బాల్యంలోనే పిల్లల ఊహలకు రెక్కలొస్తాయి. ఆట పాటలతో గడిపే పిల్లలకు ఆటవిడుపుగా కథలు చెప్పాలి. పాటలు పాడించాలి. బొమ్మలు గీయాలని ఉబలాటపడే చిట్టి చేతులకు పెన్సిళ్లు, రంగులు, కాగితాలు అందివ్వాలి. వాళ్ల లేత భుజాల మీద చదువుల భారాన్ని తగ్గించాలి. విజ్ఞానాన్ని వినోదాత్మకంగా పెంపొందించు కోవడానికి ఉపయోగపడే సాధనం బాలసాహిత్యం. పిల్లలకు ప్రత్యేకమైన సాహిత్యం ఉండాల్సిన అవసరాన్ని పాశ్చాత్య ప్రపంచం పద్దెనిమిదో శతాబ్ది నాటికి గాని గుర్తించలేదు. మన దేశం పిల్లలకు ప్రత్యేకమైన సాహిత్యాన్ని క్రీస్తుశకం తొలి సహస్రాబ్ది ప్రారంభం లోనే సృష్టించింది. విష్ణుశర్మ ‘పంచతంత్ర’ ద్వారా పిల్లలను ఆకట్టుకునే కథలు రాశాడు.
విష్ణుశర్మ రాసిన ‘పంచతంత్ర’ కథలలో ఎక్కువగా జంతువులు, పక్షులే ప్రధాన పాత్రలు. ఇందులోని కథలేవీ పుక్కిటి పురాణాలు కావు. ఇందులోని కథలు పిల్లల ఆలోచనలకు పదును పెడతాయి. వారికి లోకం పోకడను అవగతం చేస్తాయి. ‘పంచతంత్ర’ కథలు పిల్లలను మాత్రమే కాదు, పెద్దలనూ ఆకట్టుకుంటాయి. ‘పిల్లల పుస్తకాన్ని మీరు పిల్లల కోసం మాత్రమే రాసేటట్లయితే, మీరు విఫలమైనట్లే’ అని అమెరికన్ రచయిత, సినీ దర్శకుడు డాన్ రాఫ్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పాడు. సార్వజనీనతే ఉత్తమ బాలసాహిత్యానికి గీటురాయి.
ఒకప్పుడు తెలుగులో విరివిగా బాలల పత్రికలు ఉండేవి. రేడియోలో బాలల కార్యక్రమాలు వచ్చేవి. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు లేనిరోజుల్లో పిల్లలకు వాటితోనే చక్కని కాలక్షేపం జరిగేది. చక్రపాణి, నాగిరెడ్డి ప్రారంభించిన ‘చందమామ’ దాదాపు ఆరున్నర దశాబ్దాలు ఆబాల గోపాలాన్నీ అలరించింది. ‘చందమామ’ తెలుగు సహా పదకొండు భాషలలో ప్రచురితమయ్యేది. అగ్రశ్రేణి రచయిత కొడవటిగంటి కుటుంబరావు దాదాపు మూడు దశాబ్దాల పాటు ‘చందమామ’కు సంపాదకుడిగా వ్యవహరించి, ‘చందమామ’ను భారతీయ బాలల పత్రికల్లోనే ధ్రువతారగా తీర్చిదిద్దారు. ‘చందమామ’ ప్రచురణ నిలిచిపోయినా, పాత సంచికలన్నీ ఇంట ర్నెట్‌లో అందు బాటులో ఉన్నాయి. పెద్దలుగా ఎదిగిన తర్వాత కూడా కొందరు మనసులో బాల్యాన్ని నింపుకొనే ఉంటారు. బహుశా అలాంటి వాళ్లను గురించే ‘పెద్దలు కాలం చెల్లిన పిల్లలు’ అని అమెరికన్ బాలల రచయిత డాక్టర్ సూస్ చమత్కరించాడు. ‘చందమామ’ పాత సంచికలను ఇప్పటికీ ఇష్టంగా చదువుకునే కాలం చెల్లిన పిల్లలు చాలామందే ఉన్నారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో బాలసాహిత్యానికి పంతొమ్మిదో శతాబ్దిలోనే పునాదులు పడ్డాయి. రావిపాటి గురుమూర్తి 1834లో ‘పంచతంత్ర కథలు’ సంస్కృతం నుంచి అనువదించారు. ఆ తర్వాతి కాలంలో ‘పంచతంత్ర’ కథలకు తెలుగులో దాదాపు అరడజను అనువాదాలు వెలువ డ్డాయి. పూడూరి సీతారామశాస్త్రి 1845లో ‘పెద్దబాలశిక్ష’ను తొలిసారిగా ప్రచురించారు. ఆయనే 1856లో పిల్లల కోసం ‘నీతి కథలు–చిత్ర కథలు’ ప్రచురించారు. ‘జనవినోదిని’ పత్రిక 1884లో పిల్లల పాటలను ప్రచురించింది. ‘వివేకవతి’ పత్రిక 1908 నుంచి పిల్లల రచనలను ప్రచురించేది. ఆనాటి సుప్రసిద్ధ రచయితల్లో దాదాపు అందరూ బాలల కోసం ప్రత్యేకమైన రచనలు చేశారు. కందుకూరి వీరేశలింగం ‘నీతికథామంజరి’ రాశారు. గిడుగు సీతాపతి పిల్లల కోసం ‘చిలకమ్మ పెండ్లి’, ‘రైలుబండి పాటలు’ రాశారు. వేంకట పార్వతీశ కవులు ‘బాలగీతావళి’ రాశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడివి బాపిరాజు, వావిలికొలను సుబ్బారావు, చింతా దీక్షితులు వంటి సుప్రసిద్ధులు బాలల సాహిత్యాన్ని సృష్టించారు. ‘భారతి’, ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్రభూమి’ వంటి పత్రికలు బాల సాహిత్యానికి చెందిన రచనలను కూడా ప్రచురించేవి. తొలి బాలల పత్రిక ‘బాలకేసరి’ 1940లో ప్రారంభమైంది. దానికి ఏడాది ముందే– 1939లో మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి న్యాపతి రాఘవరావు బాలల కార్యక్రమాలను ప్రారంభించారు.
తెలుగు బాలసాహిత్యంలో ఇవన్నీ ముఖ్యమైన మైలురాళ్లు. తెలుగులో బాలల సాహిత్యానికి ఆనాటి కాలం స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఇరవై ఒకటో శతాబ్ది మొదలయ్యాక తెలుగు బాలల పత్రికలు ఒక్కొక్కటే కనుమరుగవడం మొదలైంది. ఇంగ్లిష్, హిందీ సహా మిగిలిన పలు ప్రధాన భారతీయ భాషల్లో బాలల పత్రికలు ఇంకా ప్రచురితమవుతున్నా, తెలుగులో మాత్రమే కొంత భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. తెలుగులో ప్రధాన దినపత్రికల ఆదివారం అనుబంధాలకు మాత్రమే ప్రస్తుతం బాలసాహిత్యం పరిమితమవుతోంది. జనాదరణ గల బాలల పత్రిక తెలుగులో ఒక్కటైనా ప్రస్తుతం మనుగడలో లేకపోవడం దురదృష్టకర పరిణామం. ఇంతటి గడ్డు పరిస్థితుల్లోనూ కేవలం బాలల కోసమే ప్రత్యేకంగా రచనలు సాగిస్తున్న రచయితలు ఇంకా ఉండటమే విశేషం.
కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీలు ఏటేటా బాల సాహితీవేత్తలకు కూడా అవార్డులు అందిస్తున్నాయి. అయితే, బాల సాహిత్యాన్ని ప్రత్యేకంగా వ్యాప్తిలోకి తెచ్చేందుకు తగినంత చొరవ తీసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ‘బాల సాహిత్యాన్ని తక్కువ ధరకు అందించాలి. ప్రచురణలకు ప్రభుత్వం ప్రోత్సహించాలి. పుస్తకం ఆకర్షణీయంగా ఉండాలి’ అని కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన మాటలను ప్రభుత్వాలు కాస్త పట్టించుకుంటే బాగుంటుంది. రేపటి పౌరులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలంటే, వారికి తగిన సాహిత్యాన్ని విరివిగా అందుబాటులోకి తేవడం, ఆ సాహిత్యాన్ని ఆసక్తిగా చదివేలా వారిని ప్రోత్సహించడమే సరైన మార్గం. ఇదంతా కాలం చెల్లిన పిల్లలు తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment