
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున అధిక రక్తపోటుతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆయన్ను గుంటూరులోని లలిత సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వైద్యులు డాక్టర్ విజయ, డాక్టర్ రాఘవశర్మ తెలిపారు.
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. నాలుగు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించిన తరువాత డిశ్చార్జి చేస్తామని చెప్పారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో బీపీ టాబ్లెట్ వేసుకున్నారని, బుధవారం తెల్లవారుజామున మరింత ఇబ్బందిగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకొచ్చామని కన్నా కుమారుడు, మాజీ మేయర్ కన్నా నాగరాజు తెలిపారు.