k Shiva reddy
-
వివి ఒక లెజెండ్
‘కవిత్వం దాచనక్కరలేని నిజం ప్రభుత్వం అక్కరలేని ప్రజ అమృతం అక్కరలేని జీవితం’ ‘నా కవిత్వం ఒక బాధాతంత్రీ ఒక క్రోధతంత్రీ తెగినట్లు కన్నీటిని వెలిగించేవి చూపులే అయినట్లు ప్రవహిస్తూనే వుంటుంది రుధిరాక్షర నదిగా’ – వి.వి. ఒక పోరాట జీవితాన్ని, అరవైఏళ్ల పోరాట జీవితాన్ని ఒక పేజీ కాదు రెండు పేజీల్లోకి కుదించటం సాధ్యమా– ఒక పుస్తకంలోకి వడకట్టడం సాధ్యమా– అసాధ్యం– impossible. రేఖామాత్రంగానో– ఛాయామాత్రంగానో చూయించవచ్చు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కవిత్వ వ్యక్తిత్వాన్ని అద్దంలో చూయించినట్టు చూయించవచ్చేమో– కానీ మొత్తం జీవితాన్ని, తాననుభవించిన దుఃఖాన్ని వేదనని agonyని, ఏకాంతాన్ని, ఏకాంతమథనాన్ని– ఆ solitary movementలో– తాను చూసిన infernoని– స్వర్గనరక కూడలిని పట్టుకోవటం ఎంత కష్టం. అసాధ్యమైనదాన్ని సాధ్యం చేయటానికి మనుషులు సృజనలోకి దిగుతారు. ప్రపంచంలోని ఏ కవీ నన్ను భయపెట్టలేదు. ఏ కవి ముందూ నేను బెరుకు ఫీలవలేదు. కాని వరవరరావు గారి ముందు కొంత జంకు, కొంత బెరుకు– శిఖరం ముందు నిల్చున్నట్టు ఫీలవుతాను. అది నిత్య సమరశీలమైన, రాజీలేని జీవితానుభవం– కారణం. ఇంకొక కవి వరవరరావులా జీవించగలడా– అనుభవించి ఆచరించగలడా– ఒక ఉక్కు నిర్ణయం నిశ్చయం కావాలి. ఆశయానికీ ఆచరణకీ మధ్య దూరం చెరిగిపోవాలి. వేణుగోపాల్ రాసినట్టు– దూరాన నుంచొని దిశానిర్దేశం చేసే మేధావి సిద్ధాంతకర్త గాదు వరవరరావు. ఆశయం రూపొందించి ఆచరణలో ఇన్నాళ్లు అగ్రభాగాన వున్నారు. మందితోనే, మందిలోనే వున్నారు. ఆశయం గాదు ఆచరణ భయపెడుతుంది– వరవరరావు Lovely person - A bit reticent- కాస్త బిడియస్తుడు, కాస్త సిగ్గరి, గొప్ప ప్రేమికుడు. ఎప్పుడో ఎక్కడో ఆయనకి షేక్‌హ్యాండ్ ఇచ్చినాకు రాసుకున్నా ‘ఆత్మ అరచేతిలోనూ దొరుకుతుందని’. ఒక విద్యుత్ ప్రవహిస్తుంది. నిన్ను ఉత్తేజభరితుణ్ణి చేస్తుంది, నిన్ను సచేతనుణ్ణి చేస్తుంది. బహుశా ప్రపంచంలోని గొప్ప వ్యక్తులంతా, మహత్తర మూర్తులంతా ఇంతేనేమో– తల చుట్టూ కనపడని కాంతిచక్రాలు తిరుగుతున్నట్టు. మొదట ఎక్కడ చూశాను? గుర్తు లేదు. కాని లీలగా ఒక రూపం– పంచె కట్టుకుని నడుస్తున్న రూపం– బహుశా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో అనుకుంటా. మిత్రులతో నడుస్తున్నారు. ‘సృజన’ జడ్చర్ల నుంచి వస్తున్న రోజుల్నించి పరిచయం, అప్పుడే ఒక ఉత్తరం రాసిన గుర్తు, ఆ తొలిరోజుల పిచ్చి కవితనొకదానిని సృజనలో అచ్చేశారు. రెండోసారి నారాయణగూడలోని శ్రీపతి రూంలో– శ్రీపతి ఒక అద్భుత కథకుడే కాదు, వ్యక్తి కూడా. ఎంత మందిని నిశ్శబ్దంగా తనలోకి లాక్కున్నాడు. ఎంతమంది దోవలు మార్చాడు! ఈ యాభై అరవై సంవత్సరాల్లో– ఎన్నిసార్లు దగ్గరగా దూరంగా సభల్లో బయటా కలిసాను. కలిసిన ప్రతిసారి ఒక కొత్త కలయిక. నూతనోత్తేజం. నిజంగా జీవించినవాడి జీవితం జీవిస్తున్నవాడి జీవితం అలానే వుంటుంది. ఎక్కడో ఒక సభలో అన్నారు: ఈ కవిత్వం కంటే ఇంకేదైనా ప్రజలకు మేలు చేస్తుందనుకుంటే ఉపయోగపడుతుందనుకుంటే– అదే చేస్తాను. నేనూ వున్నా ఆ సభలో– నేనన్నాను ‘నాకు కవిత్వమే సర్వస్వం, కవిత్వం దాటి ఏమీ లేదు– For me word is an action’. ఇప్పుడనిపిస్తుంది– అది Lame justification. ఇప్పుడు వరవరరావు ఎక్కడున్నారు– నేనెక్కడున్నాను– మనలో చాలా మంది ఎక్కడున్నాం– అది తేడా. అది ఆశ్చర్యం గొలిపే అగ్నిస్పర్శ. ఒక గొప్ప రాజకీయ కుటుంబంలో పుట్టిపెరిగిన వరవరరావులో, కవిత్వంలో రాజకీయం ఒక రక్తప్రసరణ. నెహ్రూ రాజకీయ అభిమానిగా మొదలైన వరవరరావు పరిణామం అనూహ్యం కాదు. సహజం. ఇప్పుడు ఆయన ఉండాల్సిన చోట వున్నాడు. దేశ రాజకీయ పరిణామాలు ప్రపంచ రాజకీయ పరిణామాలు అంతర్భాగం చేసుకున్న వరవరరావు జీవితం, కవిత్వం భిన్నమైనవే. ఆయన గురించి లోకానికి తెలియనిదేముంది– He is an open book – ఎవరో అడిగారు ‘మార్క్సిజం ఏం చేస్తుంది’ అని– వేరే విషయాలు పక్కనపెడితే– అది నిన్ను నిర్భయుణ్ణి చేస్తుంది. దేన్నైనా ఢీకొనే శక్తి, ఎదిరించి నిలబడే శక్తి నీకు ప్రసాదిస్తుంది. ఆయన్ని చూసినప్పుడల్లా– నాకు Tennyson, Ulyssesలోని వాక్యాలు గుర్తుకొస్తాయి– That which we are, we are; one equal temper of heroic hearts made weak by time and fate, but strong in will to strive, to seek, but not to yield. ఆయన ఏకైక గొప్ప పొలిటికల్ పొయెట్. ఎంతోకొంత ప్రతి కవీ పొలిటికల్ కవే. ఇది తిట్టు గాదు, రాజకీయాన్ని కవిత్వం చేయటం– రాజకీయ వెలుగులో వచ్చిన పరిణామాలను మార్పులను ఘటనలను కవిత్వం చేయటం మామూలు విషయం కాదు. వరవరరావు general poet కాదు. సచేతనుడైన గొప్ప ఆర్ద్ర హృదయం గల రాజకీయ కవి. మానవ ప్రవృత్తిని మానవ స్వభావాన్ని బయటకు తీసుకొచ్చి ఎత్తి చూపటం కవిత చేయటం ఒక సవాలు. అరవైఏళ్లుగా మెలకువతో, కవిత్వమూలం చెడకుండా చేస్తున్నారు. ‘ఊరేగింపు’ దగ్గర నుంచి ‘కఠినవాడు’ దాకా ఏ కవితైనా తీసుకోండి– కవిత్వ నిర్మాణ సూత్రాలకు భిన్నంగా వుండదు– లోలోపల తొలుచుకుంటూ విస్తృతి చేసుకుంటూ వెడుతుంది. నాకు బాగా గుర్తు– విరసం ఇరవైఏళ్ల మహాసభ అనుకుంటా– రాణాప్రతాప్ హాల్లో జరిగింది. జనంలో నేవున్నాను – అకస్మాత్తుగా ‘ముక్తకంఠం’ కవిత్వసంపుటి ఆవిష్కరించి మాట్లాడమన్నారు. చదవటం సంగతి పక్కనపెడితే ఆ పుస్తకాన్ని ఎన్నిసార్లు చేతితో నిమురుతూ అనుభవిస్తూ అనుభూతి చెందానో చెప్పలేను. తన సుదీర్ఘయాత్రలో– ఎంత అశాంతిని ఎంత ఘర్షణని ఎదుర్కొన్నారో చెప్పడం కష్టం. ఈ సంక్షోభభరిత, సంఘర్షణాయుత జీవితం మొత్తం కవిత్వం చేసే process ఆయన కనుగొన్నారు. ఒక పదిహేను కవితాసంపుటుల కవిత వుంది, వేలవేల పేజీల వచనముంది. ఒక రకంగా అరవై సంవత్సరాల జీవితాన్ని చరిత్రను రికార్డ్ చేశారు. ఆయన కవిగా జీవించని క్షణాలు తక్కువే. ఆయన ఉపన్యాసం ఒక గొప్ప కవిత. ఉపన్యాసాన్ని emotional గా charge చేయటం ఆయన విశిష్టత. ఆయన రాజకీయవాదా– కవా– సంపాదకుడా– అధ్యాపకుడా– ఉపన్యాసకుడా– అని ఎవరన్నా అడిగితే– వీటన్నింటి సమాహారం ఆయన. వేయంచుల కత్తిలా మెరుస్తుంటాడు, ముళ్లగదలా వలయాలు వలయాలు చుడుతూ మనల్ని సంభ్రమంలో ముంచుతాడు. ఆయన ‘సముద్రం’ గొప్ప కావ్యం. సమాజానికి సముద్రానికి అభేదం చెబుతూ సాగిన గొప్ప కవిత. ఆయన ఊరకుండడు– ప్రభుత్వం state ఊరకుండదు. వరవరరావు అంటే stateకి సమాజానికి, stateకి వ్యక్తికి మధ్య ఘర్షణ. ఇది నిరంతరం కొనసాగుతుంది. మనిషిలో గొప్ప లాలిత్యం వుంది, లాలిత్యం కాఠిన్యంగా మార్పు చెందే సందర్భాలూ కవిత్వంలో చూస్తాం. హేమ గారి మీద తొలిరోజుల్లో రాసిన ప్రేమ కవిత– సన్నజాజులు చదవండి– ఎంత గొప్ప ప్రేమికుడో, ఎంత సౌందర్యవాదో, ఎంత మృదుస్వభావో– అవన్నీ ఇప్పుడు సమాజగతంగా అంతర్లీనమయ్యాయి. అటువంటి గొప్ప మనిషికి గొప్ప కవికి రేపటితో ఎనభైఏళ్లు నిండుతాయి. గొప్ప సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సమయం– సెలబ్రేట్ చేయండి– వరవరరావు కవిత్వాన్ని పఠించి పురాణంలా ప్రచారం చేయాలి. ఆయన జీవనాడి, జాతి జీవనాడిలోకి ఇంకాలి. He is a Legend. కె.శివారెడ్డి గొప్ప మనిషికి గొప్ప కవికి రేపటితో ఎనభైఏళ్లు నిండుతాయి. గొప్ప సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సమయం. వరవరరావు కవిత్వాన్ని పురాణంలా ప్రచారం చేయాలి. ఆయన జీవనాడి, జాతి జీవనాడిలోకి ఇంకాలి. -
శివారెడ్డికి ‘సరస్వతీ సమ్మాన్’
సాక్షి, హైదరాబాద్: కొంచెం స్వేచ్ఛ గావాలి మనిషిని మనిషని చెబటానికి పశువుని పశువని చెబటానికి కొంచెం స్వేచ్ఛ గావాలి రాత్రిని రాత్రని చెబటానికి పగటిని పగలని చెబటానికి కొంచెం స్వేఛ్చ గావాలి రెక్కలల్లార్చి గాల్లో ఎగరడానికి .. అంటూ కాంక్షించిన ప్రముఖ కవి కె. శివారెడ్డిని ప్రతిష్టాత్మక ‘సరస్వతీ సమ్మాన్’వరించింది. కేకే బిర్లా ఫౌండేషన్ అందజేసే ఈ ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారానికి శివారెడ్డి కవితా సంపుటి ‘పక్కకి ఒత్తిగిలితే...’ఎంపికైంది. 2016లో విడుదలైన ఈ కవితా సంపుటిని 2018 సంవత్సరానికిగాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పురస్కారం కింద జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ. 15 లక్షల నగదు అందజేయనున్నారు. లోక్‌సభ సచివాలయం పూర్వ సెక్రెటరీ జనరల్‌గా పనిచేసిన డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖ రచయితలతో కూడిన చయన్ కమిటీ పలు వడపోతల అనంతరం పురస్కారానికి రచనలను ఎంపిక చేస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా సరస్వతీ సమ్మాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దేశవ్యాప్తంగా 22 భాషల్లో వెలువడే రచనల్లోంచి మంచి సాహితీ విలువలతో కూడిన రచనలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక తెలుగు రచనకు ఈ పురస్కారం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సమాజ కోణంలోంచి... మా చేతులు చూడండి మా అరచేతులు చూడండి అక్కడ కనపడుతుంది క్రైర్యం, దౌష్టం నిరాధారులం, అనాధలం మా లేత చేతుల మీద పడ్డ వాతల్లో ఏం కనపడుతుంది అనాధల్ని చేసిన తల్లిదండ్రులా– దేశమా రాజ్యమా, మా చుట్టు ముళ్లకంచలా అల్లుకున్న సమాజమా ఆయాలు ఆడవాళ్లే, అమ్మలాంటి వాళ్లే కానీ, వాళ్లు ఈ నిర్దయ లోకానికి గుర్తు.... అంటూ కన్నీళ్లు తెప్పించే కవిత కూడా ఆ సంపుటిలో భాగం. కరీంనగర్‌లోని శిశు గృహంలో ముగ్గురు చిన్నారులు అన్నం తినలేదని ఆయాలు చెంచాను కాల్చి అరచేతిపై వాతలు పెట్టిన ఘటనకు ఇలా కవిత రూపంలో ఆవేదన చెందారు శివారెడ్డి. గుంటూరుకు చెందిన శివారెడ్డి ఎన్నో కవితా సంపుటిలు, సంకలనాలు వెలువరించారు. సమాజ దృష్టికోణం నుంచి ఆయన రచనలు వెలువడతాయి. అందుకే వాటిల్లో కొన్ని ఇతర భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. కవితలు రాయడం అంత సులువు కాదని, అది కత్తిమీద సామే అని ఆయన అంటారు. పక్కకి ఒత్తిగిలితే తగిలిందో వాక్యం పూర్వం ఒక రాజు తనకీ, పెళ్లానికీ మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది పండిన వేపయా హృదయం తీయతీయగా చేదు చేదుగా తడితడిగా. అంతే కవిత్వం రాయడమంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యటం మొద్దుబారటానికీ వీల్లేదు మోడుగా మిగలటానికీ వీల్లేదు. ఈ మాటలను ఎంపిక కమిటీ ప్రత్యేకంగా ప్రస్తుతించింది. -
ఏడు పదుల సౌరభం
సందర్భం స్వాతంత్య్రం వచ్చాక మొదటి దశాబ్దాన్ని వదిలేస్తే తర్వాత ఆరు దశాబ్దాలలో భారతీయ సాహిత్యం అపూర్వంగా వృద్ధి చెందింది. అన్ని భాషా సాహిత్యా లలో నిర్దిష్టత ప్రవేశించింది. ఒక స్థానికమైన రంగూ రుచీ కేరక్టర్ అబ్బాయి. త్రిపురనేని మధుసూదన రావు అంటూ వుండే వారు: ‘అభ్యుదయ కవి త్వం భావకవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చింద నుకుంటాం, కానీ కాదు – అది జాతీయవాద కవి త్వానికి కొనసాగింపు’. గురజాడ ఇచ్చిన ఆధు నికత తర్కం తాత్వికతని కాదని భావకవిత్వం ఎలా వచ్చింది? గురజాడ ఇచ్చిన ఆధునిక ఆలోచనని బూర్జువా ప్రజాస్వామిక దృక్పథాన్ని భావకవిత్వం అందుకొని విశాలం చేసి వుండాల్సింది. భావ కవిత్వం ఆకాశం నుంచి ఊడిపడలేదు. పశ్చిమాన ఫ్రెంచి విప్లవంతో ప్రభావితమైన కవులు రొమాంటిక్ పొయిట్రీ మూవ్‌మెంట్‌ని ప్రారంభిస్తే (ప్రకృతి కవిత్వం అని కూడా అన్నారు), ఆ ప్రభావం నుంచి కొంత ఇక్కడ నెలకొన్న పరిస్థితుల వల్ల పరిపూర్ణమైన హద్దుల్లేని స్వేచ్ఛ కావాలనే భావన మూలంగా భావకవిత్వం వచ్చింది. భావకవి త్వంలో అనేక పాయలు న్నాయి. అది కేవలం ప్రేయసీ ప్రియులకు సంబంధించినది కాదు. ఒక బంధన నుంచి ఒక విముక్తి. గురజాడ దోవన నడిచివచ్చిన వాళ్ళు, దాన్ని విశాలం చేసిన వాళ్ళు అభ్యుదయ కవులు. స్వతంత్రం తరువాత వచ్చిన అన్ని కవిత్వ ధోర ణులలో ఆనాటి కాలాల చారిత్రక పరిస్థితులు, మార్పులు, సంక్షోభాలు, పరివర్తనలు భాగమయ్యాయి. ఏ ధోరణి కవిత్వం అయినా ప్రారంభంలో ఒకానొక స్థలం వద్ద ఒకానొక నిర్దిష్ట ఆదర్శంతో మొదలయినా రానురాను అది బలపడే క్రమంలో స్థలకాలాలు, సామాజిక స్థితులు, రాజకీయాలు అంతర్భాగమై, ఆధునికత అంతర్వాహినిగా అభివృద్ధి చెందాయి. అన్ని భాషల కవిత్వం ఈ స్థితికి లోనయ్యింది. హిందీలో వచ్చిన నయా కవితా ఇత్యాదులు ఉదాహరణ. ఈ డెబ్భై ఏళ్ళలో భారతీయ సమాజం అనేక మార్పులకు లోనయింది. కల్లోల స్థితులను ఎదు ర్కొంది. అటు రాజకీయాలలోనూ ఇటు సమాజం లోనూ విస్తృతి జరిగిందా అంటే, ఏదీ మూసుకోదు. ఓపెన్ అప్ అవుతుంది. అన్ని భాషల బృందాల సాహిత్యాల్లోనూ ఇది ప్రతిఫలించింది.స్వతంత్రం వచ్చాక మొదటి దశాబ్దాన్ని వదిలేస్తే తర్వాత ఆరు దశాబ్దాలలో భారతీయ సాహిత్యం అపూర్వంగా అనన్యంగా అభివృద్ధి చెందింది. పశ్చి మాన వచ్చిన అన్ని సాహిత్య మార్పులను, శిల్ప రీతుల్ని, కవిత్వ విధానాలను అది అందుకొంది. గర్భీ కరించుకొని ముందుకెళ్ళింది. పాతదాన్ని ప్రశ్నిం చడం, నిలవనీటి సిద్ధాంతాల మీద తిరుగుబాటు వేయడం మొదలయ్యింది. కొత్త చైతన్యం నుంచి కొత్త ఎరుకనుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. కేంద్రాన్ని బద్దలు కొట్టడం ఒక ఐడియల్ అయింది. మహాకథనాలు నశించాయని ఇక రావని – అనేక ప్రపంచ సాహిత్యాల అధ్య యనం వల్ల సంపర్కం వల్ల ఇక్కడి సమాజాన్ని ఇక్కడ ప్రజల జీవనాన్ని రికార్డు చేయడం జరిగింది. ఏదీ పరిపూర్ణ సిద్ధాంతం కాదు. అందువల్ల అనేక ప్రశ్నలు అనేక సమాధానాలు అనేక వాదాలు అన్ని ప్రాంతాల్లోనూ అన్ని భాషల్లోనూ కొత్త సాహిత్యం రావడానికి దోహ దం చేశాయి. అన్ని భాషా సాహిత్యాలలో నిర్దిష్టత ప్రవేశిం చింది. ఆ నిర్దిష్టత నుంచి అస్తిత్వాన్ని గురించి ఆలోచనలు, అనేక రకాల అస్తిత్వాల మధ్య అస్తిత్వపు సమ స్యను అర్థం చేసుకోవ డం, ఆ దిశగా ఆలోచిం చడం, సాహిత్య సృజన చేయడం అన్ని భాష లలో జరుగుతూ వచ్చిం ది. కొత్త పరికరాలు, ఒక టెక్నలాజికల్ రెవల్యూ షన్ వల్ల చోటు చేసు కున్న కొత్త సంక్షోభ స్థితులు, మానవ సంబం ధాలలో శిథిలాలు. రాజ కీయాలలో ఒక లంపెనైజేషన్, క్రిమినలైజేషన్, శిథిల మవుతున్న విలువలు, కొత్త సమీకరణలు దుష్ఫలి తాలు–అన్నింటినీ స్వాతంత్య్రానంతర భారతీయ సాహిత్యం అందుకుంది. అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ స్థానిక సమస్యల వివక్షల నేపథ్యంలో ఉనికిలోకి వచ్చిన పోరాటాలు, ఆ వెలుగులో వచ్చిన సాహిత్యం బల మైనది. ఒక స్థానికమైన రంగూ రుచీ కేరక్టర్ దాని కబ్బాయి. ఈశాన్య రాష్ట్రాల సాహిత్యం దీనికి ఉదాహ రణ. వామపక్ష ఉద్యమాలు సాయుధ పోరాటాలు ఒక ప్రత్యామ్నాయ ఆదర్శ పరిపాలన – రాజ్యంతో భీకర పోరాటం ఇవన్నీ సమీప గతం నుంచి గొప్ప సాహిత్యం రావటానికి దోహదం చేశాయి. అన్ని పోరా టాల నుంచి అన్ని వాదాల నేపథ్యం నుంచి వచ్చిన సృజన నిర్దుష్టమై సాధారణీకరణ చెందుతూ వచ్చింది. ఒక భౌతిక స్థితి నుంచి ఒక ఆంతరిక కల్లోల పరి జ్ఞానంతో గొప్ప సాహిత్యం వస్తున్న దశ ఇది. కె.శివారెడ్డి వ్యాసకర్త ప్రముఖ కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మొబైల్ : 95021 67764