
సాక్షి, హైదరాబాద్:
కొంచెం స్వేచ్ఛ గావాలి
మనిషిని మనిషని చెబటానికి
పశువుని పశువని చెబటానికి
కొంచెం స్వేచ్ఛ గావాలి
రాత్రిని రాత్రని చెబటానికి
పగటిని పగలని చెబటానికి
కొంచెం స్వేఛ్చ గావాలి
రెక్కలల్లార్చి గాల్లో ఎగరడానికి .. అంటూ కాంక్షించిన ప్రముఖ కవి కె. శివారెడ్డిని ప్రతిష్టాత్మక ‘సరస్వతీ సమ్మాన్’వరించింది. కేకే బిర్లా ఫౌండేషన్ అందజేసే ఈ ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారానికి శివారెడ్డి కవితా సంపుటి ‘పక్కకి ఒత్తిగిలితే...’ఎంపికైంది. 2016లో విడుదలైన ఈ కవితా సంపుటిని 2018 సంవత్సరానికిగాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పురస్కారం కింద జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ. 15 లక్షల నగదు అందజేయనున్నారు. లోక్‌సభ సచివాలయం పూర్వ సెక్రెటరీ జనరల్‌గా పనిచేసిన డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖ రచయితలతో కూడిన చయన్ కమిటీ పలు వడపోతల అనంతరం పురస్కారానికి రచనలను ఎంపిక చేస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా సరస్వతీ సమ్మాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దేశవ్యాప్తంగా 22 భాషల్లో వెలువడే రచనల్లోంచి మంచి సాహితీ విలువలతో కూడిన రచనలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక తెలుగు రచనకు ఈ పురస్కారం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
సమాజ కోణంలోంచి...
మా చేతులు చూడండి
మా అరచేతులు చూడండి
అక్కడ కనపడుతుంది క్రైర్యం, దౌష్టం
నిరాధారులం, అనాధలం
మా లేత చేతుల మీద పడ్డ వాతల్లో ఏం కనపడుతుంది
అనాధల్ని చేసిన తల్లిదండ్రులా– దేశమా
రాజ్యమా, మా చుట్టు ముళ్లకంచలా అల్లుకున్న సమాజమా
ఆయాలు ఆడవాళ్లే, అమ్మలాంటి వాళ్లే కానీ,
వాళ్లు ఈ నిర్దయ లోకానికి గుర్తు.... అంటూ కన్నీళ్లు తెప్పించే కవిత కూడా ఆ సంపుటిలో భాగం. కరీంనగర్‌లోని శిశు గృహంలో ముగ్గురు చిన్నారులు అన్నం తినలేదని ఆయాలు చెంచాను కాల్చి అరచేతిపై వాతలు పెట్టిన ఘటనకు ఇలా కవిత రూపంలో ఆవేదన చెందారు శివారెడ్డి. గుంటూరుకు చెందిన శివారెడ్డి ఎన్నో కవితా సంపుటిలు, సంకలనాలు వెలువరించారు. సమాజ దృష్టికోణం నుంచి ఆయన రచనలు వెలువడతాయి. అందుకే వాటిల్లో కొన్ని ఇతర భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. కవితలు రాయడం అంత సులువు కాదని, అది కత్తిమీద సామే అని ఆయన అంటారు.
పక్కకి ఒత్తిగిలితే తగిలిందో వాక్యం
పూర్వం ఒక రాజు
తనకీ, పెళ్లానికీ మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో
ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది
పండిన వేపయా హృదయం తీయతీయగా చేదు చేదుగా తడితడిగా.
అంతే
కవిత్వం రాయడమంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యటం
మొద్దుబారటానికీ వీల్లేదు
మోడుగా మిగలటానికీ వీల్లేదు.
ఈ మాటలను ఎంపిక కమిటీ ప్రత్యేకంగా ప్రస్తుతించింది.
Comments
Please login to add a commentAdd a comment