
ఇచ్చట అంతా క్షేమం
అచ్చట మీరు క్షేమమని తలుస్తాను
ఇప్పుడు క్షణక్షణం
ఊపిరిని తడుముకోవాల్సి వస్తుంది
ఇంట్లో ఒక్కోగది వంతులవారీ
ఒంటరి చిరునామా అయి మిగిలిపోతుంది
భయం భయంగా భూగోళం
పల్సాక్సీ మీటర్ మీద తొంభైఐదో అంకెను
అంటిపెట్టుకు తిరుగుతుంది
చావుబతుకుల నడిసంధ్యలో
పూర్వీకుల పీకపిసికేసి
ఆబ్దికం అట్టహాసంగా చేసినట్టు
ఆక్సీమాస్కులో ఆయువు
దాగుందని అర్థమయ్యాక
నరికెయ్యబడిన చెట్లమొదళ్ల దగ్గర
నైవేద్యాలిచ్చుకుందామా..?!
ఒకపక్క లోకాన్ని
ప్రాణంతొలుచు పురుగు తినేస్తుంటే
పాలక దిగ్దర్శకులు
మెలోడ్రామా పండించడం కోసం
సృష్టిస్తున్న హైడ్రామాల్ని అమాంతం మింగేసి
విషాదం తేనుస్తుంది
ఇప్పుడీ దేశం ఒక ఆసుపత్రి
ఇప్పుడీ దేశం తెరిచి వుంచిన శవాలకొట్టం
ఇప్పుడీ దేశం అతిపెద్ద శ్మశానవాటిక
ఎవడికివాడు చడీచప్పుడు లేకుండా
క్రతువుల్ని కాలదన్ని
కాలిపోతూ బతికిపోతున్నాడు
కాలం మాత్రం ఎక్కడికక్కడ
తుంపు తుంపులై తెగిపోయి
మళ్ళీ అతుక్కుని పరిగెడుతున్న
మాయావిలా వుంది
ఇచ్చట అంతా క్షేమం
అచ్చట మీరు క్షేమమని తలుస్తాను
-బంగార్రాజు
► మందోట
పల్లేరు కాయలపై నడక యాతన తెలుసు
నల్లాలంతో గాయాల్ని మాన్పే మహిమ తెలుసు
ఎర్రటి ఎండలో మాను లేక ఎండిన
ఎడతెరిపి వానకు గొడుగు లేక తడిచిన
ఎముకలు కొరికే చలికి గొంగళి లేక వణికిన
కటిక చీకట్లో కందెనదీపం లేక నడచిన
కందిరీగలు కుట్టి కందిపోయినోన్ని
కందిచెట్ల నీడలో కునుకు తీసినోన్ని
మోటబావుల్లో ఈతకొట్టినోన్ని
ఊట చెలిమెల్లో నీళ్లు తాగినోన్ని
గడ్క అంబలి తిన్న కడ్పు నాది
ఉడ్కపోతలో ఉడ్కిన పెయ్యి నాది
అవును! నేను–
ఆవుల కాపరినే !!
అట్టడుగున ఉన్న వాణ్ణి
అందరి బాధలు చుసిన వాణ్ణి
-డా. మల్లెత్తుల సత్యం యాదవ్
► ఏ యిజమైనా ఒక పెను
మాయగ సత్యమును దాచు మార్గముగానే
పోయెను గానీ మరిపో
నీయదు నరుని ముందుకిసుమంతైనా!
(అబ్బూరి వరదరాజేశ్వరరావు ‘కవితా సంచిక’ నుంచి)
► ఇందిరమ్మ గుట్టు ఎరుగుట కష్టంబు
ధాతకైన వాని తాతకైన
విబుధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపరుతు
(గజ్జెల మల్లారెడ్డి చాటువు)
► లంచము పంచక తినకుము
కొంచెంబేనైన చేత గొనకుము సుమ్మీ
లంచంబు పట్టువారికి
కించిత్తు రాల్చకున్న కీడగు కుమతీ!
(‘ఇతశ్రీ’ కలంపేరుతో పుల్లెల శ్రీరామచంద్రుడు సుమతీ శతకానికి రాసిన పేరడీ నుంచి)