సాక్షి, హైదరాబాద్ : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం రాత్రి కూడా ఆస్పత్రిలోనే ఉండనున్నారు. ఇంటర్నేషనల్ షూట్‌లోని ప్రత్యేక రూమ్‌లో రజనీకాంత్‌కు వైద్య సేవలు అందిస్తున్నారు. కేవలం ఒక్క డాక్టర్ పర్యవేక్షణలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ కే.హరిబాబు నేతృత్వంలోని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కుదటపడితే శనివారం ఉదయం డిశ్చార్ చేస్తామని వైద్యులు తెలిపారు. రక్తపోటును తగ్గించేందుకు మందులు వాడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నందున అభిమానులు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావద్దని వైద్యులు కోరారు. రజనీ వద్ద ఆయన కుమార్తె ఐశ్యర్య ఆస్పత్రిలో ఉన్నారు. కాగా ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్‌లో పలువురు కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం రక్తపోటు అధికం కావడంతో వెంటనే నగరంలోని ఆస్పత్రికి తరలించారు. (రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత)
గవర్నర్ ఆరా..
రజనీకాంత్ ఆరోగ్యంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆరా తీశారు. అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను కోరారు. మరోవైపు తమ అభిమాన నటుడు అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. పెద్ద ఎత్తున అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఆయన క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రజనీ త్వరగా కోలుకోవాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాఘవా లారెన్స్‌తో పాటు పలువురు నటులు ప్రార్థించారు.
అభిమానుల్లో ఆందోళన...
ఇదిలావుండగా డిసెంబర్ 31న పార్టీ ప్రకటన నేపథ్యంలో రజినీ అస్వస్థతతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు రజనీకాంత్ సమాయత్తం అవుతున్నారు. డిసెంబర్ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. మక్కల్ సేవై కర్చీగా(ప్రజా సేవా పార్టీ) రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీకి గుర్తుగా ఆటోను కేటాయించినట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రకటన చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. (రజనీ వెనుక కాషాయం!)
Comments
Please login to add a commentAdd a comment