వివి ఒక లెజెండ్‌ | K Shiva Reddy Article On Varavara Rao Poetry | Sakshi
Sakshi News home page

వివి ఒక లెజెండ్‌

Published Mon, Nov 2 2020 12:23 AM | Last Updated on Mon, Nov 2 2020 12:23 AM

K Shiva Reddy Article On Varavara Rao Poetry - Sakshi

‘కవిత్వం దాచనక్కరలేని నిజం
ప్రభుత్వం అక్కరలేని ప్రజ
అమృతం అక్కరలేని జీవితం’

‘నా కవిత్వం
ఒక బాధాతంత్రీ ఒక క్రోధతంత్రీ తెగినట్లు
కన్నీటిని వెలిగించేవి చూపులే అయినట్లు
ప్రవహిస్తూనే వుంటుంది
రుధిరాక్షర నదిగా’

– వి.వి.

ఒక పోరాట జీవితాన్ని, అరవైఏళ్ల పోరాట జీవితాన్ని ఒక పేజీ కాదు రెండు పేజీల్లోకి కుదించటం సాధ్యమా– ఒక పుస్తకంలోకి వడకట్టడం సాధ్యమా– అసాధ్యం– impossible. రేఖామాత్రంగానో– ఛాయామాత్రంగానో చూయించవచ్చు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కవిత్వ వ్యక్తిత్వాన్ని అద్దంలో చూయించినట్టు చూయించవచ్చేమో– కానీ మొత్తం జీవితాన్ని, తాననుభవించిన దుఃఖాన్ని వేదనని agonyని, ఏకాంతాన్ని, ఏకాంతమథనాన్ని– ఆ solitary movementలో– తాను చూసిన infernoని– స్వర్గనరక కూడలిని పట్టుకోవటం ఎంత కష్టం. అసాధ్యమైనదాన్ని సాధ్యం చేయటానికి మనుషులు సృజనలోకి దిగుతారు.

ప్రపంచంలోని ఏ కవీ నన్ను భయపెట్టలేదు. ఏ కవి ముందూ నేను బెరుకు ఫీలవలేదు. కాని వరవరరావు గారి ముందు కొంత జంకు, కొంత బెరుకు– శిఖరం ముందు నిల్చున్నట్టు ఫీలవుతాను. అది నిత్య సమరశీలమైన, రాజీలేని జీవితానుభవం– కారణం. ఇంకొక కవి వరవరరావులా జీవించగలడా– అనుభవించి ఆచరించగలడా– ఒక ఉక్కు నిర్ణయం నిశ్చయం కావాలి. ఆశయానికీ ఆచరణకీ మధ్య దూరం చెరిగిపోవాలి. వేణుగోపాల్‌ రాసినట్టు– దూరాన నుంచొని దిశానిర్దేశం చేసే మేధావి సిద్ధాంతకర్త గాదు వరవరరావు. ఆశయం రూపొందించి ఆచరణలో ఇన్నాళ్లు అగ్రభాగాన వున్నారు. మందితోనే, మందిలోనే వున్నారు. ఆశయం గాదు ఆచరణ భయపెడుతుంది– వరవరరావు Lovely person - A bit reticent- కాస్త బిడియస్తుడు, కాస్త సిగ్గరి, గొప్ప ప్రేమికుడు. ఎప్పుడో ఎక్కడో ఆయనకి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినాకు రాసుకున్నా ‘ఆత్మ అరచేతిలోనూ దొరుకుతుందని’. ఒక విద్యుత్‌ ప్రవహిస్తుంది. నిన్ను ఉత్తేజభరితుణ్ణి చేస్తుంది, నిన్ను సచేతనుణ్ణి చేస్తుంది. బహుశా ప్రపంచంలోని గొప్ప వ్యక్తులంతా, మహత్తర మూర్తులంతా ఇంతేనేమో– తల చుట్టూ కనపడని కాంతిచక్రాలు తిరుగుతున్నట్టు.

మొదట ఎక్కడ చూశాను? గుర్తు లేదు. కాని లీలగా ఒక రూపం– పంచె కట్టుకుని నడుస్తున్న రూపం– బహుశా ఆర్ట్స్‌ కాలేజీ ఆవరణలో అనుకుంటా. మిత్రులతో నడుస్తున్నారు. ‘సృజన’ జడ్చర్ల నుంచి వస్తున్న రోజుల్నించి పరిచయం, అప్పుడే ఒక ఉత్తరం రాసిన గుర్తు, ఆ తొలిరోజుల పిచ్చి కవితనొకదానిని సృజనలో అచ్చేశారు. రెండోసారి నారాయణగూడలోని శ్రీపతి రూంలో– శ్రీపతి ఒక అద్భుత కథకుడే కాదు, వ్యక్తి కూడా. ఎంత మందిని నిశ్శబ్దంగా తనలోకి లాక్కున్నాడు. ఎంతమంది దోవలు మార్చాడు! ఈ యాభై అరవై సంవత్సరాల్లో– ఎన్నిసార్లు దగ్గరగా దూరంగా సభల్లో బయటా కలిసాను. కలిసిన ప్రతిసారి ఒక కొత్త కలయిక. నూతనోత్తేజం. నిజంగా జీవించినవాడి జీవితం జీవిస్తున్నవాడి జీవితం అలానే వుంటుంది. ఎక్కడో ఒక సభలో అన్నారు: ఈ కవిత్వం కంటే ఇంకేదైనా ప్రజలకు మేలు చేస్తుందనుకుంటే ఉపయోగపడుతుందనుకుంటే– అదే చేస్తాను. నేనూ వున్నా ఆ సభలో– నేనన్నాను ‘నాకు కవిత్వమే సర్వస్వం, కవిత్వం దాటి ఏమీ లేదు– For me word is an action’. ఇప్పుడనిపిస్తుంది– అది Lame justification. ఇప్పుడు వరవరరావు ఎక్కడున్నారు– నేనెక్కడున్నాను– మనలో చాలా మంది ఎక్కడున్నాం– అది తేడా. అది ఆశ్చర్యం గొలిపే అగ్నిస్పర్శ.

ఒక గొప్ప రాజకీయ కుటుంబంలో పుట్టిపెరిగిన వరవరరావులో, కవిత్వంలో రాజకీయం ఒక రక్తప్రసరణ. నెహ్రూ రాజకీయ అభిమానిగా మొదలైన వరవరరావు పరిణామం అనూహ్యం కాదు. సహజం. ఇప్పుడు ఆయన ఉండాల్సిన చోట వున్నాడు. దేశ రాజకీయ పరిణామాలు ప్రపంచ రాజకీయ పరిణామాలు అంతర్భాగం చేసుకున్న వరవరరావు జీవితం, కవిత్వం భిన్నమైనవే. ఆయన గురించి లోకానికి తెలియనిదేముంది– He is an open book – ఎవరో అడిగారు ‘మార్క్సిజం ఏం చేస్తుంది’ అని– వేరే విషయాలు పక్కనపెడితే– అది నిన్ను నిర్భయుణ్ణి చేస్తుంది. దేన్నైనా ఢీకొనే శక్తి, ఎదిరించి నిలబడే శక్తి నీకు ప్రసాదిస్తుంది. ఆయన్ని చూసినప్పుడల్లా– నాకు Tennyson, Ulyssesలోని వాక్యాలు గుర్తుకొస్తాయి– That which we are, we are; one equal temper of heroic hearts made weak by time and fate, but strong in will to strive, to seek, but not to yield.

ఆయన ఏకైక గొప్ప పొలిటికల్‌ పొయెట్‌. ఎంతోకొంత ప్రతి కవీ పొలిటికల్‌ కవే. ఇది తిట్టు గాదు, రాజకీయాన్ని కవిత్వం చేయటం– రాజకీయ వెలుగులో వచ్చిన పరిణామాలను మార్పులను ఘటనలను కవిత్వం చేయటం మామూలు విషయం కాదు. వరవరరావు general poet కాదు. సచేతనుడైన గొప్ప ఆర్ద్ర హృదయం గల రాజకీయ కవి. మానవ ప్రవృత్తిని మానవ స్వభావాన్ని బయటకు తీసుకొచ్చి ఎత్తి చూపటం కవిత చేయటం ఒక సవాలు. అరవైఏళ్లుగా మెలకువతో, కవిత్వమూలం చెడకుండా చేస్తున్నారు. ‘ఊరేగింపు’ దగ్గర నుంచి ‘కఠినవాడు’ దాకా ఏ కవితైనా తీసుకోండి– కవిత్వ నిర్మాణ సూత్రాలకు భిన్నంగా వుండదు– లోలోపల తొలుచుకుంటూ విస్తృతి చేసుకుంటూ వెడుతుంది.

నాకు బాగా గుర్తు– విరసం ఇరవైఏళ్ల మహాసభ అనుకుంటా– రాణాప్రతాప్‌ హాల్‌లో జరిగింది. జనంలో నేవున్నాను – అకస్మాత్తుగా ‘ముక్తకంఠం’ కవిత్వసంపుటి ఆవిష్కరించి మాట్లాడమన్నారు. చదవటం సంగతి పక్కనపెడితే ఆ పుస్తకాన్ని ఎన్నిసార్లు చేతితో నిమురుతూ అనుభవిస్తూ అనుభూతి చెందానో చెప్పలేను. తన సుదీర్ఘయాత్రలో– ఎంత అశాంతిని ఎంత ఘర్షణని ఎదుర్కొన్నారో చెప్పడం కష్టం. ఈ సంక్షోభభరిత, సంఘర్షణాయుత జీవితం మొత్తం కవిత్వం చేసే process ఆయన కనుగొన్నారు. ఒక పదిహేను కవితాసంపుటుల కవిత వుంది, వేలవేల పేజీల వచనముంది. ఒక రకంగా అరవై సంవత్సరాల జీవితాన్ని చరిత్రను రికార్డ్‌ చేశారు. 

ఆయన కవిగా జీవించని క్షణాలు తక్కువే. ఆయన ఉపన్యాసం ఒక గొప్ప కవిత. ఉపన్యాసాన్ని emotional గా charge చేయటం ఆయన విశిష్టత. ఆయన రాజకీయవాదా– కవా– సంపాదకుడా– అధ్యాపకుడా– ఉపన్యాసకుడా– అని ఎవరన్నా అడిగితే– వీటన్నింటి సమాహారం ఆయన. వేయంచుల కత్తిలా మెరుస్తుంటాడు, ముళ్లగదలా వలయాలు వలయాలు చుడుతూ మనల్ని సంభ్రమంలో ముంచుతాడు. ఆయన ‘సముద్రం’ గొప్ప కావ్యం. సమాజానికి సముద్రానికి అభేదం చెబుతూ సాగిన గొప్ప కవిత. ఆయన ఊరకుండడు– ప్రభుత్వం state ఊరకుండదు. వరవరరావు అంటే stateకి సమాజానికి, stateకి వ్యక్తికి మధ్య ఘర్షణ. ఇది నిరంతరం కొనసాగుతుంది. మనిషిలో గొప్ప లాలిత్యం వుంది, లాలిత్యం కాఠిన్యంగా మార్పు చెందే సందర్భాలూ కవిత్వంలో చూస్తాం. హేమ గారి మీద తొలిరోజుల్లో రాసిన ప్రేమ కవిత– సన్నజాజులు చదవండి– ఎంత గొప్ప ప్రేమికుడో, ఎంత సౌందర్యవాదో, ఎంత మృదుస్వభావో– అవన్నీ ఇప్పుడు సమాజగతంగా అంతర్లీనమయ్యాయి. అటువంటి గొప్ప మనిషికి గొప్ప కవికి రేపటితో ఎనభైఏళ్లు నిండుతాయి. గొప్ప సెలబ్రేషన్‌ చేసుకోవాల్సిన సమయం– సెలబ్రేట్‌ చేయండి– వరవరరావు కవిత్వాన్ని పఠించి పురాణంలా ప్రచారం చేయాలి. ఆయన జీవనాడి, జాతి జీవనాడిలోకి ఇంకాలి.
He is a Legend.
కె.శివారెడ్డి

  • గొప్ప మనిషికి గొప్ప కవికి రేపటితో ఎనభైఏళ్లు నిండుతాయి. గొప్ప సెలబ్రేషన్‌ చేసుకోవాల్సిన సమయం. వరవరరావు కవిత్వాన్ని పురాణంలా ప్రచారం చేయాలి. ఆయన జీవనాడి, జాతి జీవనాడిలోకి ఇంకాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement