
రజనీకాంత్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, హైదరాబాద్: రక్తపోటులో హెచ్చుతగ్గుల సమస్యతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన సినీనటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. గత రెండ్రోజులతో పోలిస్తే ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఆయనకు మరో వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో స్పష్టం చేశారు. రక్తపోటు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు ఆయన వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు ప్రకటించారు.
దీంతో ఆయన అపోలో ఆస్పత్రి నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు. అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం ఈ నెల 14న హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్.. చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 22న ఆయన కూడా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. తాత్కాలికంగా సినిమా షూటింగ్ నిలిపివేయడంతో ఫిలింసిటీలోని హోటల్‌లో ఆయన హోం క్వారంటై¯Œ అయ్యారు. శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా ఆయన అనారోగ్యం బారిన పడటంతో జూబ్లీ్లహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు.