ఎన్నెన్ని పాపాల్‌... ఎన్నెన్ని శాపాల్‌! | Sakshi Editorial On Chandrababu Skill Development Scam | Sakshi
Sakshi News home page

ఎన్నెన్ని పాపాల్‌... ఎన్నెన్ని శాపాల్‌!

Published Sun, Sep 10 2023 1:11 AM | Last Updated on Sun, Sep 10 2023 10:52 AM

Sakshi Editorial On Chandrababu Skill Development Scam

చేసిన పాపాలు శాపాలై వెంటాడతాయంటారు. ఎన్నెన్ని శాపాలు మనల్ని వెంటాడుతున్నాయో లెక్కవేసి చూశారా బాబుగారూ ఎప్పుడైనా? ఎన్టీ రామారావు గుర్తున్నారా? ఎలా మరిచిపోగలరు? ఈమధ్యనే పురందేశ్వరి కుటుంబంతో కుదిరిన రాజీకి గుర్తుగా సహకుటుంబస్య ఓ చెల్లని బిళ్లను ఆవిష్కరించారు గదా! ఆయనకు మీరూ, మీ సహ నిందితుడైన పత్రికాధిపతి జాయింటుగా చేసిన నమ్మకద్రోహం గుర్తున్నదా? పొడి చిన వెన్నుపోటు జ్ఞాపకమున్నదా? ఆయన చేసిన ఆర్తనాదాలు, పెట్టిన శాపనార్థాలు జ్ఞాపకమున్నాయా? ఆలస్యమైనా సరే ఏ జన్మలో చేసిన పాపపుణ్యాల ఆవర్జా ఖాతాలను ఆ జన్మలోనే ముగించాలి. ఇది మీ సహనిందితునికి కూడా వర్తిస్తుంది.

వంగవీటి మోహనరంగారావు గుర్తున్నారా? కోస్తాంధ్ర నడిగడ్డ మీద ఆయన పొందిన ప్రజాదరణ ఎప్పుడైనా జ్ఞాపకమొస్తున్నదా? అది మీకు కంటగింపుగా మారడం నిజం కాదా? హరిరామజోగయ్యను అడగండి చెబుతారు. మల్లెల బాబ్జీ కూడా తెలుసు కదా! డేర్‌ డెవిల్‌ జర్నలిస్ట్‌ పింగళి దశరథరామ్‌ గుర్తే కదా! ఐఏఎస్‌ అధికారి రాఘవేంద్రరావు తెలిసినవాడే కదా! ఇటువంటి వారి ఆత్మలు కూడా ఎవరినో శపించాయనీ, ఆ శాపాలు లక్ష్యసాధన కోసం ఈ గాలిలో తిరుగుతూనే ఉన్నాయని ఆంధ్ర ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.

తొలివిడత తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిత్వ కాలంలో వ్యవసాయం దండగ అనేది బాబు ఫిలాసఫీ. అందుకు అనుగుణమైన విధానాలు అవలంబించిన ఫలితంగా తెలుగు నాట పంటపొలాలన్నీ మృత్యు బీళ్లుగా మారిన సంగతి ఆయన కూడా మరిచిపోయి ఉండరు. ఆ కాలంలో వేలాదిమంది రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మరికొన్ని వేలమంది పురుగుల మందును ఆశ్రయించారు. వారి కుటుంబాలు ఎంత క్షోభించాయో, ఎంత రోదించాయో, ఎంత శపించాయో ఆయనకెట్లా తెలుస్తుంది? తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు.

రైతు ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన బషీర్‌బాగ్‌ దారుణం గుర్తున్నదా బాబూ! మీ సర్కార్‌ తుపాకుల గర్జనకు నేలకొరిగిన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వాముల కుటుంబాలనడగండి, మిమ్మల్ని ఏమని దీవిస్తారో? క్షతగాత్రులైన డజన్లకొద్దీ యువతీ యువకులను అడగండి, వారు ఎలుగెత్తి మిమ్మల్ని ఏమని సంబోధిస్తారో! మీ ప్రభుత్వం చేసిన కాల్దరి కాల్పుల అమానుషత్వానికి రైతులు చేసిన హాహాకారం మీ చెవుల్లో ప్రతిధ్వనించడం లేదా?

నాగరికతకే మాయని మచ్చను తెచ్చిన ఉదంతం కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌. మహిళలకు అప్పులిచ్చి సమయానికి చెల్లించని వారిపై లైంగిక దాడులకు పాల్పడిన కీచకస్వామ్యానికి కర్తకర్మ క్రియలైన దుర్మార్గులను శిక్షించడానికి బదులు వారికి మీరు వీరతాళ్లు వేసి సత్కరించారు. బాధిత కుటుంబాలు శపించకుండా ఎట్లా ఉంటాయి.

నయీమ్‌ అనే రాక్షసుడికి ప్రాణప్రతిష్ఠ చేసి, గిట్టని వారి మీదకు, ఉద్యమకారుల మీదకు అతడి ముఠాను ఉసిగొల్పిందెవరు? మనకేమీ సంబంధం లేదా బాబు గారూ? కానీ అతని బాధితులైన వందలాది కుటుంబాల వారు ఇప్పటికీ నయీమ్‌తోపాటు మిమ్మల్ని కూడా స్మరించుకుంటున్నారు.

మీ అమానుష పాలనలోని కొన్ని మచ్చుతునకలు మాత్రమే ఇవి. ఇక అవినీతి కథలు కోకొల్లలు. వచ్చిన ప్రతి అవినీతి కథనూ వెంటనే కంచికి పంపడంలో బాబు ప్రావీణ్యం సాధించారు. కానీ ఇప్పుడు కంచి హౌస్‌ఫుల్‌. ఎప్పటికప్పుడు కథల పంచనామా జరిగి తీరవలసిందే!

ఇప్పుడు బాబును అరెస్టు చేసిన కేసులో తాను దొంగతనం చేసినట్టు ఆయనకు తెలుసు. అన్ని ఆధారాలతో సహా దొరికి పోయానని కూడా తెలుసు. కానీ అలవాటు ప్రకారం ఆయన బుకాయింపులనే ఆశ్రయించారు. అవినీతికి సంబంధించిన ఆరోపణలను  ఎదుర్కోవడంలో ఆయనకు ఒక విజయవంత మైన వ్యూహం ఉన్నది.

యెల్లో మీడియా సహకారంతో ఒళ్లంతా నోరు చేసుకొని అదిలించడం, బెదిరించడం మొదటిదశ. ఆరోపణలు చేసినవారు విజయవంతంగా ఈ దశను దాట గలిగితే తనకున్న వ్యవస్థల నియంత్రణా నైపుణ్యాన్ని వెలికి తీస్తారు. న్యాయస్థానాల్లోనూ, దర్యాప్తు సంస్థల్లోనూ కేసు కదలకుండా ఉండేందుకు స్టే భిక్షను యాచిస్తారు. ఈ విధంగా సాఫీగా సాగిపోతున్న ఆయన అవినీతి జీవనయాత్రకు సడన్‌గా ఒక పెద్ద కుదుపు.

వాములు మింగే స్వామికి గడ్డిపోచ ఫలహారం అంటారు. మన స్కాములు మింగే స్వామికి రెండు ఫలహారం గడ్డిపోచలే గొంతుకు అడ్డంపడి బండారం బయటపెట్టాయి. అలా బయట పెట్టింది కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలేనన్న విషయం ఇక్కడ గమనించాలి. ఒక స్కామ్‌ను ఇన్‌కమ్‌ట్యాక్స్‌ వారు పట్టు కున్నారు.

ముంబైలో మనోజ్‌ వాసుదేవ పార్థసాని అసోసియేట్స్‌ సంస్థలో వారు వేరే కేసులో సోదాలు చేస్తుండగా ఈ తీగ దొరికింది. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం కాంట్రాక్టును దక్కిచుకున్న షాపూర్‌జీ పల్లోంజి సంస్థకూ, ముఖ్యమంత్రికీ మధ్య ఈ పార్థసానిది బ్రోకరేజీ పాత్ర.

అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి 600 కోట్ల కాంట్రాక్టును ఇచ్చినందుకు గాను 119 కోట్ల రూపాయలను ముడుపులుగా షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చినట్టు ఐటీ వారికి పక్కా ఆధారాలు దొరికాయి. దాంతో వారు బాబుకు నోటీసులు పంపించారు. ఈ కేసులో కూడా బాబు స్పష్టమైన సమాధానం చెప్పకుండా బుకాయించడాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ, కేసు నుంచి బయటపడటం బాబుకు సాధ్యం కాకపోవచ్చు.

చంద్రబాబు అరెస్టయిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ పట్టపగటి నిలువు దోపిడీతో సమానం. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉపాధి కోసం శిక్షణ ఇవ్వాలని సంకల్పిస్తున్నట్టు ఒక జీవోను విడుదల చేశారు. ఇందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్‌ అనే మల్టీనేషనల్‌ సంస్థతో రాష్ట్ర విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్టు జీవోలో పేర్కొన్నారు.

కానీ జీవోలో చెప్పిన దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) అనే కొత్త సంస్థను విద్యాశాఖకు బదులుగా రంగంలోకి దించారు. సీమెన్స్, ఎస్‌డీసీ, డిజైన్‌ టెక్‌ అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరినట్టు ప్రకటించారు.

ఈ ఒప్పందం ప్రకారం 3,300 కోట్ల రూపాయల విలువైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు 90 శాతం నిధులు గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్‌గా సీమెన్స్‌ అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పదిశాతం సమకూరిస్తే చాలు. ఒక ప్రైవేట్‌ సంస్థ మన దగ్గర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం మూడు వేల కోట్లు ఉదారంగా ఇవ్వడమేమిటని ఆశ్చర్యపోవద్దు. స్కామ్‌లంటేనే ఇలాంటి అనేక ఆశ్చర్యాలుంటాయి.

సీమెన్స్‌ నుంచి ఒక్క పైసా విడుదల కాకుండానే రాష్ట్ర ప్రభుత్వం డిజైన్‌టెక్‌ కంపెనీకి తన వాటా పది శాతంతోపాటు జీఎస్‌టీ కలిపి రూ.371 కోట్లను విడుదల చేసింది. అయితే ఈ ఫైలుపై సంతకం చేయడానికి నాటి ఛీఫ్‌ సెక్రెటరీ ఐవైఆర్‌ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒప్పందం ప్రకారం సీమెన్స్‌ నుంచి నిధులు విడుదలైతే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయాలి. ఇది ఆనవాయితీ. కానీ ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్‌చేసి విడుదల చేయాలని చెప్పడంతో సీఎస్‌ ఆ విషయాన్ని స్పష్టంగా ఫైల్‌పై పేర్కొని విడుదల చేశారు.

ఇంత కంటే స్పష్టమైన ఆధారం ఏముంటుంది? సీమెన్స్‌తో ఒప్పందం ఒక డ్రామా అని రుజువైంది. సీమెన్స్‌ తరఫున ఇండియా విభాగం హెడ్‌ను రంగంలోకి దించి బాబు కథ నడిపించారు. విషయం అసలు కంపెనీకి తెలియగానే ఇండియా హెడ్‌ రాజీ నామా చేశారు. ఈ ఒప్పందంతో తమ సంస్థకు  సంబంధం లేదని సీమెన్స్‌ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం డిజైన్‌టెక్‌ సంస్థకు విడుదల చేసిన నిధుల్లో రూ.241 కోట్లు చంద్రబాబు సృష్టించిన షెల్‌ కంపెనీల ద్వారా సింగపూర్, దుబాయ్‌లలోని ఖాతాలకు బదిలీ చేశారు. అవి హవాలా మార్గంలో ముంబైకి చేరాయి. ఆ క్యాష్‌ను యోగేశ్‌ గుప్తా తీసుకుని మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసానికి అందజేశారు. మనోజ్‌ హైదరాబాద్‌కు తెచ్చి చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు అప్పగించారు.

పెండ్యాల శ్రీనివాస్‌ జూబిలీహిల్స్‌ ప్యాలెస్‌కు చేర్చారు. ఐటీ కుంభకోణంలో కూడా మనకు అచ్చంగా ఇవే పేర్లు కనిపించాయి. ఐటీ నోటీసుల విషయం మీడియా ద్వారా బహిర్గతం కాగానే మనోజ్‌ దుబాయికి, శ్రీనివాస్‌ అమెరికాకు పారిపోయినట్టు సమా చారం. యోగేశ్‌ గుప్తా అడ్రస్‌ లేడు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం చంద్రబాబు అధికారంలో ఉండగానే వెలుగు చూసింది. డిజైన్‌టెక్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్ల రూపాయలను చెల్లించడం కోసం పుణేలో వుండే షెల్‌ కంపెనీల నుంచి నకిలీ ఇన్వాయిస్‌లను తెప్పించింది. ఈ కుంభకోణం 2015లో జరిగింది.

2018లో పుణే షెల్‌ కంపెనీలపై జీఎస్టీ అధికారులు జరిపిన సోదాల్లో మన నకిలీ ఇన్వాయిస్‌ల భాగోతం బయటపడింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర ఏసీబీకి జీఎస్టీ ఆధికారులు చేరవేశారు. ఏసీబీ కూడా ఈ విష యాన్ని అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. కానీ సీఎం మౌనాన్ని అర్థం చేసుకున్న ఏసీబీ ఈ కేసులో ముందుకు వెళ్లలేదు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా రంగంలోకి దిగి కొన్ని అరెస్టులు చేసింది. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న ఘటన పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ‘నన్ను అరెస్టు చేస్తారట. ప్రజలంతా నా చుట్టూ రక్షణగా నిలబడా’లంటూ అప్పట్లో బహిరంగ సభల్లో చంద్రబాబు విజ్ఞప్తులు చేయడం కూడా తెలిసిందే.

అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబే ముఖ్యమంత్రి. అప్పుడున్న ఆరోపణల కొనసాగింపే ఈ రోజున జరిగిన పరిణామం. దీనికి రాజకీయ రంగు పులిమి జగన్‌ ప్రభుత్వ కక్షసాధింపుగా కొందరు వ్యాఖ్యానించడాన్ని విజ్ఞతా రాహిత్యంగానే భావించాలి. రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణాల్లో మాత్రమే కాదు... ఫైబర్‌ నెట్‌లో కూడా చంద్రబాబు దొరికిన దొంగ! మరో అరడజన్‌ స్కాముల్లో కచ్చితంగా దొరకనున్న నిందితుడు!!

అందుకే ఆయన్ను అరెస్టు భయం వెన్నాడుతున్నది. ఢిల్లీ పెద్దల మద్దతు కోసం ఏడాది కాలంగా బాబు చేస్తున్న ప్రయత్నాలు కూడా అందుకే! ఎన్టీఆర్‌ కూతురే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్నందున అవసరమైతే ఆ సాకుతో తన పార్టీని విలీనం చేస్తానన్నంత దాకా చంద్రబాబు వెళ్లినట్టు సమాచారం.

ఈ బిస్కట్‌తోనే దగ్గుబాటి కుటుంబాన్ని ఆయన దారిలోకి తెచ్చుకున్నట్టు వినికిడి. చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నిసార్లు మోసపోయినా మళ్లీ మళ్లీ సరికొత్తగా మోసపోవడమే దగ్గుబాటి కుటుంబం ప్రత్యేకత కాబోలు. ఢిల్లీ రాయబారం సీన్‌ పండ లేదమో! మొన్నటికి మొన్న కూడా బహిరంగ సభల్లో ‘నన్ను అరెస్టు చేస్తారట తమ్ముళ్లూ’... అంటూ మొరపెట్టుకున్నారు. ‘నేను నిప్పులా బతికినవాడిని.

నన్నెవరూ తాకలేర’ని బీరాలు పోవడం కూడా చూశాము. నిప్పు కథలూ, పప్పు కథలూ నెమ్మదిగా క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. ఈ కేసులో చంద్రబాబు, అచ్చెన్నాయుడులతోపాటు లోకేశ్‌ పాత్రపై కూడా దర్యాప్తు అధికారులు కీలక సాక్ష్యాలు సేకరించారు. ఫైబర్‌ నెట్, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణాల్లో కూడా లోకేశ్‌ పాత్ర సందేహాలకు అతీతంగా రుజువైనట్టు విశ్వసనీయ సమాచారం. నేడో రేపో చినబాబు అరెస్టు కూడా తప్పకపోవచ్చు!

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement