
సాక్షి, అమరావతి: సాహిత్యం అంకాత్మక (డిజిటల్) వేదికలనూ ఆక్రమిస్తోంది. సాంకేతిక తరంగాలపై సరికొత్తగా వెలుగుతోంది. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, షేర్ చాట్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, వాట్సాప్, జూమ్, గూగుల్ మీట్ వంటి సోషల్ మీడియా యాప్‌లతోపాటు ప్రత్యేక బ్లాగుల్లోనూ తెలుగు సాహిత్యం విస్తరిస్తోంది. మరుగున పడుతున్న కళలను, కళాకారులను వెలుగులోకి తీసుకువస్తున్న సామాజిక మాధ్యమాల్లో ఇటీవల సాహిత్య రచయితలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అంతర్జాతీయంగా వారందరినీ ఏకం చేస్తూ.. సాహిత్య పరిమళాలను అంతర్జాలంలో వెదజల్లుతోంది.
సామాజిక మాధ్యమాల ప్రవేశంతో..
సాహిత్యం పద్య ప్రక్రియ నుంచి చంపూ కావ్యాలుగా, ద్విపదలుగా, వచన గద్యాలుగా, గేయాలుగా, పాటలుగా అనుకూలతలను బట్టి ఆధునిక కాలానికి పయనం సాగించింది. వ్యాసాలు, కథానికలు, నవలలు, రుబాయిలు, గజల్స్ వంటివి సైతం ఇలా వచ్చినవే. ఆ తరువాత నానీలు, హైకూలు, నానోలు, మెరుపులు, త్రిపదలు అంటూ అనేక ప్రక్రియలతో రచయితలు జన బాహుళ్యంలోకి చొచ్చుకుపోయారు. సామాజిక మాధ్యమాల ప్రవేశంతో ఆధునిక సాహిత్య ప్రక్రియలు సైతం వాటి రూపాలను మార్చుకుని మరింతగా ప్రపంచంలో విస్తరించడం మొదలైంది.
అలవోకగా, ఆటవిడుపుగా తమ భావాలకు అక్షర రూపం కల్పించే ఎందరో రచయిత(త్రు)లకు, అనేక సరికొత్త ప్రక్రియలకు సోషల్ మీడియా వేదికైంది. ఛందస్సు ఆధారంగా కొన్ని ప్రక్రియలు రూపొందగా, నిర్వాహకులు మరికొన్ని ప్రక్రియలను పరిచయం చేస్తున్నారు. అలా సమ్మోహనాలు, పెన్ కౌంటర్లు, షాడోలు, సున్నితాలు, సూర్య వర్ణాలు, పంచపదులు, నవరత్నాలు, సిసింద్రీలు, హరివిల్లు, కిటుకులు, దోహాలు వంటి ఎన్నో రకాల ప్రక్రియలు రూపొందాయి. సోషల్ మీడియా వేదికగా సాహితీ సంస్థలు కోకొల్లలుగా వెలిశాయి.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యకారులను సోషల్ మీడియా వేదికలపై ఏకం చేస్తూ.. తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్నాయి. నిత్యం అనేక ప్రక్రియలపై పోటీలు సైతం నిర్వహిస్తూ సర్టిఫికెట్లను డిజిటల్‌గానూ, పోస్టులోనూ అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. తెలుగు సాహిత్యం ప్రజ్వరిల్లేలా అంతర్జాల సమావేశాలను నిర్వహిస్తున్నాయి. కాగా, కొన్ని సంస్థలకు ఎటువంటి ప్రామాణికం లేకపోవడం, వారిచ్చే గుర్తింపు పత్రాలపై ఎలాంటి రిజిస్ట్రేషన్ నంబర్లు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితేనేం తెలుగు భాష ప్రాచుర్యానికి దోహదపడే ఏ పదమైనా, ఏ ప్రయత్నమైనా గొప్పదేననే వాదన కూడా ఉంది.
ఆత్మ పరిశీలనతో రచనలు చేయాలి
ఒకప్పుడు రచనలు ప్రచురితం కావాలంటే పత్రికలకు పంపించి రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. అవి ప్రచురించిన తరువాత పాఠకుల్లోకి వెళ్లి వారు చదివి తమ స్పందనను తిరిగి లేఖల రూపంలో పత్రికకు పంపితేగానీ రచన ఎలా ఉందనేది తెలిసేది కాదు. ఇప్పుడలా కాదు. రాసిన వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు.
క్షణాల్లో అందరికీ చేరిపో తోంది. స్పందన కూడా వెంటనే వచ్చేస్తోంది. కళాకారులైనా, రచయితలైనా తమ ప్రయత్నానికి వెంటనే ఫలితం రావాలని కోరుకుంటుంటారు. కా కపోతే పత్రికల్లో ఉన్నట్టు ఇక్కడ ఎడి టర్లు ఉండరు. అందుకని రచయితలు ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుని, సమాజా నికి పనికివచ్చే మంచి రచనలు చేయాలి.
– పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ రచయిత్రి
అడ్మిన్లు బాధ్యతగా ఉండాలి
సోషల్ మీడియా ప్రభావం నేటి తరం రచయితలపై చాలా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా వేదికలపై ప్రదర్శనలకు వస్తున్న రచనలపై ఎలాంటి నియంత్రణ ఉండటం లేదు. దీనివల్ల కొందరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వాటిలో సాహిత్య సమూహాలను నడిపే నిర్వాహకులు (అడ్మిన్స్) ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి.
ఇతరులకు ఇబ్బంది కలిగించే సాహిత్యాన్ని వారు వెంటనే తొలగించాలి. భాషకు సంబంధించి తప్పొప్పులను నిస్సంకోచంగా సభ్యులకు తెలియజేస్తుండాలి. ఇలా చేయగలిగితే సోషల్ మీడియా వల్ల తెలుగు సాహిత్యానికి మంచి జరుగుతుంది లేదంటే తాము రాసిందే గొప్పఅనుకుని, కొందరు బాగుందని చెప్పగానే ఇక భాషపై పట్టు సాధించేశామనుకుంటున్నారు. అది సాహిత్యానికి మంచిది కాదు.
– నారంశెట్టి ఉమామహేశ్వరరావు, ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ(బాల) పురస్కార గ్రహీత
సంఘర్షణ పెరుగుతోంది
సోషల్ మీడియాలో సాహిత్య వేదికల వల్ల అనేక రకాల రచనలు, కవితలు, కథలు వెలుగులోకి వస్తున్నాయి. భిన్న భావజాలాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల కొంత సంఘర్షణ పెరుగుతోంది. అది మంచా.. చెడా అనేది చెప్పడం సాధ్యం కాదు. భాషతో పనిలేకుండా తమకు వచ్చింది రాస్తున్నారు. గతంలో తమ భావాలను చెప్పలేకపోయిన వారు ఇప్పుడు స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నారు.
ఇలా భిన్నాభిప్రాయాలు రావడం అనేది గొప్ప పరిణామం. సోషల్ మీడియాలో వస్తున్న ఈ మొత్తం భావజాలం అంతా సమాజానికి ప్రతిబింబం వంటిది. ఇది కొందిరికి కష్టం కలిగించవచ్చు. కానీ దీనిని పాలకులు, ప్రభుత్వాలు గమనిస్తుంటే సమాజంలో ఏం జరుగుతుందో, జనం ఏమనుకుంటున్నారో కూడా తెలుస్తుంది.
– కొలకలూరి ఇనాక్, ప్రముఖ రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత
ఎవరిష్టం వారిది
ఎవరికి వారు రచనలు చేసేందుకు సోషల్ మీడియా దోహదపడుతోంది. సంఘంలో జరిగే పరిణామాలు, సమాజంలో ఎదురయ్యే అనుభవాలనే తమ రచనలుగా మలుస్తున్నవారు చాలా మంది ఉన్నారు. వాటిలో ఎలాంటి కట్టుబాట్లు లేవు. ఉండకూడదు. భాషకంటే ఇక్కడ భావమే ముఖ్యం. అన్ని రచనలకూ స్టాండర్డ్స్ ఉండాలని గిరిగీస్తే మంచి రచనలు కూడా రాకపోవచ్చు. ఒక్కొక్కరూ తమ జీవితంలో జరుగుతున్న ఘటనలనే కథలుగా, కవితలుగా రాస్తున్నారు. అవి ఎంతోమందిని కదిలిస్తున్నాయి. స్ఫూర్తి నింపుతున్నాయి.
– కొచ్చెర్లకోట జగదీష్, డిజిటల్ క్రియేటర్, రచయిత
Comments
Please login to add a commentAdd a comment