సాహిత్యం, వాస్తవం రెండింటిలోనూ ఒకేలా జీవిస్తున్న మట్టిమనిషి | The Author From Annamayya District Lives In Both Literature And Reality alike | Sakshi
Sakshi News home page

సాహిత్యం, వాస్తవం రెండింటిలోనూ ఒకేలా జీవిస్తున్న మట్టిమనిషి 

Published Sun, Oct 9 2022 5:34 PM | Last Updated on Tue, Oct 11 2022 4:12 PM

The Author From Annamayya District Lives In Both Literature And Reality alike - Sakshi

కథ ఎవరైనా చెప్పవచ్చు. కానీ కొన్ని కథలు కొందరే చెప్పగలరు. వాటిలో బాధల్ని, వివక్షను, అణచివేతను కల్పనల్లో కాకుండా వాస్తవంగా అనుభవించిన వ్యక్తులు మరింత ప్రభావవంతంగా చూపించగలరు. స్వీయ అనుభవాలనే ఇతివృత్తంగా తీసుకుని కథా రచన చేస్తూ ఉత్తమ శ్రేణి కథా రచయితల సరసన నిలవడమేగాక అనేక పురస్కారాలను సైతం అందుకున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం దిగువబురుజుకు చెందిన కథా రచయిత్రి ఎండపల్లి భారతి.. ఆమె సాహితీ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.  

మదనపల్లె/నిమ్మనపల్లె :  ఎండపల్లి భారతి పుట్టింది. పెరిగింది...నిమ్మనపల్లె మండలంలోని దిగువబురుజు. తండ్రి వెంకటరమణ, తల్లి ఎల్లమ్మ. వాళ్లకు భారతి ఏకైక సంతానం. ఆమెకు అయిదేళ్లున్నప్పుడే భారతి తల్లి టీబీతో చనిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే తండ్రీ పోయాడు. అమ్మమ్మ, తాత ఇంట్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. దాంతో చదువు ముందుకు సాగలేదు. కేవలం ఐదో తరగతి వరకే చదువుకున్నారు. అమ్మమ్మ, తాతకు తోడుగా పొలంలో పనిచేసేవారు భారతి. ఆమెకు పన్నెండేళ్లు వచ్చేసరికి ఉన్న ఊళ్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేసింది పెద్దమ్మ. భర్త శ్రీనివాసులు. మెట్టినింటికీ కూలి పనే ఆర్థిక ఆధారం. భర్తతో పాటు తనూ కూలికి వెళ్లేవారు. తన ముగ్గురు పిల్లల్లో ఒకరు ఎంఏ బీఈడీ, మరొకరు డిగ్రీ పూర్తి చేయగా, ఇంకొకరు డిగ్రీ చదువుతున్నారు. 

డ్వాక్రా సంఘ సభ్యురాలిగా మొదలై.. 
1998లో డ్వాక్రా మహిళాసంఘ సభ్యురాలిగా భారతి తమ గ్రామంలోని మహిళలతో పొదుపు సంఘాన్ని ప్రారంభించారు. గ్రూపు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా మంచి లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మహిళాసంఘాల విజయాలను తెలిపేందుకు ఓ మాసపత్రికను ప్రారంభించాలన్న ఆలోచనతో చిత్తూరు జిల్లాలో అప్పటి డీఆర్‌డీఏ పీడీ జయేష్‌రంజన్‌ ‘మహిళా నవోదయం’ మాసపత్రికను ప్రారంభించారు. వీటికి రిపోర్టర్లుగా డ్వాక్రా సభ్యులనే నియమిస్తే బాగుంటుందని, జిల్లా వ్యాప్తంగా చదవగలిగిన, రాయగలిగిన పన్నెండుమంది

మహిళలను ఎంపిక చేశారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రిపోర్టింగ్‌కు సంబంధించి మూడునెలలు వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఇలా ఎంపికైన వారిలో మదనపల్లె నుంచి ఎండపల్లిభారతి ఒకరు. అప్పటి వెలుగు ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు కిరణ్‌కుమారి, సావెం రమేష్‌లు భారతిలోని ప్రతిభను, పట్టుదలను గుర్తించి ప్రోత్సహించారు. నవోదయంలో ఆమె రాస్తున్న కథనాలకు, చూపిస్తున్న సమస్యలకు ఆమెతోనే బొమ్మలు గీయించి పాఠకాదరణ పొందేలా చూశారు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పడంలో భారతికి ఉన్న సృజన, భావవ్యక్తీకరణ, ఉద్వేగాన్ని గుర్తించి గ్రూపుసభ్యుల విజయాలే కాకుండా సామాజిక స్పృహతో కూడిన కథలు రాయాల్సిందిగా సూచించారు. మొదటిసారిగా రాసిన ‘సావు బియ్యం’ కథలోని స్పష్టమైన వ్యక్తీకరణ, అద్భుతమైన మాండలికం, చక్కటి పదసంపద చూసి ఆశ్చర్యపోయారు. ఆమె రాసిన 30 కథలతో ‘ఎడారి బతుకులు’ సంకలనం తీసుకువచ్చారు.  అలా ప్రారంభమైన భారతి రచనా ప్రయాణం.. నేడు 90 కథలను పూర్తిచేసుకుని, 20 కథలతో రెండో కథల సంపుటి ‘ఎదురీత’ విడుదలైంది. ప్రస్తుతం ఓ నవల రాస్తున్నారు.   

ముసలివాళ్ల అనుభవాలే కథలు
ఆవులు.. సేద్యం..అక్షరం.. ఇది భారతి ప్రతిరోజు దినచర్య. పేపర్, పెన్ను ఆమె కొంగుతో ముడిపడి ఉంటాయి. ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు పేపర్‌ తీసి రాస్తారు. ఆవులు మేపేందుకు వెళ్లినా..పొలం పనులు చేస్తున్నా... తన మదిలో మెదిలే ఆలోచనలకు కథారూపం ఇస్తారు. తాను చూసింది..వినింది..అనుభవించిందే రాస్తారు. చుట్టూ ఉన్న మనుషులే తనకు ప్రేరణ. అవ్వవయస్సున్న వాళ్లతో ఎక్కువ మాట్లాడటం, వాళ్ల అనుభవాలనే తాను కథావస్తువులుగా తీసుకున్నానని చెబుతున్నారు. డబ్బుకూడబెట్టే కంటే అక్షరం కూడబెడితే ముందు తరాల వాళ్లకు ఎంతో కొంతలాభం. జీవితం విలువ తెలుసుకుంటారు అంటారు. భవిష్యత్‌ తరాలకు గ్రామీణ జీవనం, పల్లెయాస, మాండలికం బతికిబట్ట కట్టాలనేదే తన తాపత్రయమని ఆమె పేర్కొంటున్నారు. 

ఎండపల్లి భారతి రచనా ప్రస్థానం.. 
∙ఎడారి బతుకులు కథాసంకలనం(2018) 
∙బతుకీత కథాసంకలనం  (2021) 

బహుమతులు.. 
∙జూదం కథకు(నాటా) నగదు బహుమతి 
∙అదవబతుకు కథకు(తెల్సా) బహుమతి 
∙బవిరిబతుకులు కథకు చైతన్యమానని పత్రిక నగదు బహుమతి  
∙బోగలబట్టికి ప్రస్థానం పత్రిక నగదు బహుమతి  
∙2022లో తెల్సా కథల పోటీల్లో జాలారిపూలు కథకు రూ.30,000, అరనజోతి ఆరునెల్లఅప్పులో కథకు రూ.15,000 నగదుబహుమతి

పురస్కారాలు... 
∙2018లో చిత్తూరు జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా గిడుగురామమూర్తి పురస్కారం. 
∙2019లో డాక్టర్‌.వి.చంద్రశేఖర్‌రావు సాహితీపురస్కారం. 
∙2020లో గార్లపాటి పురస్కారం 
∙రెడ్డెమ్మ సాహితీపురస్కారం 
∙పుట్లహేమలత పురస్కారం 
∙2022లో  విమలశాంతిపురస్కారం 
∙‘రాయి పలికిన రాగాలు’ 22 నిమిషాల షార్ట్‌ఫిలింకు సెంట్రల్‌బోర్డ్‌ ఫిల్మ్‌ సెన్సార్‌సర్టిఫికేట్, టీబీ నివారణకు తీసిన షార్ట్‌ఫిలింకు చెన్నైకు చెందిన రీచ్‌ సంస్థ ప్రశంసాపత్రం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement