మందుల సరఫరాపై దృష్టి పెట్టని కూటమి ప్రభుత్వం
ప్రతి బోధనాస్పత్రిలో వందకంటే ఎక్కువ రకాల మందుల కొరత
కనీసం కాటన్, గ్లౌజ్‌లు, కాన్యులాలు కూడా లేక ఇబ్బందులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మందుల సరఫరాను పూర్తిగా వదిలేసింది. కనీసం దూది, గ్లౌజులు, కాన్యులాలు కూడా లేక ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. ప్రాథమిక వైద్య సేవలందించే పీహెచ్‌సీల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల రెండో క్వార్టర్ మందుల సరఫరా విషయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.
వాస్తవానికి రెండో క్వార్టర్ మందులు, సర్జికల్స్ ఈపాటికే ఆస్పత్రులకు అందాలి. అయినా ప్రభుత్వం మందుల సరఫరాపై దృష్టే పెట్టలేదు. దీంతో మందులు సరఫరా చేయాల్సిన ఏపీఎంఎస్‌ఐడీసీ కూడా నిస్తేజంగా మారిపోయింది. పైకి ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం అంటూ చెబుతున్నా, ఆస్పత్రుల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. అన్ని ఆస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన మందులకంటే అతి తక్కువగా అందుబాటులో ఉన్నాయి.
గ్లౌజ్‌లు.. కాటన్‌కూ కొరత..
ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారికి అందించే చికిత్సల ఆధారంగా జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్‌లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా, బోధనాస్పత్రుల్లో వందకు పైగా రకాల మందులు లేవు. చాలా ఆస్పత్రుల్లో కనీసం గ్లౌజ్‌లు, కాటన్, ఐవీ కాన్యులా, అనస్తీషియా కోసం వాడే స్పైనల్ నీడిల్స్, శస్త్ర చికిత్సలు, క్షతగాత్రులకు కుట్లు వేయడానికి మెటీరియల్ కూడా అందుబాటులో లేవు. రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీసీ)లు ఉన్నాయి.
వీటిల్లోనే డ్రగ్స్, సర్జికల్స్ లేవని, ఇండెంట్ పెడదామంటే నిత్యం అవసరమైన కొన్ని రకాల మందులు కూడా చూపించడం లేదని ఆస్పత్రుల్లోని ఫార్మాసిస్ట్‌లు వాపోతున్నారు. లివర్, కిడ్నీ, గుండె, మెదడు సంబంధిత రోగులకు వాడే ఖరీదైన యాంటిబయోటిక్స్, ఆల్బుమిన్, ఇమ్యూనోగ్లోబ్యులిన్స్కు గుంటూరు, కర్నూలు, వైజాగ్ సహా పలు ఆస్పత్రుల్లో కొరత ఉంది. నెల్లూరు జీజీహెచ్‌లో గ్యాస్ సమస్యకు ఇచ్చే పాంటప్రజోల్ వంటి మాత్రలకు సైతం కొరత ఉంది. డెంటల్ విభాగంలో పంటి నొప్పితో వచ్చిన రోగులకు సిమెంట్ మెటీరియల్ కూడా లేదు.
అదే విధంగా చెవిలో వాడే డివాక్స్ ఇయర్ డ్రాప్స్ సైతం బయటకు రాస్తున్నారు. థైరాయిడ్ పరీక్షల వంటివి చేయడం లేదు. తెనాలి జిల్లా ఆస్పత్రిలో క్యానులా, గ్లౌజ్‌ల కొరత వేధిస్తోంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్‌సీడీ) మందులు, పెయిన్ కిల్లర్ మాత్రలు అందుబాటులో లేవు. దీంతో బీపీ, షుగర్ రోగులకు 30 మాత్రలకు బదులు 10 లేదా 15 మాత్రమే వైద్యులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment