చతుష్షష్టి కళల్లో హస్తలాఘవం కూడా ఒకటి. దానర్థం దొంగతనమేనని మృచ్ఛకటికం నాటకంలోని శర్విలకుడు అనే దొంగ అభిప్రాయం. కనుక చాకచక్యంగా, కళాత్మకంగా చేసే దొంగతనాన్ని చోరకళగా భావించాలని వాదిస్తాడు. ఓ తెలుగు సినిమాలోని బ్రహ్మానందం పాత్ర కూడా ఇటువంటి అభిప్రా యాన్నే వ్యక్తం చేస్తుంది.
జైలు గదిలో తనతోపాటున్న బ్రహ్మాజీని ఏం చేశావని బ్రహ్మానందం అడుగుతాడు. ఫోర్జరీ అంటాడు బ్రహ్మాజీ. ‘ఫోర్జరీ అంటే ఆర్ట్... ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా?’ అంటూ వాపోతాడు బ్రహ్మానందం. ఇప్పుడు తెలుగు దేశం, దాని మిత్రపక్షాలవారు, యెల్లో మీడియా బాస్‌లు కూడా ఇదేవిధంగా వాపోతున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ పేరు మీద చంద్రబాబు ప్రమేయంతో జరిగిన ఒక స్కామ్‌పై సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. 371 కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన ఈ స్కామ్‌లో 241 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేరిన వైనాన్ని సీఐడీ నిర్ధారించింది. ఈనెల తొమ్మిదో తేదీ ఉదయం 6 గంటలకు ఆయనను నంద్యాలలో అరెస్టు చేసింది.
ఏ సెక్షన్‌ల కింద అరెస్ట్ చేస్తున్నారో తెలియజేసే ఫామ్‌పై (ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్) ఆయన సంతకాన్ని తీసు కున్న దృశ్యం టీవీల్లో కనిపించింది. కానీ తనకు కారణం చెప్ప కుండా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడానికి హెలికాప్టర్‌లో తీసుకెళ్తామని పోలీసులు చెప్పారు. అందుకు ఆయన నిరాకరించారు.
అరెస్టు చేసిన ఇరవై నాలుగ్గంటల్లోగా కోర్టు ముందు ప్రవేశపెట్టవలసి ఉన్నందువల్ల, ఈలోగా సీఐడీ వారు ప్రశ్నించే సమయం ఇవ్వకూడదన్న వ్యూహంతో ఆయన వ్యవహరించి నట్టు కనిపించింది. అందుకే హెలికాప్టర్‌లో కాకుండా తన వాహనంలోనే వస్తానని భీష్మించుకున్నారు. పోలీసులు ఆయన మాటను గౌరవించారు. మొదట అరెస్టవడానికి ఆయన సమ్మ తించలేదు.
మొండికేసే ప్రయత్నం చేశారు. కానీ, తప్పక పోవడంతో తన వాహనంలోకి ఎక్కి కూర్చున్నారు. రోడ్డు మార్గాన నెమ్మదిగా వెళ్తుంటే తన అరెస్ట్ వార్త దావానలంగా వ్యాపించకపోతుందా, వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు దండయాత్రకు రాకపోతారా? జనాన్ని చూసి జడుసుకొని అల్లూరి సీతారామరాజును విడిచిపెట్టి వెళ్లినట్టు పోలీసులు తనను కూడా వదిలేసి తోకముడవకపోతారా అనే రవ్వంత ఆశ కూడా ఏ మూలో ఉండవచ్చు.
మార్గమధ్యంలో దండయాత్రలూ, దండుయాత్రలూ ఎదురు కాలేదు కానీ, ఆయన కోరుకున్నట్టుగానే బాగా ఆలస్యమైంది. సీఐడీ అధికారుల ప్రశ్నలకు సహాయ నిరా కరణలో కొంత సమయాన్ని, విశ్రాంతి పేరుతో కొంత సమ యాన్ని బాబు కరిగించారని సమాచారం. బాబు విజయవాడకు చేరుకోకముందే ఢిల్లీ నుంచి ఖరీదైన లాయర్ల బృందం చేరుకున్నది. కోర్టులో హోరాహోరీగా వాదప్రతివాదాలు జరిగాయి. పది గంటలపాటు జడ్జి ఈ వాదనల్ని విన్నారు.
ఇరువైపుల నుంచీ పలు సందర్భాల్లో సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చివరకు ప్రభుత్వ న్యాయవాది వాదన, రిమాండ్ రిపోర్ట్ అంశాలతో ఏకీభవించి చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. హై ప్రొఫైల్ వ్యక్తికి సంబంధించిన కేసు కాబట్టేమో, సుదీర్ఘ సమయం వాదోపవాదాలు జరిగినా సరే జడ్జి ఓపిగ్గా విన్నారు. తీర్పు వెలువడిన మరుక్షణం నుంచే తెలుగుదేశం – యెల్లో కూటమి, దాని సోషల్ మీడియా బృందాలు వాటి వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి.
జడ్జి మీద వ్యక్తిగతంగా దాడుల్ని ఎక్కుపెట్టారు. ఎక్కడి నుంచి వెతికి పట్టుకున్నారో తెలియదు, అది నిజమో కాదో కూడా తెలియదు గానీ, జడ్జిగారిది బీసీ సామాజికవర్గంగా తేల్చేశారు. ఇంకేముంది... యెల్లో కూటమి పెత్తందారీ దురహంకారం బుసలు కొట్టింది. ‘బీసీలు జడ్జీలుగా పనికిరారు, వారిని నియమించకండి’ అంటూ కేంద్ర న్యాయశాఖకు లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుది.
ఇప్పుడాయన అనుచర గణాలు ఆయన ఆదర్శాన్ని అందిపుచ్చుకొని విశృంఖలంగా చెలరేగి పోతున్నాయి. తీర్పు చెప్పే న్యాయమూర్తుల్లో, ప్రాణం పోసే డాక్టర్లలో, శాంతిభద్రతలు కాపాడే పోలీసుల్లో కూడా కులం నీడల్ని వెతికిపట్టుకునే దౌర్భాగ్యపు పెత్తందారీ దురహంకార సంప్రదాయాన్ని చంద్రబాబు కూటమి పెంచి పోషిస్తున్నది.
పొరపాటున అవతలివారు బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో, మైనా రిటీలో అని తేలితే వారి ప్రతిష్ఠ మీద రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. అందుకే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్యన జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయ పరమైనది మాత్రమే కాదు... అది సామాజిక, సాంస్కృతిక విలువల పోరాటం కూడా!
ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టించిన స్కిల్ కేసు వివరాలను మరోసారి క్లుప్తంగా పరిశీలిద్దాం. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయడం అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తన అనుచరులను తీసుకొచ్చి సంస్థ పగ్గాలను అందించారు.
ఈ సంస్థకూ, డిజైన్ టెక్ అనే ప్రైవేట్ సంస్థకూ, జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకూ మధ్యన ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని వెల్లడిస్తూ మరో జీవోను విడుదల చేశారు. ఈ జీవోలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు సహకరిస్తుంది. ఇందుకోసం ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రాలకు అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ల కొనుగోలు కోసం 3,300 కోట్లు ఖర్చవుతుంది.
ఇందులో 90 శాతాన్ని సీమెన్స్ సంస్థ గ్రాంట్– ఇన్–ఎయిడ్‌గా (ఉచిత సహాయం) సమకూరుస్తుంది. ప్రభుత్వం తరఫున 10 శాతం కింద 330 కోట్లను సమ కూర్చాలి. జీఎస్టీ చెల్లింపులతో కలిపి అది 371 కోట్లు అవుతుంది. ఈమేరకు కుదిరిన ఒప్పంద పత్రంలో మాత్రం గ్రాంట్–ఇన్–ఎయిడ్ ప్రస్తావన గానీ, కుదిరిన తేదీగానీ ఏమీ లేవు.
ప్రభుత్వ వాటాగా 371 కోట్లను తక్షణం డిజైన్‌టెక్ సంస్థకు విడుదల చేయాలని పైనుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. సీమెన్స్ వాటా విడుదల కాకుండానే పది శాతాన్ని ఏకమొత్తంగా విడు దల చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆర్థికశాఖ అధికారులు నోటు ఫైళ్లపై కామెంట్లు రాసినా ఖాతరు చేయలేదు.
పదేపదే పైనుంచి ఒత్తిడి పెరగడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శులు నోటుఫైళ్లపై రాసి సంతకాలు చేశారు. ఆ తర్వాత డిజైన్‌టెక్ సంస్థకు ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా డబ్బులు వెళ్ళాయి. అసలీ డిజైన్ టెక్ సంస్థ పాత్ర ఏమిటి? నేరుగా ఏపీఎస్‌ఎస్‌డీసీనే సీమెన్స్ సంస్థతో వ్యవహారం నడపవచ్చు గదా!
371 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్లను పిలవకుండా ఉండడానికి సీమెన్స్ ఉచిత సాయం కథ ముందుకు తెచ్చారు. ఉచిత సాయం 90 శాతం కింద సాంకేతిక సహకారాన్ని అందిస్తారని మధ్యలో కథ మార్చారు. ఈ డిజైన్‌టెక్ అనే సంస్థది బ్రోకరేజీ పాత్ర. ఈ సంస్థకు చేరిన 371 కోట్లలో 59 కోట్లు వెచ్చించి సీమెన్స్ కంపెనీ నుంచి ఏపీఎస్‌ఎస్‌డీసీకి అవసరమైన పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను తెప్పించారు.
ఈ కొనుగోలు జస్ట్ షాపింగ్ లాంటిదే. ఎవరైనా కొనుక్కో వచ్చు. ఒప్పందాలతో పనిలేదు. స్కిల్ సెంటర్ల కోసం మొత్తంగా చేసిన ఖర్చు ఇదే. దీనికే 3,300 కోట్ల బిల్డప్ ఇచ్చారు. టెండర్ల గోల లేకుండా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కథను అల్లుకొచ్చారు.
డిజైన్ టెక్ సంస్థ మిగిలిన సొమ్ములో 241 కోట్లను పీవీఎస్‌పీ అనే షెల్ కంపెనీకి తరలించింది. ఇది పుణె కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఆ సొమ్ము ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లోని షెల్ కంపెనీల ద్వారా దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీకి తరలివెళ్లింది. వాటి వివరా లను కూడా సీఐడీ తన రిపోర్టులో పొందుపర్చింది.
ప్రభుత్వం ప్రకటించిన విధంగా మొత్తం ప్రాజెక్టు వ్యయా నికి సరిపోయేలా నకిలీ ఇన్వాయిస్‌లను కూడా ఈ పుణె కంపెనీ సమీకరించుకున్నది. దీనికి బ్రోకరేజీ ఫీజు వసూలు చేసి ఉండ వచ్చు. ఇదిగో ఈ షెల్ కంపెనీల మీద జీఎస్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్‌ల భాగోతం బయటపడింది. అప్పటికింకా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉన్నది.
జీఎస్టీ అధికారులు ఈ నకిలీ వ్యవహారాలను రాష్ట్ర ఏసీబీకి ఉప్పందించారు. ఏసీబీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. సూత్రధారి తానే కనుక ఆయన మౌనం వహించారు. ఏసీబీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. మౌనంగా నోట్ ఫైళ్లతో సహా సంబంధిత డాక్యుమెంట్లను కాల్చేయాలని ఆదేశించారు. తదనంతరం రంగంలోకి దిగిన ఈడీ ఈ మనీల్యాండరింగ్ వ్యవహారాన్ని మొత్తం నిర్ధారించింది.
సీమెన్స్ కంపెనీకి ఇండియా విభాగం చీఫ్‌గా ఉన్న సుమన్ బోస్‌తో సహా డిజైన్‌టెక్ ఎంపీ వికాస్ కన్వీల్కర్, మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ సుమన్ బోస్ అసలు పేరు సౌమ్యాద్రి బోస్‌గానూ, డిజైన్‌టెక్ ద్వారా ఏపీతో కుదుర్చుకున్న ఒప్పందంలో సుమన్ బోస్‌గా సంతకం చేసినట్టుగానూ ఈడీ గుర్తించింది.
దొంగ సంతకం దొంగ స్కీమ్‌కు రుజువు కదా! ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ విభాగం ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పూర్వమే కేంద్ర జీఎస్టీ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ ఈ స్కామ్‌ను పసిగట్టాయి.
ఆ కారణంగా సీమెన్స్ ఇండియా ఎండీ సుమన్ బోస్ ఉద్యోగం కూడా ఊడింది. ఈ కేసు మొత్తంలో అన్నిటికంటే ప్రధానమైన అంశం – సీమెన్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)కి 2022, ఫిబ్రవరి మూడో తేదీ నాడు రాసిన లేఖ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదనీ, అసలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ తమ దగ్గర ఏమీ లేదని ఆ లేఖలో కంపెనీ స్పష్టం చేసింది.
కంపెనీ స్వయంగా ఇటువంటి స్కీమ్ లేదని చెబుతుంటే మన చినబాబు, పెదబాబు, యెల్లో మీడియా మాత్రం ఉందని దబాయిస్తున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ఒక జాతీయ మీడియా చానల్‌లో కూర్చొని లోకేశ్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఉత్తర కుమారుడు యుద్ధానికి బయల్దేరితే జనించినంత ఆసక్తి చినబాబు మీడియా డిబేట్‌లపై జనించింది.
కష్టంగా కొన్ని విషయాలు చెప్పాడాయన. అన్నీ టెక్నికల్ విష యాలే! గుజరాత్‌లో సీమెన్స్ కంపెనీ ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్‌ను అమలు చేసిందనీ, దాన్ని పరిశీలించాకనే తాము ఒప్పందం చేసుకున్నామనీ లోకేశ్ చెప్పాడు.
గుజరాత్‌లో జరిగిన ఒప్పంద పత్రంపై సౌమ్యాద్రి బోస్ అని సంతకం చేసిన వ్యక్తి ఏపీ ఒప్పందంపై సుమన్ బోస్ అని చేశాడు. అక్రమ పథకానికి అక్రమ సంతకం, సక్రమ పథకానికి సక్రమ సంతకం అన్న మాట. చివరకు అతను కంపెనీ నుంచి వెళ్లిపోయాడు.
మామూలుగా తాను ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని బెదరగొట్టే విధంగా విరుచుకుపడే ఆర్ణబ్ గోస్వామి చినబాబు విషయంలో కొంత మెతక వైఖరి ప్రదర్శించాడు. మొదటి ఒకటి రెండు ప్రశ్నలు కొంచెం గట్టిగా అడగ్గానే లోకేశ్ కంగారుపడ్డట్టు కనిపించాడు. దాంతో ఆర్ణబ్ కొంచెం నెమ్మదించాడు. ‘లవకుశ’ సినిమాలో ‘ముక్కుపచ్చారని మునికుమారుల చంపకూడదని నే గొంకుచుంటి’ అనే పద్యాన్ని చదువుతున్నప్పుడు ఎన్టీ రామారావు ముఖంలో కనిపించిన ఎక్స్‌ప్రెషన్స్ గోస్వామిలో కనిపించాయి.
ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ తప్పు చేస్తే చైర్మన్ ఎలా బాధ్యుడవుతాడు అని లోకేశ్ ఎదురు ప్రశ్న వేశాడు. అంటే మేనేజర్ స్థాయిలో తప్పు జరిగినట్టు అంగీకరిస్తున్నారా అనే సరికి చినబాబు ఖంగుతిన్నారు. స్కామ్ జరిగితే ఆ డబ్బు ఎక్కడికి చేరిందో సీఐడీ నిరూపించాలి కదా, అలా నిరూపించ లేదని ఆయన ఆఖరి బాణం వదిలారు.
నిరూపించకపోవడమేమిటీ? సీఐడీ నిక్షేపంగా నిరూపిస్తు న్నది. ఈడీ కూడా నిర్ధారిస్తున్నది. షెల్ కంపెనీల ద్వారా సింగ పూర్, దుబాయ్‌లకు డబ్బు చేరిన తర్వాత కథలోకి యోగేశ్ గుప్తా ఎంట్రీ ఇస్తాడు. ఆయన హవాలా మార్గంలో దేశానికి తరలించి, మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందజేస్తారు. పార్థసాని హైదరాబాద్‌లో పెండ్యాల శ్రీనివాస్‌కు (చంద్రబాబు పీఏ) అందజేస్తారు. శ్రీనివాస్ ద్వారా ప్యాలెస్ డెన్‌కు ఆ డబ్బు చేరుతుంది.
సరిగ్గా ఇవే పేర్లు, ఇదే మోడస్ ఆపరెండీని మనం ఐటీ శాఖ వెలుగులోకి తెచ్చిన స్కామ్‌లో కూడా చూశాము. అమరావతిలోని తాత్కాలిక సచివాలయం భవనం కాంట్రాక్టు ఇచ్చినందుకు గాను పల్లోంజీ సంస్థ చెల్లించిన 118 కోట్ల ముడుపులను (600 కోట్ల పనికి) ఇదే పద్ధతిలో తరలించినట్టు ఐటీ శాఖ కనిపెట్టింది.
స్కిల్ స్కామ్‌లో విచారణ కోసం పై ముగ్గురికీ నోటీసులివ్వగానే వారు అందుబాటులో లేకుండా మాయమయ్యారు. యోగేశ్ గుప్తా కనిపించడం లేదు. మనోజ్ పార్థసాని దుబాయ్‌కీ, పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకూ ఉడాయించారు. స్కామ్ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తెలుసు కోవాలన్న ఆసక్తి నిజంగానే లోకేశ్‌బాబుకు ఉంటే ఆ ముగ్గుర్నీ పిలిపించి సీఐడీకి అప్పగిస్తే సరిపోతుంది.
గడచిన మూడు దశాబ్దాలుగా ఎవరికీ దొరక్కుండా కళాత్మకంగా నెగ్గుకొస్తున్న ‘స్కామింగ్‘లో ఇప్పుడు తడబడట మేమిటని యెల్లో కూటమి విస్తుపోతున్నది. ఈ కేసులో అరెస్ట యిన దగ్గర్నుంచీ ఈ శిబిరం నుంచి సాంకేతిక అభ్యంతరాలే తప్ప దొంగతనం జరిగిందా లేదా అనే అసలు విషయం జోలికి వెళ్లడం లేదు. మచ్చుకు కొన్ని చూద్దాం.
ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదు గనుక స్కామ్‌తో తనకు సంబంధం లేదని బాబు వాదిస్తున్నారు. ఇదో వితండవాదం. నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే అనుమానితుల పేర్లతో వేసేది ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్). దర్యాప్తు క్రమంలో అసలు నేరస్తుడు బయట పడొచ్చు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదు గనుక అసలు నేరస్తుడిని వదిలేస్తారా?.. నవ్విపోతారు.
ఈ వ్యవహారంలో తన పాత్ర లేదనీ, ఎవరినీ ప్రభావితం చేయలేదనీ ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ అడుగడుగునా ఈ వ్యవహారంలో ఆయన పాత్రను సీఐడీ దర్యాప్తు నిగ్గుదేల్చింది. ఎపీఎస్‌ఎస్‌డీసీని ఏర్పాటు చేయడం దగ్గర్నుంచి, నిబంధనలకు విరుద్ధంగా తన మనుషుల్ని దానిలో జొప్పించడం వరకు ఆయనదే ప్రధాన భూమిక. హడావిడిగా ప్రభుత్వ వాటాను వెంటపడి విడుదల చేయించిందే నాటి ముఖ్యమంత్రి.
ఇందు కోసం సంబంధిత ఫైళ్లలో 13 చోట్ల ఆయన సంతకాలు చేసిన విషయాన్ని సీఐడీ రుజువు చేసింది. విద్యాశాఖతో సంబంధం లేకుండా నిధుల విడుదలకు ప్రత్యేక గ్రీన్‌ఛానల్‌ను కూడా ఆయన ఏర్పాటు చేశారు. అప్పుడు ఆర్థిక శాఖ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నది. ఇవన్నీ ఎవరు చెబితే చేశారు? అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా తనను అరెస్టు చేయడం కుదరదనీ, తన మీద ఐపీసీ 409 సెక్షన్‌పై కేసు బనాయించడం చెల్లదనీ వాదిస్తున్నారు.
అంతే తప్ప స్కామ్ జరగలేదని వాదించడం లేదు. ఈ రెండు అంశా లపై ఏసీబీ కోర్టులో విస్తృతంగా వాదప్రతివాదాలు జరిగాయి. గౌరవ న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆయనలో వణుకు మొదలైందని సమాచారం. ఈ స్కామ్‌తోనే కేసులు ఆగవని, మరో అరడజన్ కేసుల్లో తాను ఇరుక్కోవడం ఖాయ మని భావిస్తున్నారట! చట్టానికి దొరక్కుండా కొల్లగొట్టే తన కౌశలం ఎందుకిలా కొడిగట్టిందో అర్థంకావడం లేదు.
చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్‌తో సహా బాలకృష్ణ, లోకేశ్ వెళ్లి కలిశారు. ఆయనతో రాజకీయాలేవో మాట్లాడుకొని బయటకు వచ్చిన తర్వాత చేసిన వీరవిక్రమ ధీర గంభీర స్టేట్‌మెంట్ మాత్రం ఆశ్చర్యం కలిగించింది.
ఆయన ప్రకటనలో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది – వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయి. రెండో అంశం – ఇకపై వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పడం! వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఈ రాష్ట్ర జనాభాలో నూటికి తొంభైమందికి ఎప్పుడో తెలుసు.
అంత ఆవేశంగా చెప్పవలసిన కొత్త విషయమేమున్నది ఇందులో! బహుశా జైల్లో చంద్రబాబు ఉపదేశించిన మంత్ర ప్రభావం వల్ల కావచ్చు. ఆయన మాత్రం చాలా ఆవేశపడ్డారు. యుద్ధం స్టోరీ కూడా పాతదే. పేద ప్రజల సాధికారత ఉద్యమంపైన పెత్తందార్ల తరఫున ప్రతిపక్ష శిబిరం ఎప్పటినుంచో యుద్ధం చేస్తున్నది.
పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన బోధన కోసం సాగుతున్న యత్నాలపైనా యుద్ధం ప్రకటించింది. మహిళల పేర్ల మీద ఇళ్లు కట్టించి ఇస్తుంటే యుద్ధ సైరన్ వినిపించింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంటే రణభేరి మోగించింది. పెత్తందార్లు యుద్ధం ఆపిందెప్పుడు?
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
కళాత్మక చౌర్యం
Published Sun, Sep 17 2023 12:39 AM | Last Updated on Sun, Sep 17 2023 11:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment