ప్రజారోగ్యానికి ‘రక్ష’ | CM Jagan launched Jagananna Arogya Suraksha virtually | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యానికి ‘రక్ష’

Published Sat, Sep 30 2023 4:32 AM | Last Updated on Sat, Sep 30 2023 8:27 AM

CM Jagan launched Jagananna Arogya Suraksha virtually - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని ‘జగనన్న ఆరోగ్య సురక్ష’  ద్వారా చేపడుతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకూ ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములయ్యారని తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు.

ప్రివెంటివ్‌ కేర్‌లో నూతన అధ్యాయం
ఫ్యామిలీ డాక్టర్‌ విధానం రూపంలో ప్రివెంటివ్‌ కేర్‌లో నూతన ఒరవడికి నాంది పలికాం. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపంలో ప్రివెంటివ్‌ కేర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎవరూ, ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మనం ధైర్యంగా, సాహసోపేతంగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ను, 542 వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తేగలిగాం.

వీటిలో పూర్తి స్థాయిలో వనరులన్నీ సమకూర్చాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేలా చర్యలు చేపట్టాం. పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు, ఒక 104 వాహనాన్ని సమకూర్చాం. పీహెచ్‌సీల్లోని వైద్యులకు ఆ మండలంలోని గ్రామాలను విభజించి వైద్య సేవలు అందించేలా చూస్తున్నాం. ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్‌సీలో సేవలు అందిస్తుంటే మరొకరు 104 ఆంబులెన్స్‌లో తనకు కేటాయించిన గ్రామానికి వెళ్లి సేవలు అందిస్తున్నారు.

ఇలా తనకు కేటాయించిన గ్రామాలను ప్రతి వైద్యుడు నెలలో రెండు సార్లు సందర్శిస్తున్నారు. క్రమం తప్పకుండా ఓ గ్రామానికి వైద్యుడు వెళ్లడం వల్ల ఆర్నెల్లలో  గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలకు వైద్య పరంగా ఏ అవసరాలున్నాయనేది గుర్తించి మెరుగైన వైద్య సంరక్షణ చర్యలు చేపడుతున్నాం.  

అప్పులపాలయ్యే పరిస్థితులు రాకుండా
దురదృష్టవశాత్తూ ఏదైనా జబ్బు బారినపడితే పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అప్పుల పాలయ్యే పరిస్థితులు రాకుండా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అండగా ఉంటున్నాం. టీడీపీ హయాంలో కేవలం 1,056 ప్రోసీజర్స్‌కు పరిమితం కాగా ఇప్పుడు 3256కు ప్రొసీజర్స్‌ను పెంచాం. గతంలో 915 నెట్‌వర్క్‌ ఆసుపత్రులుంటే ఈ రోజు 2,200 పైచిలుకు ఆస్పత్రులున్నాయి. ప్రజలు వైద్యం కోసం అప్పులపాలు కాకుండా ఉండాలనే ఈ చర్యలన్నీ చేపట్టాం.

ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర
ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలున్నా గుర్తించేలా సర్వే నిర్వహిస్తున్నాం. ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు చేసి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నాం. అనంతరం గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్టు డాక్టర్‌లతో చికిత్స అందిస్తున్నాం. రోగం నయం అయ్యే దాకా సంబంధిత వ్యక్తిని చేయిపట్టి నడిపిస్తాం.

ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు ఏరకంగా పొందాలనే విషయాలను వివరించాలి. వైద్య సేవలు పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు ఎలా చేయాలో కూడా తెలియచేయాలి. అవసరమైన మందులు అందేలా, ఆ మేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్‌  చేయాలి. క్యాన్సర్, డయాలసిస్‌ రోగులకు ఖరీదైన మందులు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉచితంగా అందిస్తాం. 

ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి
ఐదు దశలను క్రోడీకరిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఇప్పటికే అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాం. గ్రామస్ధాయి నుంచి నెట్‌ వర్క్‌ అంతా కనెక్ట్‌ అయింది. ప్రతి ఒక్కరు తమ విధులను బాధ్యతగా భావించాలి. కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి.

ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆశా), అసోసియేషన్‌ ఆఫ్‌ నెట్‌ వర్క్‌ హాస్పిటల్స్‌ ఆఫ్‌ ఏపీ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) భాగస్వామ్యం అయ్యాయి. వీరందరికీ నా తరపున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సాంబ­శివారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఐదు దశలుగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’
మొదటి దశ: మొదటి దశ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, సీఎం జగన్‌ ప్రభుత్వం పట్ల అభిమానం, ప్రేమ ఉన్న వారెవరైనా ఇందులో పాల్గొనవచ్చు. వీరు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. ఏ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు? ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు? అనే వివరాలు ప్రజలకు చెప్పాలి. అనంతరం సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు ఆయా ఇళ్లకు వచ్చి ఆరోగ్యంపై వాకబు చేస్తారని,  ఏడు రకాల టెస్టులు నిర్వహించేందుకు వీలుగా వారి వద్ద కిట్స్‌ ఉంటాయని తెలియచేయాలి.

రెండో దశ: గ్రామంలోని విలేజ్‌ క్లినిక్‌లో ఒక భాగానికి సీహెచ్‌వో, మరొక భాగానికి ఏఎన్‌ఎం బాధ్యత తీసుకుని ఆశావర్కర్లు, వలంటీర్లతో మమేకమై ప్రతి ఇంటిని జల్లెడ పడతారు. ప్రతి ఇంట్లోనూ బీపీ, షుగర్, హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేపడతారు. ఇలా ఏడు రకాల టెస్టింగ్‌ ఎక్విప్‌మెంట్‌ తీసుకెళ్లి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై వాకబు చేస్తారు. ఆరోగ్యశ్రీ యాప్‌ ద్వారా మ్యాపింగ్‌ చేస్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తారు. స్మార్ట్‌ ఫోన్‌లో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి మందులు ఇవ్వడమే కాకుండా మ్యాపింగ్‌ చేసి పుడ్‌ సప్లిమెంటేషన్‌ కోసం చర్యలు చేపడతారు.

మూడో దశ: గ్రామం, పట్టణంలో హెల్త్‌ క్యాంపునకు మూడు రోజుల ముందు వలంటీర్లు, గృహసారధులు, ఔత్సాహికులు, ప్రభుత్వం పట్ల, ఆరోగ్యశ్రీ పథకం మీద మమకారం ఉన్నవారంతా ఏకమై ప్రతి ఇంటికీ వెళతారు. గ్రామం/పట్టణంలో హెల్త్‌ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై వివరాలు అందిస్తారు. హెల్త్‌ క్యాంపులో పాల్గొనాలని సూచిస్తారు. రెండో దశలో ఇచ్చిన టోకెన్‌ నెంబర్లు ఉన్నవాళ్లు తప్పకుండా క్యాంపులో హాజరవ్వాలని వివరిస్తారు. టోకెన్‌ లేకపోయినా వైద్యం అవసరమైన వారు కూడా హెల్త్‌ క్యాంపులకు రావచ్చని తెలియజేస్తారు.  

నాలుగో దశ: హెల్త్‌ క్యాంపుల నిర్వహణ ఈ దశలో ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్‌ క్యాంపు నిర్వహించే రోజు వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, ఆశావర్కర్లు, సీహెచ్‌వోలు, ఔత్సాహికులు మమేకమవుతారు. క్యాంప్‌ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందేలా చూస్తారు. మందులు సమకూర్చడం, ఇతర సహాయ సహకారాలు అందిస్తారు. సంబంధిత వ్యక్తులను విలేజ్‌ క్లినిక్స్‌ వారీగా ఫ్యామిలీ డాక్టర్, ఏఎన్‌ఎంలకు మ్యాప్‌ చేస్తారు. మ్యాప్‌ అయిన వ్యక్తులకు తర్వాతి రోజుల్లో తగిన వైద్యం అందించే చర్యలు తీసుకుంటారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడం, చికిత్స అనంతరం మందులు, రెగ్యులర్‌ ఫాలో అప్‌ చేపడతారు.  

ఐదో దశ: ఈ దశలో ప్రజలను చేయిపట్టుకుని నడిపిస్తాం. సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూత నిస్తాం. ఆయా వ్యక్తుల పర్యవేక్షణ బాధ్యతలను వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్‌వోలు తీసుకుంటారు. చికిత్స అందించడంతోపాటు క్రమం తప్పకుండా ఆరోగ్యంపై వాకబు చేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement