
మానసిక గాయాలకి
మందులు కావాలిప్పుడు
నాన్నేడని అడుగుతున్న పిల్లలకి
మాయ మాటలు చెప్పాలిప్పుడు
నిన్న మొన్నటి వరకు
గడపదాటని ఇల్లాలికి
బాహ్య ప్రపంచాన్ని
పరిచయం చేయాలిప్పుడు
కన్నీటి కాలువలకు
ఆనకట్టలేయాలిప్పుడు
ధైర్యాన్ని నూరిపోసి
లేపనంగా రాయాలిప్పుడు
అడుగులు తడబడకుండా
వెన్ను తట్టే చేతులు కావాలిప్పుడు
ఆగిన పరుగుపందాల్ని
బరిలో నిలపాలిప్పుడు
చితికిన బ్రతుకులకి
భరోసా ఇవ్వాలిప్పుడు
అంధకారాన్ని ఛేదించి
వెలుగులు పులుముకునేలా
కొత్త గమ్యాన్ని చూపించాలిప్పుడు.
-యం.యస్.రాజు
► నిదురించని చంద్రుడు
వేగంగా వచ్చి గాలి
నిదురోతున్న కళ్ళను తట్టిలేపింది.
వెన్నెల కురుస్తున్న రేయి కిటికీలోంచి
అద్భుత చిత్రంలా కనిపిస్తోంది.
ఆకాశం
వెన్నెల గాఢతను మోయలేక
చందమామను
బావిలోకి విసిరేసింది.
నింగిలో ...
నీటి బావిలో...
పున్నమి చంద్రుడి
ద్విపాత్రాభినయం.
పంట కాపరి గొంతులోంచి
వెన్నెల పాటను వినిపించడానికి
గాలి
వారధి కడుతోంది.
ఒడ్డున సేదతీరిన నావ!
జాబిలమ్మ
జాణతనం తిలకిస్తూ...
జాగరణ చేస్తోంది.
పున్నమి రేయిని గుర్తెట్టుకుని
వీధి దీపం
విశ్రాంతి తీసుకుంటుంది.
చెరువులో కలువ...
వెన్నెలతో కబుర్లు ...
చెవులు మూసుకున్నాయి
చేపలు.
నిటారు చెట్టు...
నిలువెత్తు గట్టు...
వెన్నెల వెలుగులో
వేకువ దాకా...
మాట్లాడుకున్నాయి.
చందమామ కథలు వింటూ...
అమ్మ ఒడిలో ఒదిగిన
చంటి పిల్లాడ్ని
అసూయగా చూస్తూ...
ఆకాశంలో... రేయంతామేల్కొన్నాడు
పున్నమి చంద్రుడు.
-ఎ.నాగాంజనేయులు
మేలిమి పద్యం
► హృదయ మది మహోదయమై,
ఉదయ మది నవోజ్జ్వలమయి, యుర్వి వెలింగెన్
హృదయమిది మరణ జయమై,
ఉదయమిది బహూదయమయి, యుర్విన్నిలుచున్!
(కొలకలూరి ‘ఉజ్జీవజ్యోతి’ ఖండిక నుంచి)
► అధరసీధు వేదొ ఆసవం బేదొ యె
రుంగ లేడు గాదె, దొంగవోలె
ఏల చొచ్చె పానశాల, గులాబీల
పాల కంటకమ్ము వోలె వడు?
(దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘ఉమర్ ఖయామ్’ నాటిక నుంచి)
► భూస్వామ్య ధనస్వామ్య బ
లస్వామ్యములేను గాక రహిలో గల ఏ
ఏస్వామ్యమైన బెదరు భ
యస్వామ్యము కుట్ర పన్నె హతమార్చగ నిన్
(జె.బాపురెడ్డి ‘హృదయపద్యం’ నుంచి)
► చదువు సందె వద్దు శాస్త్రపాండితి వద్దు
మంచిచెడ్డ లరయ మనసు వద్దు
గద్దె ఒకటి చాలు ఘనుడనిపించగా
కంటి నలుసుర పులికంటి మాట
(పులికంటి కృష్ణారెడ్డి ‘ఆటవెలదుల తోట’ నుంచి)
Comments
Please login to add a commentAdd a comment