దట్టమైన అడవిలో,చిమ్మ చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు | The Chandagarh Forest Story Behind True Emotions And Inspiration | Sakshi
Sakshi News home page

దట్టమైన అడవిలో,చిమ్మ చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు

Published Fri, Nov 10 2023 12:44 PM | Last Updated on Fri, Nov 10 2023 4:19 PM

The Chandagarh Forest Story Behind True Emotions And Inspiration - Sakshi

1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్‌లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి. జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు.

‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్…’’ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు… గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె. అయోమయంగా చూశాడు డాక్టర్. ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… ‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి… ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది… ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు… తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు… ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు… కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు… డాక్టర్ కదా… ఊరుకోలేకపోయాడు…నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు… ఆమెను అడిగాడు… ‘అసలు ఎవరు నువ్వు..? ఇక్కడికి ఎలా వచ్చావు..?

’‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు… నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ… ‘‘మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు… అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు… అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను… ఈ కడుపు ఆ ప్రేమ వల్లే… కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు… ఇటువైపు ఎవరూ రారు… నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు…’’ అంటూ రోదించసాగింది…డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది… కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు… పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది… డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి… నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్…

’కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు… పిల్ల ఏడ్చింది… ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి… అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే… తన జీతమే 75 రూపాయలు… ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది… ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు… ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు…‘‘సంతోషమో, దుఖమో.. మన చేతుల్లో ఏమీ లేవు… జరిగిందేదో జరిగిపోయింది… అన్నీ మరిచిపో… నీ జీవితం నీది… ప్లాన్ చేసుకో… ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది… అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు… వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు… తను తప్పక సాయం చేస్తాడు… ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు…

ఏళ్లు గడిచాయి… కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు… ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు… అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు… ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది… ‘సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా..?’ అనడిగింది…‘అవును, చాలా ఏళ్ల క్రితం.,. నాకు ఆ ఊరితో బంధముంది… అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’ ‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’ ‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్… నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను, ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’

‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’.. కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది. డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది… కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది… జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా… ఆయన పాదాలపై పడింది… ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్… ఆయన గందరగోళంలో పడిపోయాడు… తరువాత ఆమె చెప్పింది…

‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు… ఆరోజు పుట్టింది ఈ బిడ్డే… మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను… స్టాఫ్ నర్స్ అయ్యాను… నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను… మీరే స్పూర్తి… ఆశీర్వదించండి సార్…’ అంది చేతులు జోడిస్తూ…ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి… తన తొలి డెలివరీ కేసు ఆమె… అదీ ఓ గడ్డు స్థితిలో… డాక్టర్ చంద్రను అడిగాడు…

‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’ అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను… అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది… సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు… అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను… ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే… మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది… ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది… సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే…’ ఆమె చెబుతూనే ఉంది…ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు… ఆగడం లేదు… జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు… కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే… 

ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే అనుభూతి...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement