సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లుతున్న మందులే గతి అంటూ ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ఈ కథనం పూర్తిగా ఊహాజనితమని ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీ మురళీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే దురుద్దేశంతో కథనం రాశారని అన్నారు.
నెల క్రితం ఒంగోలు జీజీహెచ్‌కు 2 నెలల కాల వ్యవధి ఉన్న మందులను పంపి, వాటిని తీసుకోవాలని సిబ్బందిపై ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చారు.డబ్ల్యూహెచ్‌వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలున్న మందులను మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్)లకు సరఫరా చేస్తున్నామన్నారు. 6 నెలల కాలవ్యవధి ఉన్న మందులను సంబంధిత కంపెనీలకు సమాచారమిచ్చి, వాటి స్థానంలో అంతే పరిమాణంలో కొత్త స్టాక్ పొందుతున్నట్టు తెలిపారు. ఏదైనా కంపెనీ కొత్త స్టాక్ ఇవ్వకపోతే వారికి చెల్లించే బిల్లుల నుంచి రికవరీ చేస్తామన్నారు.
అంతేకాకుండా 3 నెలల కాల వ్యవధి ఉన్న మందులను ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు ఈ–ఔషధి పోర్టల్ అనుమతించదని స్పష్టం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 207 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 5 శాతం కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 483 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 0.85 శాతం మందులు మాత్రమే కాలం చెల్లినవి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ పేదలకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment