నట్లుగా (నర్వస్‌గా), చెమటలు పడుతున్నట్లుగా, నిద్రపట్టకుండా ఉండే లక్షణాలతో కనిపిస్తుంటారు కదా. నాకు పైన పేర్కొన్న లక్షణాలేమీ లేవు. కానీ హైబీపీ ఉందేమోనన్న సందేహం వెంటాడుతోంది. నాకు బీపీ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?
- సురేశ్, హైదరాబాద్
చాలామందికి హైబీపీ ఉన్నట్లే తెలియదు కానీ వాళ్లలో చాలామందికి ఆ వ్యాధి ఏళ్లతరబడి ఉంటుంది. అందుకే దీన్ని ‘సెలైంట్ కిల్లర్’ అంటుంటారు. మీకు లక్షణాలు కనిపించనంత మాత్రాన బీపీ లేదని నిర్ధారణ చేసుకోకండి. మీ రక్తనాళాలు పాడైపోయాక గానీ ఆ లక్షణాలు బయటకు కనిపించవు. మీరు ఒకసారి డాక్టర్‌ను కలిసి బీపీ పరీక్షింపజేసుకోండి.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి,
కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్