
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): కొన్ని రకాల మందులు అరోగ్యంతో ఆటలాడకుంటున్నాయి. నకిలీ, నిషేధిత మందులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా ఈ మందుల విక్రయాలు ఉనికి చాటుకుంటునే ఉన్నాయి. సాధారణ ప్రజలకే కాదు చదువుకున్న చాలామందికీ మందులపై లోతైన అవగాహన లేకపోవడంతో వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. మార్కెట్‌లో అధిక లాభాపేక్షతో మందుల షాపుల యజమానులు ఈ తరహా మందులు విక్రయిస్తున్నారు. ఇలాంటి మందులు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి.
ధనార్జనే ధ్యేయంగా..
మార్కెట్లో నకిలీ మందుల విక్రయాలు పెరిగిపోతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొన్ని చిన్నపాటి మందుల కంపెనీలు నకిలీలతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. మందుల పేరులో కొద్దిపాటు అక్షరాల మార్పుతో తప్పుదారి పట్టిస్తున్నాయి. సాధారణంగా జ్వరానికి పారాసెట్‌మాల్ టాబ్లెట్‌ను వాడతారు. ఈ మందునే కొన్ని కంపెనీలు తమ బ్రాండ్లతో విక్రయిస్తుంటాయి. ఇదే మందును డోలో–650 పేరిట కూడా మార్కెట్లో లభ్యమవుతుంది. కానీ కొన్ని మోసపూరిత కంపెనీలు డోలో పేరును రకరకాలుగా ముద్రించి గుర్తించలేని విధంగా నకిలీవి తయారు చేస్తున్నాయి. ఇది ఉదాహరణ మాత్రమే. ఇలా చాలా మందుల్ని ప్రజలు గుర్తించలేకపోతున్నారు. మందుల షాపు వాళ్లు ఇచ్చినవి తీసుకుంటున్నారు. కనీసం ఈ మందు అసలైనదా కాదా అని పరిశీలించే అవగాహన కొరవడుతోంది. ఈ బలహీనతే మందుల షాపులకు..కంపెనీలకు కలిసివస్తోంది. ప్రస్తుతం నకిలీ మందులే ఎక్కువగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ తరహా మందులు వాడినా ప్రయోజనం పెద్దగా ఉండదు. పైగా అనారోగ్యం పెరుగుతుంది. మందుల వ్యాపారంలో వచ్చిన ఈ ధోరణి అత్యంత ప్రమాదకరమని ఔషధ నియంత్రణ శాఖ హెచ్చరిస్తోంది.
పల్లెల్లో టోకరా
కార్పొరేట్ లేదా పేరున్న మందుల షాపుల్లో నకిలీలకు ఆస్కారం తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా మందులను అధికంగా అమ్ముతున్నట్లు గుర్తించారు. నిరక్షరాశ్యులే కాదు చదువుకున్న వారూ ఈ మందుల మోసాల బారిన పడుతున్నారు. చాలా మంది అధికంగా గ్యాస్ట్రిక్ ట్యాబెట్లు కొంటుంటారు. పేంటాప్రజోల్ మందు దీని నివారణకు ఉపయోగపడుతుంది. ఈ మందుతో రకరకాల టాబ్లెట్లు వచ్చాయి. పేంటాప్ బ్రాండ్ పేరు. కానీ కొన్నింటిపై ఎక్కడోచోట చిన్నపాటి అక్షరం మార్చి పేంటాప్ మాత్రగా భ్రమింపజేస్తున్నారు. అవగాహన లేక చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇలా అమ్ముతున్న మందుల్లో పాంటాసిడ్ డీఎస్‌ఆర్ సైతం ఉందని డ్రగ్స్ అధికారులు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరు జిల్లాల్లో రూ.1 లక్ష విలువైన నకిలీ మందులను పట్టుకున్నారు.
అప్రమత్తత అవసరం
అత్యవసరంలోను, డాక్టర్ పర్యవేక్షణలోనూ వాడాల్సిన మందుల వాడకం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలుపాటించాల్సిందే. లేనిపక్షంలో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలస్ట్రాల్ తగ్గుదలకు రోస్‌వాస్..షుగరుకు గ్లూకోనార్మ్..ఫిట్స్‌కు గబాపెండింగ్..బీపీకి టెల్మా–హెచ్..జీర్ణాశయ అల్సర్లకు పెంటాప్–డీఎస్సార్ మందులు వాడుతుంటారు. కానీ ఈ మందులకు సంబంధించి గుంటూరు..విజయవాడ..నరసరావుపేటల నుంచి నకిలీలు ఎక్కువగా మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రాణహాని ఉందని చెబుతున్నా వీటిని విచ్చలవిడిగా కొంటున్నారు. వీటిని విక్రయించవద్దని మందుల దుకాణాలకు ఇప్పటికే ఔషధ నియంత్రణ శాఖాధికారులు అదేశాలు జారీ చేశారు. వీటి అమ్మకాలపై గట్టి నిఘా పెట్టారు. ఇలాంటి నకిలీ మందుల కట్టడి కోసమే షాపులో తప్పనిసరిగా సీసీ కెమెరా ఉండాలనే నిబంధన విధించారు. మందులు ఎవరికి ఇచ్చారు. ఏ వైద్యుని చీటీపై ఇచ్చారో రికార్డు అవ్వాలని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు.
దొరికితే లైసెన్సు రద్దే...
నకిలీ మందులు, నిషేధిత మందులు, హెచ్, హెచ్ 1, షెడ్యూల్ ఎక్స్ మందుల అమ్మకాలపై నిఘా పెట్టాం. వీటిపై మందుల దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాటి అమ్మకాల వల్ల జరిగే అనర్దాలు, డ్రగ్స్ అధికారులకు పట్టుబడడం వల్ల జరిగే వ్యాపార నష్టం, జైలుశిక్షలపై వివరిస్తున్నాం. ఎవరైనా దొరికితే వెంటనే మందుల దుకాణం లైసెన్సు రద్దు చేస్తాం. మందులు కొనుగోలుపై ప్రజల్లో పూర్తిగా అవగాహన రావాలి. కొన్ని రకాల మందులు డాక్టర్ సలహా మేరకే వాడాలి. కొన్ని మందులు వాడడం వల్ల ఉన్న రోగం తగ్గే మాట ఎలా లేని పోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటివల్ల తాత్కాలిక ఉపశమనమున్నా శరీర భాగాలకు హాని చేయడంలో ఇవి కత్తి కన్నా పదునుగా పనిచేస్తాయి.
– డి.నాగమణి, సహాయ సంచాలకులు, ఔషధనియంత్రణశాఖ.
ఏం చేయాలి
లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేయాలి.
అన్ని అర్హతలూ ఉన్న వైద్యులతోనే చికిత్స చేయించు కోవాలి.
మందులు తీసుకునేటప్పుడు బిల్లు రాయించుకోవాలి.
ఆయా మందులు వాడేటప్పుడు అలర్జీ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపి సంబంధిత డాక్టరుకు, డ్రగ్స్ అధికారులకు తెలియజేయాలి.
మందుల నాణ్యతపై అనుమానమొస్తే వెంటనే ఔషధ తనిఖీ అధికారికి సమాచారమివ్వాలి
ఫిర్యాదు చేస్తే సంబంధిత మందును లేబరొటరీ పరీక్షలకు పంపుతారు.
నిషేఽధిత మందులు వాడొద్దు
నిమ్సులైడ్, సిట్రిజన్ హైడ్రోక్లోరైడ్,, లివోసిట్రిజన్,పారాసిటమాల్ బ్రోమోహెక్సెన్,యామ్‌బ్రాక్సల్ లాంటి మందులలో బ్రాండ్లను అనుసరిస్తూ నకిలీలు ఎక్కువగా వస్తున్నట్లు అధికారులు ఇటీవల దాడుల్లో గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, హరిద్వార్, బద్ది వంటి ప్రాంతాల్లోని కంపెనీలు ఈ మందులను రకరకాల పేరుతో నకిలీవి తయారు చేసున్నాయి. 12 ఏళ్లలోపు వయసున్న వారికి నిమ్సులైడ్ మందు వాడకూడదు. దీనిని నిషేధించారు. అయినా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ప్రాణానికి హానిచేసే 200 రకాల ఔఽషధాలను నిషేధించారు.
Comments
Please login to add a commentAdd a comment