నీవు లావా కావా | Family health counseling:Obesity special | Sakshi
Sakshi News home page

నీవు లావా కావా

Published Thu, Aug 2 2018 1:36 AM | Last Updated on Thu, Aug 2 2018 1:36 AM

Family health counseling:Obesity special - Sakshi

నీవు లావా? కావా??  ఇదో పెద్ద పోరాటం.ఇంగ్లిష్‌లో బ్యాటిల్‌ ఆఫ్‌ ద బల్జ్‌ అంటారు. ‘‘ఏవోయ్‌ శ్రీనివాస్‌... అలా చిక్కిశల్యమైపోయావేమిటీ?’’ అన్న కామెంట్స్‌ ఈరోజుల్లో అస్సలు వినిపించడంలేదు. ‘‘ఏవయ్యా శ్రీనివాస్‌... కాస్త ఒళ్లు చేసినట్టున్నావ్‌ కదూ’’   ఇది ఇప్పుడు ఫ్రీక్వెంట్‌గా వినిపించే మాట.  ఇలా చిక్కలేక... చిక్కుల్లో ఉన్నవాళ్లకీ లావు పెరిగి బిక్కుబిక్కుమంటున్నవాళ్లకీఅసలు నువ్వు లావా..? కావా..?అని చెప్పడానికే ‘ఊబకాలమ్‌’లో   ఈ స్పెషల్‌ రెండో కథనం. 

ఒక వ్యక్తి స్థూలకాయుడా కాదా అని నిర్ణయించడం ఎలా? ఇందుకు ‘బీఎమ్‌ఐ’ గురించి తెలుసుకోవాలి. ఒక వ్యక్తి స్థూలకాయుడా కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ (బీఎమ్‌ఐ) అనే ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. దీన్ని కొలిచే పద్ధతి ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో కొలవాలి. ఆ విలువను అతడి ఎత్తు స్క్వేర్‌తో భాగించాలి. స్క్వేర్‌ అంటే అదే సంఖ్యను మళ్లీ అదే సంఖ్యతో గుణించడం. ఈ ఎత్తు విలువను మీటర్లలో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 100 కిలోలు. అతడి ఎత్తు 1.7 మీటర్లు. అప్పుడు అతడి బీఎమ్‌ఐ విలువ ఎంత అంటే...  100 / 1.7  ’ 1.7 = 34.60 కి.గ్రా./మీ. స్క్వేర్‌. ఇప్పుడు ఈ విలువను బీఎమ్‌ఐ పట్టికతో సరిపోల్చుకుని మీరు ఏ స్థూలకాయ స్థాయిలో ఉన్నారో నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా విదేశాలలో జరిగే అధ్యయనాల ప్రకారం వచ్చిన విలువలనే మన దేశవాసులకూ అన్వయిస్తుంటారు. కానీ స్థూలకాయం విషయంలో ఈ ప్రమాణాలు విదేశీయులకూ, భారతీయులకూ ఒకటి కాదు. (పైన వచ్చిన విలువ విదేశీయుల లెక్కలో స్వల్ప స్థూలకాయమే అయినా... భారతీయుల విషయంలో మాత్రం అధిక స్థూలకాయం కిందనే లెక్క.)బీఎమ్‌ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనం తక్కువ స్థూలకాయస్థాయిలో  ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. 

భారతీయులలో  స్థూలకాయం... 
భారతీయుల్లో బీఎమ్‌ఐ విలువ 25 – ఆపైన ఉంటే స్వల్ప స్థూలకాయం ఉన్నట్లే. ఒకవేళ బీఎమ్‌ఐ విలువ 30 – ఆ పైన ఉంటే అధిక స్థూలకాయం ఉన్నట్టుగా పరిగణించాలి. స్థూలకాయాన్ని నిర్ణయించే మరో లెక్క నడుము–హిప్‌ రేషియో.నడుము చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లు. ఇక నడుం–హిప్‌ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి. ఉదాహరణకు ఒక పురుషుడి నడుము 100 సెం.మీ. ఉండి అతడి హిప్‌ కేవలం 80  సెం.మీ. ఉందనుకోండి. అప్పుడు 100 / 80 = 1.25. అంటే 0.9 కంటే ఎక్కువ కాబట్టి అతడికి స్థూలకాయం ఉన్నట్లే. అలాగే ఒక మహిళ నడుము 90 సెం.మీ. ఉండి, ఆమె హిప్‌ 100 సెం.మీ. ఉంటే... 90 / 100 = 0.9. అది 0.8 కంటే ఎక్కువే కాబట్టి ఆమెది స్థూలకాయమేనని పరిగణించవచ్చు. పైన పేర్కొన్న పద్ధతుల ద్వారా మీరు స్థూలకాయులా కాదా అని మీకు మీరే తెలుసుకోవచ్చు. 

సెంట్రల్‌ ఒబేసిటీ... 
చాలామంది ఒళ్లంతా లావెక్కడాన్నే ఒబేసిటీగా అనుకుంటుంటారు. కానీ సన్నగా ఉండి పొట్ట పెరగడం కూడా ఒబేసిటీ కిందనే లెక్క. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్‌ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్‌ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు శాతం పెరగడం (హైపర్‌ లిపిడిమియా) వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్‌ ఒబేసిటీలో చాలా ఎక్కువ. 

ఇదేగాక మరికొన్ని రకాల స్థూలకాయాలనూ  పరిగణనలోకి తీసుకోవచ్చు. అవి... 
1. ఇనాక్టివ్‌ ఒబేసిటీ: ఎలాంటి వ్యాయామమూ, శారీరక శ్రమ లేని కారణంగా  ఒంట్లో పలు చోట్ల కొవ్వు పేరుకుపోయి వచ్చే స్థూలకాయాన్ని ఇనాక్టివ్‌ ఒబేసిటీ అంటారు. 
2. ఫుడ్‌ ఒబేసిటీ: వేళకాని వేళల్లో, రాత్రివేళల్లో ఇష్టం వచ్చినట్లుగా తినడం వల్ల కొవ్వు రూపంలో వచ్చే స్థూలకాయమిది. 
3. యాంగై్జటీ ఒబేసిటీ: కొందరిలో యాంగై్జటీ లేదా డిప్రెషన్‌ ఉన్నప్పుడు ఊబకాయం వస్తుంది. ఇలాంటి ఒబేసిటీ తగ్గించాలంటే మొదట వారి మానసిక సమస్యను నయం చేయాల్సి ఉంటుంది. అంతేతప్ప సాధారణ ఊబకాయం ఉన్నవారిలో అనుసరించే మార్గాలు వీరికి అంతగా ఉపకరించవు. 
4. వీనస్‌ ఒబేసిటీ: కొందరికి కొన్ని నిర్దిష్ట సమయాల్లో ఊబకాయం వస్తుంటుంది. అంటే... ఒక నిర్దిష్టమైన వయసులోనో లేదా మహిళల్లో అయితే నిర్దిష్టంగా గర్భధారణ సమయంలోనో... ఇలా. ఈ తరహాలో నిర్దిష్ట సమయాల్లోనే కనిపించే ఊబకాయం కేవలం వ్యాయామంతోనే తగ్గిపోతుంది. 

ఊబకాయానికి కారణాలు 
∙జన్యుపరమైన కారణాలు: సాధారణంగా తల్లిదండ్రుల్లో ఊబకాయం ఉన్నప్పుడు కుటుంబాల్లో అది వంశపారంపర్యంగా వస్తుండటం మామూలే. దీన్ని తగ్గించడం చాలావరకు సాధ్యంకాదు. అయితే ప్రయత్నం మీద కొంత తగ్గి, చురుగ్గా తమ కార్యకలాపాలు జరుపుకుంటే ఆరోగ్యంగా ఉన్నట్లే పరిగణించవచ్చు. 

∙వయసు: చాలామంది మధ్యవయసుకు వచ్చేసరికి బరువు పెరగడం మామూలే. స్త్రీపురుషులిద్దరిలోనూ ఈ పరిణామం చోటుచేసుకున్నా మహిళల్లో మరీ ఎక్కువ. ప్రత్యేకంగా మెనోపాజ్‌ దశ దాటిన మహిళల్లో ఇది మరీ ఎక్కువ. ఇక పురుషుల్లో అయితే పొట్ట రావడం చాలా సహజం. ఇది ఒంట్లో సరిగ్గా మధ్య భాగంలో వస్తుంటుంది కాబట్టి ఇలా జరగడాన్ని కొందరు  సరదాగా ‘మిడిల్‌ ఏజ్‌డ్‌ మిడ్‌ ట్రెజర్‌’ అంటూ చమత్కరిస్తుంటారు. 

∙ఆహార అలవాట్లు:  కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం (శాచురేటెడ్‌ ఫ్యాట్స్, ట్రాన్స్‌ఫ్యాట్స్, షుగర్స్‌)తో పాటు పిజ్జా, బర్గర్‌ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, వేళకు తినకపోవడం, రాత్రి డ్యూటీలు పెరగడం వల్ల రాత్రిపూట చాలా ఎక్కువ ఆహారం తీసుకొని, పగలు పడుకోవడం వంటి కారణాల వల్ల బరువు పెరుగుతుంటారు. 

∙శరీర కదలికలు మందగించడం: ఇటీవల కూర్చొని చేసే వృత్తుల వల్ల బరువు పెరగడం అన్నది బాగా పెరిగిపోయింది. పైగా ఆధునిక వృత్తుల్లో ఒంటి కదలికలకు ఏమాత్రం ఆస్కారం లేకపోవడంతో, శరీరానికి తగిన శ్రమ లేక క్యాలరీలు దహనం కాక అవి కొవ్వుల రూపంలో పేరుకుపోవడం వల్ల ఊబకాయం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 

∙కొన్ని రకాల జబ్బులు (మెడికల్‌ రీజన్స్‌): హైపోథైరాయిడిజమ్, కుషింగ్‌ సిండ్రోమ్, పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) వంటి వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఒంటి బరువు పెరుగుతుంది. 

∙కొన్ని రకాల మందులు వాడటం:  స్టెరాయిడ్స్‌తో కూడిన మందులు వాడినప్పుడు ఊబకాయం రావడం మామూలే. డిప్రెషన్‌ ఉన్నవారు వాడే యాంటీ డిప్రెసెంట్స్, మూర్ఛవ్యాధిగ్రస్తులు వాడే  యాంటీ ఎపిలెప్టిక్‌ మందులతోనూ ఒళ్లు వస్తుంది.  (బరువు తగ్గడానికి ఉపయోగపడే వేర్వేరు ప్రక్రియల గురించి విపులంగా వచ్చే వారం)

ఒంట్లో కొవ్వు ఎంత ఉండాలి... 
శరీరంలో శక్తిగా మారక మిగిలిపోయిన ఆహారం కొవ్వుగా మారి నిల్వ ఉంటుందన్న విషయం తెలిసిందే. మరి కొవ్వు పేరుకోవడం స్థూలకాయానికి దారితీస్తుందన్న అంశమూ అందరికీ తెలుసు. అలాగని కొవ్వును పూర్తిగా పరిహరించకూడదు. ఎందుకంటే... మనకు కంటి చూపుకు అవసరమైన విటమిన్‌–ఏ, ఎముకలకు బలాన్నిచ్చి, అనేక క్యాన్సర్లనుంచి కాపాడుతూ శరీర రక్షణ వ్యవస్థకు బలం సమకూర్చే విటమిన్‌–డి, ఒంటికి అందాన్ని పెంచే విటమిన్‌–ఈ, రక్తం గడ్డకట్టేలా చేసి ప్రమాదాల్లో ప్రాణాలను నిలిపే విటమిన్‌–కే ల విటమిన్లన్నీ శరీరంలోకి ఇంకడం అన్న ప్రక్రియ కొవ్వు లేకపోతే జరగదు. అలాగే మనలోని చాలా కీలక అవయవాల చుట్టూ కొవ్వు ఒక రక్షణ కవచంలా పేరుకుపోయి ఉంటుంది. శరీరం రోజూ ఎదుర్కొనే చిన్న కొద్దిపాటి  దెబ్బలకు  కీలక అవయవాలు దెబ్బతినకుండా వాటి చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా ప్రకృతి  అద్భుతమైన ఏర్పాటు చేసింది. అందుకే మనం గమనిస్తే... గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. అలాగే కిడ్నీలు కొవ్వులో కూరుకుపోయే ఉంటాయి. ఇక పేగుల చుట్టూ కూడా అంతో ఇంతో కొవ్వులు ఉండనే ఉంటాయి. అందుకే మన విటమిన్ల శోషణకూ, మన అవయవాల రక్షణకు అవసరమైన మేరకు కొవ్వు ఉండాల్సిందే.

బరువు తగ్గడానికి మార్గాలు : మనం అనుసరించే సాధారణ మార్గాలకు తోడుగా బరువు తగ్గడానికి చాలా రకాల  ప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ... 
∙అధిక బరువు (బీఎమ్‌ఐ 23 – 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్‌ఐ 25 – 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవాలి (బ్రిస్క్‌ వాకింగ్‌), తేలికపాటి వ్యాయామాలు మంచివే.  స్పోర్ట్స్‌ ఆడటం చాలా మంచి వ్యాయామం. ఆటలో భాగంగా మనకు తెలియకుండానే చాలా మంచి వ్యాయామం జరిగిపోతుంటుంది ∙మసాలాలు ఏమాత్రం వాడని  ఆహారం తీసుకోవాలి. సాధారణంగా మసాలాలు లేని ఆహారమంతగా రుచి అనిపించదు. దాంతో మనం ఆహారం తీసుకునే పరిమాణం తగ్గుతుంది. ఇలా బ్లాండ్‌ డైట్‌ రూపంలో పోషకాలు సమకూరి దేహం ఆరోగ్యవంతం కావడంతో పాటు బరువు తగ్గడానికీ ఇది తోడ్పడుతుంది ∙ప్రోటీన్‌ డైట్‌లో శాకాహార ప్రోటీన్లు తీసుకోవడం, వంటల్లో నూనెలు, నెయ్యి వంటి ఫ్యాట్స్‌ను చాలా పరిమితంగానే వాడటం, మాంసాహారం ఇష్టంగా తినేవారు వేటమాంసం వంటి రెడ్‌మీట్‌కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపల వంటి వైట్‌ మీట్‌ తీసుకోవడం ∙తప్పనిసరిగా క్రమం తప్పకుండా వేళకు తినడం ∙చిరుతిండ్లకూ, కూల్‌డ్రింక్స్‌కూ, ఆల్కహాల్‌కూ దూరంగా ఉండటం... వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఇది అధిక బరువు ఉన్నవారికే గాక... అందరికీ ఆరోగ్యాన్నిచ్చే ప్రక్రియ. అయితే ఒకవేళ బీఎమ్‌ఐ 30 – ఆ పైన ఉంటే ఈ మామూలు మార్గాలు పనిచేయవు. అప్పుడు కొందరు కొన్ని ప్రత్యేక మార్గాలను అనుసరిస్తుంటారు.వాటిలో ముఖ్యమైన కొన్ని... ∙పొట్ట,  తొడలు, పిరుదులు వంటి చోట్ల పేరుకున్న  కొవ్వును లైపోసక్షన్‌ ద్వారా తగ్గించడం ∙కూల్‌ స్కల్ప్‌టింగ్‌ అనే ప్రక్రియ ద్వారా బరువు తగ్గించుకోవడం ∙ఒక వ్యక్తిని మరణానికి చేరువ చేసేంతగా ఊబకాయం ఉంటే (దీన్నే ఇంగ్లిష్‌లో మార్బిడ్‌ ఒబేసిటీ అంటారు) ‘బేరియాట్రిక్‌ సర్జరీ’ అని పిలిచే శస్త్రచికిత్స చేయించుకోవాలి. 

ఒక వాస్తవం
పిండిపదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్‌ అనేవి వాటి అణు నిర్మాణం ఆధారంగా రెండు రకాలు. మామూలుగా ఉండేవి ఒకటైతే... సంక్లిష్టమైన నిర్మాణం ఉండేవి రెండో రకం. బిస్కెట్లు, చాక్లెట్లు, వంటి వాటిల్లో మామూలు పిండిపదార్థాలు ఉంటాయి. బరువు తగ్గాలంటే విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు కూడా లేని ఈ రకమైన ఆహారాన్ని తీసుకోకపోవడం మేలు.  అయితే పండ్లు, బీన్స్, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్‌లలో ఉండే సంక్లిష్టమైన పిండిపదార్థాల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. 

ఊబకాయంతో  యువత గుండెకూ చేటే!
ఊబకాయం యుక్తవయస్కుల గుండెలకూ చేటు చేస్తుందని బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరం బరువు పెరిగితే గుండెజబ్బులు వస్తాయని గతంలోనే పలు పరిశోధనలు రుజువు చేయగా.. ఈ పరిస్థితి యువతకూ చేటు చేస్తుందన్న విషయం తాజాగా అర్థమైందని అంటున్నారు కాట్లిన్‌ వేడ్‌. బ్రిస్టల్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన ఈ శాస్త్రవేత్త బ్రిటన్‌కు చెందిన యువకులపై పరిశోధనలు చేశారు. బాడీ మాస్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉన్న యువకుల గుండె కండరాలు బాగా మందంగా ఉన్నాయని, పైగా చాలామందికి అధిక రక్తపోటు సమస్య కూడా ఉందని తెలిసిందని కాట్లిన్‌ తెలిపారు. పదిహేడు నుంచి 21 ఏళ్ల వయసున్న కొన్ని వేల మంది వివరాలతో తాము ఈ పరిశోధన జరిపామని సరికొత్త జన్యు విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి పరిశీలించగా బాడీమాస్‌ ఇండెక్స్‌ ఎంత ఎక్కువగా ఉంటే... రక్తపోటు తీవ్రత అంతేస్థాయిలో ఎక్కువగా ఉందని... ఫలితంగా గుండెచప్పుళ్ల మధ్య ధమనులపై ఒత్తిడి కూడా ఎక్కువవుతోందని వివరించారు. అధికబరువు వల్ల గుండెలోని ఒక కవాటం (లెఫ్ట్‌ వెంట్రికల్‌) వ్యాకోచం చెందుతున్నట్లు తెలిసిందని కాట్లిన్‌ అన్నారు. ఈ మార్పులన్నింటి ఫలితంగా గుండెకండరాల బరువు పెరిగి అవి మందంగా మారుతున్నట్లు చెప్పారు.  
మొత్తమ్మీద చూస్తే యుక్తవయసు నుంచి ఆరోగ్యకరమైన బాడీ మాస్‌ ఇండెక్స్‌ ఉండేలా చూసుకోవడం ద్వారా భవిష్యత్తులో గుండెజబ్బుల బారిన పడకుండా రక్షించుకోవచ్చునని  నిర్ద్వంద్వంగా తెలుస్తున్న మాట!!
డా.ఎమ్‌. గోవర్థన్, సీనియర్‌ కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజీషియన్, కేర్‌ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement