ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువులు, తల్లి హేమలత
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించడం అరుదైన విషయమని నియో బీబీసీ న్యూ బార్న్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఎన్.ఎల్.శ్రీధర్, డాక్టర్ బి.సురేష్, డాక్టర్ శ్రీరాం అన్నారు. ఆదివారం విద్యానగర్‌లోని నియో బీబీసీ న్యూ బార్న్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 2న రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన హేమలతకు చిలకలగూడలోని గీతా నర్సింగ్ హోంలో నలుగురు పిల్లలు జన్మించారని, వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు అని తెలిపారు. డాక్టర్ మధురవాణి, డాక్టర్ త్రిగుణల ఆధ్వర్యంలో విజయవంతంగా ఆపరేషన్ చేశారన్నారు.
శిశువులు పుట్టిన వెంటనే విద్యానగర్‌లోని నియో బీబీసీ న్యూ బార్న్ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. పుట్టినప్పుడు ఓ శిశువు కిలో, మరొకరు 1,100 గ్రాములు, ఇంకొకరు 1,200, 1,400 గ్రాముల చొప్పున బరువు ఉన్నారని తెలిపారు. ఏడున్నర నెలలకే(31 వారాలకే) కాన్పు కావడంతో శిశువులు తక్కువ బరువుతో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం పిల్లలకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదని, వారు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. నియో బీబీసీలో ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో 8 లక్షల మందిలో ఒకరికి ఇలా అరుదైన కాన్పు జరుగుతుందని వారు అన్నారు. 9 నెలలు నిండక ముందే ఇలా కాన్పు అవుతుందన్నారు. సమావేశంలో వైద్యులు హారిక, శ్రుతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment