సాక్షి, హైదరాబాద్ : 'అన్నాత్తై’షూటింగ్ కోసం గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్న ప్రముఖ సినీనటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ (70) శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు రావడంతో ఆయన్ను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన్ను ప్రత్యేక ఐసీయూకు తరలించి రక్తపోటులో హెచ్చుతగ్గులను నియంత్రించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, బీపీ కూడా సాధారణ స్థితికి చేరుకుందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇప్పటికే ఆయనకు కరోనా పరీక్షలు కూడా చేశామని, ఆయనకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ఆస్పత్రి వర్గాలు ఈ మేరకు శుక్రవారంసాయంత్రం మీడియా బులెటన్ విడుదల చేశాయి. ఆయనకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. శనివారం ఉదయం కూడా పరీక్షలు నిర్వహించి అంతా సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే డిశ్చార్జ్ చేయనున్నుట్ల ప్రకటించారు. మరోవైపు రజనీకాంత్ వ్యక్తిగత వైద్యులు సహా ఆయన కుమార్తె ఐశ్వర్య చెన్నై నుంచి అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
హోం క్వారంటైన్‌లో ఉండగా...
ఈ నెల 14న హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్.. 15వ తేదీ నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైన ‘అన్నాత్తై’షూటింగ్‌లో పాల్గొంటూ ఫిలిం సిటీలోని సితారా హోటల్లో ఉంటున్నారు. అయితే రెగ్యులర్ పరీక్షల్లో భాగంగా ఈ నెల 22న మొత్తం చిత్ర బృందానికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రజనీ సహా ముఖ్య నటీనటులెవరికీ కరోనా సోకనప్పటికీ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో నయనతార చెన్నై వెళ్లిపోగా రజనీ మాత్రం హోటల్ గదిలోనే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, రక్తపోటులో హెచ్చుతగ్గులు రావడంతో వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.
త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంతుతున్న రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు ఫోన్ చేసి రజనీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీ ఆరోగ్యం గురించి తెలుసుకొనేందుకు ఆయన అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకోగా పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ నేపథ్యంలో బంధువులు, అభిమానులు, ప్రముఖులెవరూ పరామర్శల కోసం ఆస్పత్రికి రావొద్దని కుటుంబ సభ్యులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment