Diabetes Patients
-
జైల్లో బరువు తగ్గిన కేజ్రీవాల్:మధుమేహం కారణమా?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్ ఖైదీ)లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన జైలులో ఉండటం వల్ల అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు ‘ఎక్స్ ’వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. అయితే ఆయనకు ఆరోగ్య సమ్యలు ఉన్నపటికీ దేశం కోసం 24 గంటలు పని చేసేవారిని ఆతీసీ అన్నారు. కానీ తీహార్ జైలు అధికారులు ఆ ఆరోపణలన్నింటిని కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, షుగర్ లెవెల్స్ కూడా తగ్గలేదని పేర్కొనడం గమనార్హం. అయితే ఇక్కడ మధుమేహ వ్యాధితో బాధపడేవారిలో రక్తంలోని చక్కెర స్థాయిల హెచ్చు తగ్గులు బరువు మీద ప్రభావం చూపిస్తాయా? అలాంటప్పుడు ఏం చేయాలి? తదితరాల విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం!. ఇన్సులిన్ నిర్వహణ: ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు..వారి శరీరం ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయదు. పైగా ప్రతిస్పందించదు. దీని వల్లే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ఎప్పుడైతే శరీరం ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించలేకపోతుందో అప్పుడు రక్తప్రవాహంలో చక్కెర ప్రసరణకు దారితీస్తుంది. ఫలితంగా అదికాస్త కొవ్వుగా పేరుకుపోయి అధిక బరువుకి దారితీస్తుంది. కొందరూ బరువు ఎలా తగ్గిపోతారు.. రక్తంలోని చక్కెర స్థాయిలు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా జరిగితే శరీరం ముఖ్యమైన శక్తి వనరులను కోల్పోతుంది. శక్తి కోసం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగిచదు. దీంతో శక్తికోసం శరీరం ఉన్న కొవ్వు నిల్వలను, కండరాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంద. దీంతో బరువు తగ్గడానికి కారణమవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ టైప్ 1తో బాధపడేవారిలో ఈ పరిస్థితి ఎదురవ్వుతుంది. ద్రవాలను కోల్పోతుంది.. రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు డీ హైడ్రేషన్, నీటి నిలుపదలకు దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కారణంగా మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ వెళ్లపోతుండటంతో నిర్జలీకరణ దారితీసి, శరీర బరవును తాత్కలికంగా పెంచే రీహైడ్రేషన్కి గురై బరువు పెరిగే అవకాశం ఉంటుంది. జీవక్రియ ప్రభావం దీర్థకాలికి వ్యాధి అయిన బ్లడ్ షుగర్ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇక్కడ కణాలలోకి గ్లూకోజ్ పొందాలంటే శరీరానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. ఈ అదనపు ఇన్సులిన్ కొవ్వు నిల్వకు దారితీస్తుంది. ముఖ్యంగా పొత్తి కడుపు ప్రాంతంలో బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. ఎందుకుంటే..? బరువు నిర్వహణకు ఇది అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ఈ వ్యాధిగ్రస్తులు సరైన మందులు వాడుతూ..ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి. అలాగే శారీర శ్రమ, రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా పర్యవేక్షించడం వంటివి చేస్తుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతాం. బరువు కూడా అదుపులో ఉంటుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. వ్యక్తిగత నిపుణులు, వైద్యులు సలహాలు సూచనలతో మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తల తీసుకుని ఆచరిస్తే మంచిది అనేది తెలసుకోవడం ఉత్తమం. (చదవండి: మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్) -
డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే సమస్య. దీన్నే షుగర్ వ్యాధి లేదా మధుమేహం అని కూడా అంటాం. ఇది ఒక్కసారి అటాక్ అయ్యిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సిందే. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇకపై షుగర్ పేషెంట్స్ ఏడాదికి కేవలం మూడుసార్లు మాత్రమే ఇన్సులిన్ తీసుకుంటే సరిపోతుందట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకారం.. భారత్‌లోనే దాదాపు 101 మిలియన్ల మంది (10 కోట్ల మందికి పైనే) మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది.వయసుతో సంబంధం లేకుండా ఏటా భారత్‌లో డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ సమస్యకు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం అనేది లేదు. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే డైట్ పరంగానూ చాలా జాగ్రత్తలు పాటించాలి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకునేలా అనేక ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజూ తప్పకుండా మందులు వాడాల్సిందే. ఈ క్రమంలో డయాబెటిస్ ట్రీట్మెంట్కు సంబంధించి ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు హైడ్రోజెల్ ఆధారిత ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశారు. దీనివల్ల ఏడాదికి కేవలం మూడుసార్లు మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని మొదట ఎలుకలపై ప్రయోగించారు. 42 రోజులకు ఒకసారి ఎలుకలకు హైడ్రోజెల్‌ను ఇంజెక్ట్ చేసి పరిశీలించగా వాటి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌తో పాటు బరువు కూడా కంట్రోల్లో ఉన్నట్లు తేలింది. ఎలుకల్లో 42 రోజుల దినచర్య అంటే మనుషుల్లో ఇది నాలుగు నెలలకు సమానమని సైంటిస్టుల బృందం తెలిపింది. తర్వాతి పరీక్షలు పందులపై ప్రయోగిస్తారు, ఎందుకంటే ఇవి మనుషుల్లాంటి చర్మం, ఎండోక్రైన్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అనంతరం 18 నెలల నుంచి రెండేళ్ల లోపు మనుషులపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని సైంటిస్టులు తెలిపారు. -
షుగర్ పేషెంట్స్.. పచ్చి కూరగాయలు, పండ్లు తింటున్నారా?
ఇటీవలి కాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఆధునిక జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, వంశపార్యపరంగాగా, ఒత్తిడి..ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ప్రస్తుతం వయసులో సంబంధం లేకుండా అందరిలోనూ డయాబెటిస్ సమస్య వస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్లో ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటిస్ అనేది మెటబాలిక్ కండిషన్. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవాలంటే మీ డైట్లో తప్పకుండా ఫైబర్ ఫుడ్‌ని చేర్చుకోవాల్సిందే. ఎందుకంటే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించి..రక్తంలో గ్లూకోజ్ స్పైక్‌లను తగ్గిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగిన పరిమాణంలో ఉంటాయి. స్టార్(సర్వే ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిస్ విత్ ఫైబర్-రిచ్ న్యూట్రిషన్ డ్రింక్) జరిపిన అధ్యాయనంలోనూ ఇదే విషయం వెల్లడైంది. టైప్-2 డయాబెటిస్ ఉన్న సుమారు 3,042మంది రోగులపై ఈ పాన్ ఇండియా సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా మూడు నెలల పాటు ఫైబర్ రిచ్ సప్లిమెంట్స్ తీసుకున్న వారిని ఒక గ్రూపుగా, సప్లిమెంట్ తీసుకోనివారిని మరో గ్రూపుగా విభజించి వారిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది గమనించారు. గ్లూకోజ్ స్థాయి గణనీయంగా తగ్గింది ►HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)స్థాయి గణనీయంగా 8.04 నుండి 7.32కి తగ్గింది ► సుమారు 82% మంది రోగులలో 3కిలోల వరకు బరువు తగ్గడం కనిపించింది. ► సప్లిమెంట్ తీసుకున్న వారు ఉత్సాహంగా ఉన్నట్లు గమనించారు. దీని ప్రకారం..ఫైబర్ రిచ్ సప్లిమెంట్ రోజువారి వినియోగంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎలా నియంత్రిస్తుందన్నది సర్వే ఆధారంగా మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కంట్రోల్లో ఫైబర్ పాత్ర ఎంత ముఖ్యం అన్నది ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిపోయింది. RSSDI, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వంటి సంస్థలు కూడా మధుమేహం ఉన్నవారు తమ డైట్లో రిచ్ ఫైబర్(పీచు పదార్థం) ఫుడ్స్‌ని తీసుకోవాల్సిందిఆ సిఫార్సు చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారు రోజుకి 25-40 గ్రా.ల ఫైబర్ తీసుకోవాల్సిందిగా RSSDI సిఫార్సు చేసింది. మధుమేహం నియంత్రణలో సనైన పోషకాహారం పాటించడం ఎంతో అవసరమని సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ ఎండోక్రైన్ సొసైటీస్ (SAFES) ప్రెసిడెంట్, డాక్టర్ సంజయ్ కల్రా అన్నారు. మధుమేహంతో బాధపడేవాళ్లు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర వినియోగాన్ని తగ్గించడమే కాకుండా ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ని పెంచుకోవాల్సిందిగా తెలిపారు. ఫైబర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం తిన్నా ఎక్కువ తిన్న అనుభూతిని కలిగించడమే కాకుండా, కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలివే.. ►పచ్చి కూరగాయలు, పండ్లు ► గోధుమలు, ఓట్స్ ► బ్రౌన్ రైస్,క్వినోవా, బార్లీ ► జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్ ► బీన్స్, ధాన్యాలు ► అవిసె గింజలు ► బ్రకోలి,యాపిల్ ► స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు,బ్లూబెర్రీలు ► అరటి పండు, అవకాడో మొదలైనవి. -
మనం మారాల్సిందే!
గణాంకాలు వాస్తవ పరిస్థితికి సూచికలు. అనేక సందర్భాల్లో భవిష్యత్ దృశ్యాన్ని ముందుగా కళ్ళ ముందు నిలిపి, గాఢనిద్ర నుంచి మేల్కొలిపే అలారం మోతలు. భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందనీ, అధిక రక్తపోటు సహా జీవనశైలి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికమవుతోందనీ తాజా దేశవ్యాప్త సర్వే వెల్లడించిన అంశాలు అలాంటివే. లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సర్వేలోని అనేక విషయాలు ఇటు ప్రజల్నీ, అటు ప్రభుత్వాలనూ అప్రమత్తం చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు లాంటి జీవనశైలి వ్యాధులపై తక్షణ కార్యాచరణ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. మధుమేహం, అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ)పై అతి పెద్ద సర్వే ఇది. ఇందులో 2008 నుంచి 2020 మధ్యకాలంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 ఏళ్ళు, ఆ పైబడిన వయసువాళ్ళను దాదాపు 1.13 లక్షల మందిని సర్వే చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిధులతో భారత వైద్య పరిశోధన మండలితో కలసి మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఆందోళన రేపుతున్నాయి. 2017లో భారతీయుల్లో 7.5 శాతం మందికే మధుమేహం ఉండేది. 2021 నాటికి ఆ సంఖ్య 11.4 శాతానికి, మరో మాటలో 10.1 కోట్ల మందికి పెరిగింది. అలాగే 15.3 శాతం మంది, అంటే 13.6 కోట్ల మంది మధుమేహం వచ్చే ముందస్తు లక్షణాలతో జీవితం సాగిస్తున్నారు. అంటే ‘టైప్–2 డయాబెటిస్’ అన్న మాట. ఇక, దేశంలో 28.6 శాతం (25.4 కోట్ల మంది) సాధారణ స్థూలకాయంతో, 39.5 శాతం (35.1 కోట్ల మంది) ఉదర ప్రాంత స్థూలకాయంతో ఉన్నట్టు తేలింది. చెడ్డ కొవ్వు (ఎల్డీఎల్ కొలెస్ట్రాల్)తో 18.5 కోట్ల మంది అనారోగ్యం పాలవుతున్నారు. నూటికి 35.5 మందిని అధిక రక్తపోటు వేధిస్తోంది. అసాంక్రమిక వ్యాధులు దేశంపై ఎంతటి భారం మోపుతున్నాయో కనుగొనేందుకు గాను దేశంలోని ప్రతి రాష్ట్రాన్నీ అధ్యయనంలో భాగం చేసిన తొలి విస్తృత స్థాయి అధ్యయనం ఇది. దేశంలో ఎక్కువగా మధుమేహం ఉన్న రాష్ట్రాలు – గోవా (26.4 శాతం), పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం). అలాగే, షుగర్ వ్యాధిపీడితులు తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్లలో సైతం వ్యాధిపీడితుల సంఖ్య సర్రున పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం హెచ్చరిక. ముందుగా అనుకున్నదాని కన్నా భారత జనాభాలో మధుమేహం అధికంగా ఉందని ఈ సర్వేతో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ‘ఇది గడియారం ముల్లు ముందుకు కదులుతున్న టైమ్ బాంబ్’ అని ఈ అధ్యయన సారథి అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి 11 మంది వయోజనుల్లో ఒకరిని మధుమేహం పీడిస్తోందని లెక్క. షుగర్‌తో గుండె పోటు, అంధత్వం, కిడ్నీల వైఫల్యం ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక సరేసరి. ఈ నేపథ్యంలో కాయకష్టం, క్రమబద్ధమైన జీవనశైలి ఉండే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, ఆధునిక జీవనశైలి నిండిన పట్టణాల్లోనే మధుమేహం ఎక్కువగా ఉందనేది ఈ అధ్యయన ఫలితం. ఇది ఓ కీలక సూచిక. మనం మార్చుకోవాల్సింది ఏమిటో చెప్పకనే చెబుతున్న కరదీపిక. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వగైరా వంశపారంపర్యం, ఆహారపుటలవాట్లు, జీవనశైలి ద్వారా వస్తాయనేది నిపుణుల మాట. జన్యుపరంగా కుటుంబంలోనే ఉంటే ఏమో కానీ, ఇతరులు మాత్రం తినే తిండి, బతికే తీరులో జాగ్రత్తల ద్వారా ఈ అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ వచ్చినా... జీవనశైలి మార్పులతో యథాపూర్వ ఆరోగ్యాన్ని పొందవచ్చు. వైద్యులు పదేపదే చెబుతున్న సంగతే తాజా అధ్యయనం సైతం తేల్చింది. ఈ మాటను ఇకనైనా చెవికెక్కించుకోవాలి. మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడు అనివార్యంగా జీవన శైలి మారింది. అది మన ఆహారపుటలవాట్లలో మార్పు తెచ్చింది. చివరకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని మనమే బలిపెట్టుకొనే దశకు చేరుకున్నాం. అందుకే ఇకనైనా అనారోగ్యం తెచ్చే ఆహారపుటలవాట్లు, జీవనశైలి సహా అనేకం మనం మార్చుకోవాలి. మరోపక్క అందుకు తగ్గట్టు ప్రజల్లో చైతన్యం పెంచే బాధ్యత ప్రభుత్వాల పైనా ఉంది. అది ఈ అధ్యయనం చెబుతున్న పాఠం. అలాగే, దేశంలో ఆరోగ్య రక్షణ రంగంలో చేయాల్సిన ప్రణాళిక, చేపట్టాల్సిన చర్యలకు ఈ తాజా సర్వే ఫలితాలు మార్గదర్శకమే. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ ధోరణి ఒక స్థిరీకరణ దశకు చేరుకుంటే, అనేక ఇతర రాష్ట్రాల్లో అది పెరుగుతోంది. ఫలితంగా ఆయా రాష్ట్రాల తక్షణ చర్యలకీ అధ్యయనం ఉపకరిస్తుంది. మరోపక్క అన్నిచోట్లా, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు మరింత అందుబాటులో ఉండేలా చూడాలి. ఫాస్ట్‌ఫుడ్ మోజు, సోమరితనం వల్ల పిల్లల్లోనూ జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న వేళ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు ముఖ్యం. ఆరోగ్యకరమైన తిండి, శారీరక శ్రమ వల్ల టైప్–2 మధుమేహాన్ని నూటికి 60 కేసుల్లో తగ్గించవచ్చట. అందుకని ప్రభుత్వాలు పౌరసరఫరా వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేసి, ప్రజలను ఆరోగ్యదాయక ఆహారం వైపు మళ్ళించవచ్చు. ప్రజల్ని అటువైపు ప్రోత్సహించడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలూ చైతన్యశీల పాత్ర పోషించాలి. ఈ జీవనశైలి వ్యాధులు జాతిని నిర్వీర్యం చేసి, అభివృద్ధిని కబళించే ప్రమాదం పొంచివుంది గనక తక్షణమే తగిన విధానాల రూపకల్పన అవసరం. పరిస్థితులు చేయి దాటక ముందే నష్టనివారణ చర్యలకు నడుంకట్టడం వివేకవంతుల లక్షణం. -
Health Tips: షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అస్సలు మంచివి కావు! వీటిని తింటే..
సాధారణంగా పండ్లు ఎవరికైనా మంచిదే. ఎందుకంటే పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోరకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. కానీ మధుమేహుల ఆరోగ్యానికి కొన్నిరకాల పండ్లు బొత్తిగా మంచివి కావు. ముఖ్యంగా చక్కెర శాతం ఎక్కువగా ఉండేవి. వీటికి దూరంగా ఉండండి! ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. పైనాపిల్, సీతాఫలం, అరటి, సపోటా, మామిడి పండ్లలో అధికమొత్తంలో చక్కెర ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. ఇవి దోరగా ఉన్నపుడు తినొచ్చు! జామ, బొప్పాయి, అరటి వంటి వాటిని బాగా పండినవాటికంటే దోరగా ఉన్నవి మంచిది. ఇవి ఎలా తిన్నా ఓకే! నేరేడు పళ్లు, కివీ పండ్లు ఎలా తిన్నా చెరుపు చేయవు. అయితే తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అలాగే క్యారట్, బీట్రూట్లలోనూ, ఇతర దుంప కూరలలోనూ బీట్రూట్తో పోల్చితే మధుమేహులకు క్యారట్లే మంచిదని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? -
మధుమేహ బాధితులకు 3డీ ప్రింటెడ్ చెప్పులు
బెంగళూరు: మధుమేహ(డయాబెటిస్) బాధితుల కోసం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) డిపార్టుమెంట్ ఆఫ్‌మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు వినూత్నమైన పాదరక్షలు తయారు చేశారు. ఇందుకు కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రిసెర్చ్(కేఐఈఆర్) తగిన సహకారం అందించింది. డయాబెటిస్ బాధితుల్లో కాళ్లకు పుండ్లు పడితే త్వరగా మానవు. దాంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఒక్కోసారి కాలు తొలగించే పరిస్థితి కూడా రావొచ్చు. ఇలాంటి వారి కోసం ఐఐఎస్సీ పరిశోధకులు రూపొందించిన 3డీ ప్రింటెడ్ చెప్పులు చక్కగా పనిచేస్తాయి. కాలు ఎలాంటి ఆకృతిలో ఉన్న దానికి అనుగుణంగా మారిపోవడం వీటి ప్రత్యేకత. నడకను బట్టి చెప్పులు వాటంతట అవే సరిచేసుకుంటాయని పరిశోధకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ చెప్పులు ధరిస్తే కాళ్లకు గాయాలయ్యే అవకాశాలు చాలా స్వల్పమేనని అన్నారు. ఒకవేళ అప్పటికే గాయాలైనా అవి త్వరగా మానిపోవడానికి ఈ చెప్పులు ఉపయోగపడతాయని వివరించారు. -
భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే బ్లాక్ ఫంగస్ కేసులంటేనే జనం భయపడిపోతున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో బ్లాక్ ఫంగస్‌పై వస్తున్న వార్తలు, వ్యాధి సోకిన వారి ఫొటోలు చూసి తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ మధుమేహ బాధితుడు బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళన చెందుతుండటంతో చక్కెర స్థాయిలు తీవ్రంగా పెరుగుతున్నాయని.. అతనికి చికిత్స చేస్తున్న డాక్టర్ చెప్పారు. కరోనా చికిత్స పొందుతున్న వందలాది మంది మధుమేహ బాధితులు అతి తక్కువగా నమోదయ్యే బ్లాక్ ఫంగస్ జబ్బుకు వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా బాగా పేరున్న ఫార్మసీ ఔట్లెట్ల నుంచి చిన్న మెడికల్ షాపు వరకూ కొత్త దందా మొదలెట్టాయి. ఏడెనిమిది రకాల మందులు ఒక కవర్లో పెట్టి జనానికి పప్పు బెల్లాల్లా అమ్ముతున్నాయి. ఒక్కో కిట్‌కు రూ.700 నుంచి రూ.800 వరకూ వసూలు చేస్తున్నాయి. వాటిలో స్టెరాయిడ్స్ ఉండటం వల్ల స్వల్ప లక్షణాలున్న వారు కూడా మోతాదుకు మించి వాడుతుండటంతో వారికి తెలియకుండానే వారిలో షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయి. కొంతమంది అమాయకులు కరోనా రాకుండా ఉండేందుకని ఈ మందులు మింగుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. నిపుణుల సూచన లేకుండా ఇలాంటివి వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా అరుదుగా వచ్చే వ్యాధి కరోనా రాకుండానే చాలామంది ఇళ్లకు మందులు తెచ్చుకుని వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదం. కొంతమంది వైద్యులు కూడా ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇవి ప్రాణాధార మందులు కావచ్చుగానీ.. ఆ తర్వాత ప్రమాదాన్ని కొనితెస్తున్నాయి. మధుమేహం ఉన్నవారికి అత్యంత జాగ్రత్తగా స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంది. బ్లాక్ ఫంగస్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయొచ్చు. లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది చాలా అరుదుగా వచ్చేవ్యాధి. భయపడాల్సిన అవసరం లేదు. – డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరోఫిజీషియన్ -
మరో ముప్పు.. 33 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు
సాక్షి, బెంగళూరు: రాష్ట్రం ఇప్పటికే కరోనా మహమ్మారితో సతమతం అవుతున్న దశలో మరో ఇబ్బంది వచ్చింది. బెంగళూరులో 33 మందికి బ్లాక్ ఫంగస్ సోకింది. వీరికి వివిధ ఆస్పత్రులలో చికిత్సలు అందిస్తున్నట్లు బీబీఎంపీ ఆరోగ్య అధికారి విజయేంద్ర తెలిపారు. కోవిడ్ రోగులకు, కోలుకున్నవారిలో కొందరికి ఈ జబ్బు సోకుతున్నట్లు వార్తలు వచ్చాయి. మధుమేహం ఉన్న కోవిడ్ రోగులకు సోకే ప్రమాదముందని నిపుణులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య అధికారి మాట్లాడుతూ ఫంగస్ సోకిన వారికి వైద్యం అందిస్తూ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనాతో పాటు ఫంగస్‌తో బాధపడే రోగులకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో చికిత్సలందిస్తామని చెప్పారు. త్వరలో చికిత్సా విధానం: మంత్రి రాష్ట్రంలో త్వరలో 780 మంది స్పెషలిస్ట్ వైద్యులతో పాటు మొత్తం 2480 మంది డాక్టర్లను నియమిస్తామని ఆరోగ్యమంత్రి సుధాకర్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ వ్యాప్తిపై కోవిడ్ సాంకేతిక సమితితో చర్చించా, వారు గురువారం నివేదిక ఇస్తారన్నారు. బ్లాక్ ఫంగస్‌కు చికిత్సా విధానం ఏమిటనేది చూడాలి. ఇందుకు మహారాష్ట్రలో ఉచితంగా వైద్యమందిస్తున్నట్లు తెలిసిందన్నారు. కరోనా ఇండియన్ వేరియంట్ బ్రిటిష్ వేరియంట్ కంటే కొంచెం విభిన్నంగా ప్రవర్తిస్తోందని గుర్తించామన్నారు. -
డయాబెటిస్ పేషెంట్స్ ఏ ఆహారం తీసుకోవాలి?
డయాబెటిస్ ఉన్నవారికి వారి బరువునూ, వారు రోజూ చేసే కార్యకలాపాలను బట్టి న్యూట్రిషనిస్టులు వ్యక్తిగతమైన డైట్‌ఛార్ట్ సూచిస్తారు. అయితే ఇక్కడ ఇస్తున్నవి కేవలం ఓ సాధారణ డయబెటిస్ పేషెంట్ ఆరోగ్యకరంగా తీసుకోదగిన / తీసుకోదగని పదార్థాల జాబితా మాత్రమే. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో పీచు, కార్బొహైడ్రేట్స్ వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇందుకోసం పీచు పుష్కలంగా ఉండే జొన్న, మొక్కజొన్న, గోధుమ, దంపుడుబియ్యం, మొలకెత్తిన గింజలు, పళ్లూ, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ►తాజా కూరగాయల్లో పీచు పదార్థాలు, కొన్ని విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవాలి. కొవ్వు పదార్థాలైన నెయ్యి, వెన్న, జున్ను, మీగడ వంటి పదార్థాలను బాగా తగ్గించాలి. వేపుళ్లు పూర్తిగా తగ్గించాలి. డయాబెటిక్ పేషంట్స్ విషయంలో వారు తీసుకునే ఆహారంలో వేపుళ్లు మరీ ఎక్కువగా పెరిగితే... గుండెజబ్బులు వచ్చే అవకాశమూ పెరుగుతుంది కాబట్టి వాటన్నింటినీ బాగా తగ్గించాలని డాక్టర్లు / డైటీషియన్లు సూచిస్తారు. ►ఇక తీపి పదార్థాల విషయానికి వస్తే చక్కెర, తేనె, బెల్లం చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. బ్రెడ్స్, బేకరీ ఫుడ్స్, కార్న్‌ఫ్లేక్స్ వంటి పీచు తక్కువగా ఉండేవి, మైక్రోన్యూట్రియెంట్స్ తక్కువగా ఉండే పదార్థాలను పూర్తిగా తగించాలి డయాబెటిస్ ఉన్నవారు తాము చురుగ్గా ఉండటానికీ, తమలోని చక్కెరను అదుపులో ఉంచుకోడానికీ ఎక్సర్సైజ్ దోహదపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ►ఆహారపు మోతాదు విషయానికి వస్తే... రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలనే ఆహార నియమం పెట్టుకోవాలి. రాత్రి భోజనంలో వీలైనంతవరకు శ్నాక్స్ తీసుకోవడం ఉత్తమం. అయితే ఇవన్నీ ఎవరికివారికే తమ కేస్‌కు తగినట్లుగా డీటెయిల్డ్ న్యూట్రిషనల్ ప్లాన్ అవసరం. అది రోగి బరువు, దైనందిన కార్యకలాపాలు, వారి బ్లడ్ సుగర్ లెవెల్స్, చక్కెరను నియంత్రణలో ఉంచడానికి వాడుతున్న మందుల వంటి అనేక అంశాల ఆధారంగా డీటెయిల్డ్ న్యూట్రిషన్ ప్లాన్‌ను డైటీషియన్లు సూచిస్తారు. (చదవండి: గ్రీన్ టీ, కాఫీతో గుండె జబ్బులకు చెక్! ) -
డయాబెటీస్‌కు కరోనా యమ డేంజర్!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది మధుమేహ రోగులే ఉన్నారంటూ తొలుత వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో సమాధానాలకన్నా ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. కరోనా మృతుల కేసుల్లో మధుమేహంతో బాధ పడుతున్నవారు ఎంత మంది ఉన్నారు ? వారి శాతం ఎంత ? వారిలో టైప్ వన్ మధుమేహ రోగులు ఎక్కువ మంది ఉన్నారా ? టైప్–2 మధుమేహ రోగులు ఎక్కువ మంది ఉన్నారా ? వారు మధుమేహంతో బాధ పడుతూనే కరోనా బారిన పడి మరణించారా? లేదా మధుమేహం కారణంగా సంక్రమించిన ఇతర జబ్బులకు గురై కరోనాను తట్టుకోలేక మరణించారా? లాంటి ప్రశ్నలకు నాడు సమాధానాలు దొరకలేదు. (చదవండి : వాటి ద్వారా కరోనా సోకే అవకాశం తక్కువ!) నాటి ప్రశ్నలకు నేటి సమాధానాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ నెల మధ్య ‘ఎన్హెచ్ఎస్’ నుంచి సేకరించిన డేటా ప్రకారం బ్రిటన్‌లో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారిలో 25 శాతం మంది మధుమేహ (డయాబెటిక్స్) రోగులో ఉన్నారు. ఇది సాధారణ జనాభాలో మధుమేహ రోగుల సంఖ్యకన్నా నాలుగింతలు ఎక్కువ. కరోనా వైరస్ సోకిన వారికి మధుమేహం ఉన్నట్లయితే వారిని ‘సీరియస్ కేసు’గానే పరిగణించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలోనే చేరుస్తున్నారు. అయినప్పటికీ వారిలో ప్రతి నలుగురు మధుమేహ రోగుల్లో ఒకరు మరణిస్తున్నారు. (చదవండి : ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) కరోనా బారిన పడి టైప్–2 మధుమేహంతో మరణిస్తున్న వారి సంఖ్య రెట్టింపుకాగా, టైపు–వన్ మధుమేహంతో మర ణిస్తున్న వారి సంఖ్య మూడున్నర రెట్లు ఎక్కువ కావడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. టైప్ వన్ అంటే చిన్నప్పుడే వచ్చే మధుమేహం. దానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడుతారు. టైప్–టు మధుమేహం అంటే పెద్దయ్యాక లేదా లేట్ వయస్సులో వచ్చేది. శరీరంలో సహజసిద్ధంగా ఇన్సులిన్ ఉత్పత్తి పెంచేందుకు మాత్రలను, చివరకు ఇన్సులిన్ ఇంజెక్షన్‌ను వాడతారు. టైప్–2 లేట్ వయస్సులో వస్తుందికనుక, అప్పటికి వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కాకుండా, ఇతర జబ్బులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని, అలాంటప్పుడు వారిలో మరణాల సంఖ్య ఎక్కువ ఉండాల్సింది, తక్కువ ఉండడం ఆశ్చర్యంగా ఉందని, టైప్ వన్ కేసుల్లో ఎప్పటి నుంచో జబ్బుతో బాధ పడుతుండడం, టైప్–2లో అప్పుడప్పుడే జబ్బు బారిన పడిన వారు ఎక్కువగా ఉండడం అందుకు కారణం కావచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మరింత లోతుగా విశ్లేషణలు జరపాల్సిన అవపరం ఉందని వారన్నారు. -
మధుమేహ రోగులకు ఓ యాప్
న్యూయార్క్: మధుమేహంతో బాధపడుతున్నవారు తమ రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ కొత్త యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. ‘గ్లూకోరాకిల్’అనే ఈ యాప్ ఓ వ్యక్తి తీసుకునే ఆహారాన్ని బట్టి అతనిలోని చక్కెర స్థాయి ఎంత పెరుగుతాయో అంచనా వేస్తుందని అమెరికాలోని కొలంబియా వర్సిటీ మెడికల్ సెంటర్(సీయూఎమ్సీ)కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. అయితే ఏ ఆహారం తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు తమ యాప్ ఉపయోగపడుతుందని సీయూఎమ్సీ పరిశోధకుడు డేవిడ్ అల్బర్స్ తెలిపారు. మొదటగా యాప్‌లోకి రక్తంలోని చక్కెర స్థాయిల వివరాల్ని అప్లోడ్ చేయాలి. అనంతరం వారు తీసుకునే ఆహారాన్ని ఫొటో తీసి.. సుమారుగా దానిలో ఉండే పోషక విలువలను అప్లోడ్ చేయాలి. దీంతో ఈ యాప్ మీరు అప్లోడ్ చేసిన ఆహారం తీసుకున్న తర్వాత చక్కెర స్థాయిలను అంచనా వేసి చూపిస్తుందని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘పీఎల్వోఎస్ కాంప్యూటేషనల్ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మరపు మంచిదే..
ఆవిష్కరణ ప్రముఖ డిటర్జెంట్ యాడ్ నినాదం ‘మరక మంచిదే’ అన్నట్లుగానే ఒక్కోసారి మతిమరపు కూడా మంచిదే! రష్యన్ రసాయనిక శాస్త్రవేత్త కాన్‌స్టంటిన్ ఫాల్బెర్గ్ మతిమరపు ప్రపంచానికి తీపి ఫలితాన్ని ఇచ్చింది. ఈ మతిమరపు శాస్త్రవేత్త ఓసారి ల్యాబొరేటరీలో సాటి శాస్త్రవేత్త ఇరా రెమ్సెన్తో కలసి పనిలో నిమగ్నమైనప్పుడు బాగా ఆకలివేసింది. పనికి బ్రేకిచ్చి, భోజనానికి కూర్చున్నాడు. అయితే, భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం మరచిపోయాడు. దాదాపు సగం భోజనం పూర్తయ్యాక, తాను తింటున్న పదార్థాలు తీపిగా మారడాన్ని గుర్తించాడు. వెంటనే ల్యాబొరేటరీకి వెళ్లి చూశాడు. తాను తయారు చేసిన ఆక్సిడైజ్డ్ రసాయనం ఫలితంగానే తన భోజనం తీపిగా మారినట్లు గుర్తించాడు. ఆ పదార్థానికి ‘శాకరిన్’గా నామకరణం చేశాడు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో చక్కెరకు కటకట ఏర్పడినప్పుడు ‘శాకరిన్’కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. మధుమేహ రోగుల కారణంగా ఇప్పటికీ దీనికి గిరాకీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘శాకరిన్’కు 200 కోట్ల డాలర్ల మార్కెట్ ఉంది. -
మధుమేహాన్ని అధిగమించండి
సకాలంలో సరైన చికిత్సా విధానాన్ని అనుసరిస్తే మధుమేహం ఓ సమస్య కానే కాదు. దాన్ని తేలికగా నియంత్రించండి. భారత్‌లో మధుమేహం కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 5 కోట్ల మంది మధుమేహం రోగులున్నారు. మరో 10 కోట్ల మంది దీని బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటుంది. అదేమిటంటే.. భారతదేశానికి హైదరాబాద్ నగరం ‘మధుమేహ రాజధానిగా’ పిలవబడడం! ఈ మహమ్మారి ఇలా విజృంభించడానికి కారణమేంటి? జీవనశైలితో ముడిపడిన వ్యాధి ‘ఒకేచోట కూర్చుని ఉద్యోగం చేయాల్సి రావడం, శరీరానికి తగిన వ్యాయమం లేకపోవడం, స్థూలకాయం, పని ఒత్తిడి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమబద్ధమైన జీవితం కొరవడడం వంటివి ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. ‘ఇదివరకు వయసు మళ్లినవారిలో మాత్రమే కనిపించే మధుమేహం... ఇప్పుడు 20-30 ఏళ్ల వారిలో సైతం కనిపిస్తోంది’ అని హైదరాబాద్‌లోని రేవా సంస్థకు చెందిన డాక్టర్ ప్రసాద్ చెప్పారు. మధుమేహ వ్యాధిపై పరిశోధన, నివారణ, నియంత్రణ వంటి అంశాలకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనేక విజయాలు తన సొంతం చేసుకుంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేపడితే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చని రేవా వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధిని బట్టి చికిత్స కాకుండా, ఈ వ్యాధి ప్రబలడానికి ముందుగానే దీన్ని పసిగట్టి నివారణ చర్యలు తీసుకోవడం ఈ వైద్య విధానం. ‘మేం సమగ్రమైన చికిత్సా విధానం ద్వారా శరీరంలో బ్లడ్ షుగర్‌ని అదుపు చేస్తాం. తరువాత సరైన ఔషధాలు, పౌష్టిక పదార్థాల ద్వారా శరీరతత్వాన్ని మార్చి ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రిస్తాం’ అని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారు. అయితే, తమకు మధుమేహం ఉన్నట్లు వాళ్లకు తెలియదు. అటువంటివారికి సకాలంలో సరైన చికిత్స అందని పక్షంలో వాళ్లు తీవ్రస్థాయి దుష్పరిణామాలకు లోనుకావడం ఖాయం. ‘మధుమేహం అంత ప్రమాదకర వ్యాధి కాదు. చికిత్స తరువాత చాలామంది ఎంతో ఆనందంగా ఉన్నారు. బ్లడ్ షుగర్ అదుపు చేస్తే.. గుండె, మూత్రపిండాలు తదితర ప్రధాన అవయవాలు సురక్షితంగా ఉంటాయి’ అని డాక్టర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. మధుమేహం గురించి ఇక అంతగా ఆందోళన చెందకండి. మీరు సకాలంలో స్పందిస్తే దాన్ని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు. ఐటఠజీ పూర్తిగా Withdraw చేసి Tablets పై పేషెంట్‌ను Manage చేయవచ్చని డా॥ప్రసాద్ తెలిపారు. - డా॥ప్రసాద్, మెడికల్ డైరెక్టర్ Diabeties Day 10% Discount on Treatment Address: Reva Health Skin & Hair Opp. GVK Entry Gate, Rd.No.4, Banjarahills, Hyd-500034 Mobile No. 8008001225, 8008001235