సాక్షి, అమరావతి: అబద్ధాలు అచ్చేయకపోతే రామోజీరావుకు నిద్రపట్టేలా లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లకుండా ఆయన భోజనం చేయలేరు. పేదలకు అందించే ఉచిత కార్పొరేట్ వైద్యం పైనా విషపురాతలే. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందడం రామోజీరావుకు నచ్చడం లేదు. మన రాష్ట్రంతో పాటు, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లోని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద పేద, మధ్యతరగతి ప్రజలకు అందుతున్న ఉచిత వైద్య సేవలపై నిత్యం కడుపు మంటను ప్రదర్శిస్తున్నారు.
ఈ పరంపరలో భాగంగానే ‘బకాయిల రోగం.. సేవలు ఘోరం!’ అంటూ ఈనాడు పత్రికలో శుక్రవారం కథనం అచ్చేశారు. ఆ పథకం సమర్థవంతంగా అమలు కావడం లేదంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. బకాయిల కారణంగా రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోయాయంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే..
ఈ ఏడాది రూ. 2,790.61 కోట్లు చెల్లించిన ప్రభుత్వం
గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తి నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పథకానికి ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. బాబు పాలనలో నిర్వీర్యమైన పథకానికి సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణల ద్వారా ఊపిరిలూదారు. ఇటీవలే పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని ఏకంగా రూ. 25 లక్షలకు పెంచారు. 1,059 ప్రొసీజర్‌లను 3,257కు తీసుకుని వెళ్లారు. ప్రొసీజర్‌ల సంఖ్య గణనీయంగా పెరగడంతో 2019కు ముందు రోజుకు సగటున 1,547 చికిత్సలు చేయగా, ప్రస్తుతం 5,608 చికిత్సలు నిర్వహిస్తున్నారు.
ఈ పథకం ఇంత ఘనంగా కొనసా గుతుంటే.. రాష్ట్రంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయంటూ అబద్ధాలను అల్లి ఆ కథనం ప్రచురించారు. నిజానికి ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఏ నెట్‌వర్క్ ఆస్పత్రిలోనూ రోగులను చేర్చుకోని ఘటనలు లేవు. కావాలని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు, సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటున్నారు.
త్వరితగతిన క్లెయిమ్‌లు
గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి రూ. 2,146.90 కోట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ. 2,790.61 కోట్లు విడుదల చేశారు. ఆస్పత్రుల నుంచి వచ్చే క్లెయిమ్‌లను త్వరితగతిన అత్యంత పారదర్శకంగా ఆమోదిస్తున్నారు. ప్రభుత్వ స్పెషలిస్టు వైద్యులను ప్యానెల్ వైద్యులుగా తీసుకునే ప్రక్రియ చేపడుతున్నారు.
క్యాన్సర్ చికిత్స ముందస్తు అనుమతి, క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎయిమ్స్, హోమీబాబా, శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్, రాష్ట్ర ప్రభుత్వం సంస్థలైన డీఎంఈ, స్విమ్స్, విమ్స్ వైద్యుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో క్లెయిమ్స్ ఆమోద ప్రక్రియలో తీవ్రమైన జాప్యానికి ఆస్కారమే లేదు.
లంచాలకు తావు లేకుండా
లంచాలకు, డబ్బు వసూళ్లకు తావులేకుండా పేదరోగులకు పూర్తి ఉచితంగా పథకం సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందేటప్పుడు నెట్‌వర్క్ ఆరోగ్యమిత్రల పర్యవేక్షణ ఉంటుంది. డిశ్చార్జ్ సమయంలో ఆసుపత్రిలో సేవలు ఎలా అందాయో రోగుల నుంచి అభిప్రాయ సేకరణ విధానం అమలు చేస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కూడా రోగులు ఇంటికెళ్లి ఏఎన్‌ఎంలు మరోమారు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
ఈ ప్రక్రియలో ఎక్కడైన రోగులు లంచాలు, చేతి నుంచి డబ్బు చెల్లించిన ఘటనలు వెలుగు చూస్తే వెంటనే ఆ డబ్బులు వెనక్కి ఇప్పించడంతో పాటు, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. రోగులకు పథకం విషయంలో సందేహాల నివృత్తి వారికి ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు 104 కాల్ సెంటర్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాల్ సెంటర్‌లకు వచ్చే ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment