కర్నూలు నగరంలోని సి.క్యాంపు ప్రాంతానికి చెందిన లీలాదేవికి రెగ్యులర్‌గా నెలసరి వచ్చేది. ఒకసారి వారింట్లో పూజ ఉండటంతో ఆ సమయానికి పీరియడ్స్ రాకుండా మెడికల్‌షాపునకు వెళ్లి మాత్రలు తెచ్చి వేసుకునేది. అయితే అవి కాస్తా సైడ్‌ఎఫెక్ట్ ఇచ్చి ఆమెకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే గానీ సమస్య పరిష్కారం కాలేదు.
ఆదోనికి చెందిన లారీ డ్రైవర్ వీరస్వామి వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకుని బయటకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అతను మెడికల్ షాపునకు వెళ్లి పురుషాధిక్యం కోసం మాత్రలు తీసుకుని వాడేవాడు. ఒకసారి పరిమితికి మించి మాత్రలు వాడటంతో తీవ్రమైన గుండెపోటు వచ్చింది. సకాలంలో చికిత్స తీసుకుని బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న వైద్యుడు అతనికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చింది.
వీరే కాదు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్‌షాపులకు వెళ్లి మాత్రలు తీసుకుని వేసుకునేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. కొందరికి ఏమీ గాకపోయినా మరికొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇంకొందరికి దీర్ఘకాలంలో సమస్యలు వచ్చి ప్రాణాపాయంలోకి నెట్టేస్తున్నాయి. సొంత వైద్యం కొంత మానుకుని వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,800 దాకా పైగా రిటైల్ మెడికల్‌షాప్‌లు, 220 వరకు హోల్‌సేల్ మందుల ఏజెన్సీలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత మందుల దుకాణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం, కోవిడ్ అనంతరం పలు వ్యాధులు వస్తుండటంతో ప్రజలకు అటు వైద్యులు, ఇటు మందుల అవసరం అధికమైంది. ఈ క్రమంలో వైద్యుల సంఖ్యతో పాటు మెడికల్ షాపుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫలితంగా నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో ఇప్పుడు మెడికల్ షాపులు దర్శనమిస్తున్నాయి. అయితే, అధిక శాతం దుకాణాల్లో వైద్యుల మందుల చీటి లేకుండానే అన్ని రకాల మందులు విక్రయిస్తున్నారు. కోవిడ్ సమయం నుంచి ఈ విపరీత ధోరణి మరింత అధికమైంది.
వైద్యుల వద్ద ఖర్చు పెరగడమే కారణం
ఏదైనా ఒంట్లో నలతగా ఉంటే గతంలో సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకునేవారు. అప్పటి వైద్యులు రోగి వ్యాఽధి లక్షణాలు గుర్తించి ఆ మేరకు అవసరమైన మందులు రాసేవారు. అనవసరంగా వైద్యపరీక్షలు, మందులు రాసేవారు కాదు. కానీ ఇప్పుడు జ్వరం వచ్చిందని వైద్యుల వద్దకు వెళ్లినా అధిక శాతం మంది అవసరం లేకపోయినా మందులు, వైద్యపరీక్షలు రాస్తున్నారు. జ్వరం వస్తేనే వారికి డాక్టర్ బిల్లు రూ.2వేల నుంచి రూ.2,500 దాకా అవుతోంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, థైరాయిడ్, గుండెజబ్బులు వంటి వాటికి డాక్టర్ వద్దకు వెళ్తే ఖర్చు రూ.5 వేలు దాటుతుంది.
ఈ ఖర్చులు తగ్గించుకునేందుకు కొందరు, భరించలేక మరికొందరు రోగులు మెడికల్‌షాపులను ఆశ్రయిస్తున్నారు. ఒంట్లో ఏదైనా నలతగా ఉంటే తెలిసిన మెడికల్‌షాపునకు వెళ్లి మందులు తెచ్చుకుంటున్నారు. అయితే జలుబు, దగ్గు, జ్వరం, నొప్పుల వరకు అయితే ఓకే గానీ కొన్నిసార్లు యాంటిబయాటిక్స్, తీవ్రమైన స్టెరాయిడ్స్, నొప్పుల మాత్రలు కూడా రోగులకు విక్రయిస్తున్నారు. కర్నూలులోని కొన్ని దుకాణాల్లో మత్తు కలిగించే మందులు, ఇంజెక్షన్లు కూడా వాటికి బానిసైన వారికి విక్రయిస్తున్నారు. దీనికితోడు దగ్గు సిరప్‌లను అధిక శాతం విక్రయించే దుకాణాలు సైతం నగరంలో ఉన్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు.
అతిగా వాడితే ప్రాణాంతకం
వైద్యుల సూచన లేకుండా ఎడా పెడా మందులు కొని వాడితే అది మొదటికే మోసం చేస్తుంది. వైద్యులు 6 నుంచి 10 సంవత్సరాల పాటు వైద్య విద్యను అభ్యసిస్తే గానీ ఏ వ్యాధికి ఎలాంటి మందులు ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, వారి శరీర బరువు, వారి శరీర తత్వం, వారి శరీరం ఎప్పుడు ఎలా స్పందిస్తుంది, ఏ మందుకు ఎలా స్పందిస్తుంది లాంటి వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే వారు ఫలానా మందులను సూచిస్తూ ఉంటారు. వారి ప్రమేయం లేకుండా నేరుగా మందుల దుకాణంలో కొని వాడితే కొన్నిసార్లు ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉంది.
మరీ ముఖ్యంగా యాంటిబయాటిక్స్ వాడటం వల్ల శరీరంలోని మంచి బ్యాక్టిరియా కూడా నశిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వేసుకుంటే భవిష్యత్‌లో మళ్లీ వ్యాధి వచ్చినప్పుడు అవి పనిచేయకుండా పోతాయి. అలాగే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడితే కడుపులో పుండ్లు, కాలేయ సమస్యలు, కిడ్నీ సమస్యలు వస్తాయి. పీరియడ్స్ రావడానికి, పీరియడ్స్ వాయిదా పడేందుకు వాడే మందులు సైతం వైద్యుల సూచన లేకుండా వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం నేరం. ఇలా మందులు విక్రయించడం రోగుల ప్రాణాలతో ఆటలాడుకోవడమే. కొన్ని మెడికల్ షాపుల్లో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి వాటిపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాము. –రమాదేవి, అడిషనల్ డైరెక్టర్, ఔషధనియంత్రణ శాఖ
కడుపులో అల్సర్స్ ఏర్పడే ప్రమాదం
వైద్యుల సూచన లేకుండా నొప్పులు, స్టెరాయిడ్ మందులు వాడటం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎక్కువశాతం కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. కీళ్లనొప్పులు, ఇతర నొప్పులు తగ్గేందుకు వాడే ఈ మందులు తాత్కాలికంగా పనిచేసినా దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు చూపిస్తాయి. ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు హెర్బల్ పౌడర్ వాడుతున్నారు. దీనివల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఎక్కువ. –డాక్టర్ పి. అబ్దుల్ సమద్,
Comments
Please login to add a commentAdd a comment