20 నుంచి 45 నిమిషాల్లో వైద్య చికిత్స అందేలా కార్యాచరణ
గోల్డెన్ అవర్‌లో చికిత్స అందేలా ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు
నర్సంపేటలో జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, వరంగల్/నర్సంపేట: ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యంగా విద్య, వైద్యం ఉండాలి.. అవి అమలు చేసేదిశగా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.183 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలను గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మెడికల్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలు భర్తీ చేశామని వెల్లడించారు.
7 వేల మందికి నర్సింగ్ పోస్టింగ్‌లు ఇచ్చామని, త్వరలో ఇంకో 2,500 మందికి పోస్టింగ్ ఇచ్చే దిశగా నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ‘సామాన్యులకు ఎక్కడి నుంచైనా 20 నుంచి 45 నిమిషాల్లో వైద్యచికిత్స అందేవిధంగా ప్రాథమిక, ఏరియా, జిల్లా ఆస్పత్రులను నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నాం. సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా 108, 104, 102 ఆరోగ్యశ్రీ ట్రస్టు లాంటివి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. 2004 నుంచి ఇప్పటివరకు ట్రీట్‌మెంట్ ప్రొసీజర్ చార్జెస్ గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదు.
కానీ మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 శాతం పెంచింది. దానికోసం రూ.4,000 కోట్లు అదనంగా ఖర్చు చేశాం’అని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన గంట (గోల్డెన్ అవర్)లోపు వైద్యం అందించే విధంగా తెలంగాణవ్యాప్తంగా ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని, రూ.46వేల కోట్ల ఈ ప్రాజెక్టులో రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్లు పక్కదారి పట్టాయన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా, 53 శాతం ఇళ్లకు మంచినీరు అందడం లేదనే భయంకరమైన విషయాలు వెలుగు చూశాయని వెల్లడించారు. ఈ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేసినట్టుగా లేదని, వారి జేబులు నింపుకోవడానికి చేసినట్టుగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, డాక్టర్ మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఎంఈ వాణి పాల్గొన్నారు.
మంత్రుల నోట వైఎస్ అభివృద్ధి మాట
దేశ చరిత్రలోనే పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ కొనియాడారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదలకు వైఎస్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ సేవలు మరచిపోలేమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment