సాక్షి ప్రతినిధి, కాకినాడ: హైకోర్టు ఆదేశాల్లో ఒకటి నేరుగా కాకినాడ జీజీహెచ్‌కు సంబంధించిన విషయం కాగా, మరొకటి రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న శిశు మరణాలపైన అనేది హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయంతో విదితమవుతోంది. ఈ రెండు అంశాలు జిల్లాకు కచ్చితంగా వర్తించినవే. ఇక్కడ చోటుచేసుకుంటున్న శిశు మరణాలు మరే జిల్లాలో చోటుచేసుకోవడం లేదు. అందుకు పేర్కొన్న శిశు మరణాల గణాంకాలే ఉదాహరణలు. గత నాలుగున్నరేళ్లలో 4474 శిశు మరణాలు సంభవించాయంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క కాకినాడ జీజీహెచ్‌లోనే 3889« శిశు మరణాలు చోటుచేసుకున్నాయి. శిశు మరణాలే కాదు మాతృ మరణాలు నమోదవుతున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో జిల్లా వ్యాప్తంగా ప్రసవ సమయంలో 298 మంది తల్లులు చనిపోయారు. ఇందులో ఒక్క జీజీహెచ్‌లోనే 180 మంది మృతి చెందారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. వెలుగు చూడని, అధికారుల దృష్టికి రాని కేసులెన్నో ఆ పైవాడికే తెలియాలి.
జిల్లా జడ్జి నివేదిక రప్పించుకున్నహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి...
ఆసుపత్రిలో తల్లులు వదిలేసిన మృత శిశువులు, పిండాలను వారానికోసారి మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి ఖననం చేయాల్సి ఉండగా సంబంధిత వాహనం మరమ్మతులకు గురైన కారణంగా నాలుగు వారాలుగా మృత శిశువులను తీసుకెళ్లకుండా వదిలేశారు. మృతదేహాలు పాడవుతున్నా బయటికి రాకుండా ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచడంపై హైకోర్టు సీరియస్ అయింది. దీంతో సంబంధిత అధికారులను ప్రతివాదులుగా చేర్చడమే కాకుండా జిల్లా జడ్జి నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నివేదిక తెప్పించుకున్నారు. శిశు మరణాలకు గల కారణాలపై లోతుగా అధ్యయనం చేయాలని కూడా ఆదేశించారు.
లోపమిదేనా...
సాధారణంగా గర్బం దాల్చిన వెంటనే ఆమె పేరు, ఆధార్, రేషన్ నెంబర్, చిరునామా లాంటి వివరాల్ని స్థానిక వైద్యాధికారులు నమోదు చేయాలి. గర్భిణికి హెచ్‌బీ, బీపీ, సుగర్, హెచ్‌బీఎస్‌ఎజీ, హెచ్‌ఐవీ వంటి పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఏ ఒక్క వ్యాధి ఉన్నా వారిని హైరిస్క్ గర్భిణిగా గుర్తించి ప్రసవమయ్యేవరకు నిరంతరం ఏఎన్‌ఎం, డాక్టర్లు పర్యవేక్షించాలి. గుర్తించిన హైరిస్క్ మదర్స్‌ను 9వ నెల వచ్చేలోపు నాలుగుసార్లు డాక్టర్ పురిశీలించాల్సి ఉంది. వారికి ఎస్కార్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలో చెప్పేందుకు బర్త్ ప్లానింగ్ వేయాలి. జిల్లాలో ఇదేమీ సరిగా జరగగడం లేదు. ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం, రక్తహీనత తదితర సమస్యలను గుర్తించి సలహాలివ్వడం, అవసరమైన మందులు సమకూర్చడం వంటివి చేస్తేనే నెలలు నిండని, బలహీన శిశు మరణాలు తగ్గడం సాధ్యమవుతుంది. కానీ, జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
జీజీహెచ్‌లోనే ఎందుకిలా...అరకొర వైద్యులపై తీవ్ర పనిభారం...
జిల్లాలో ప్రధాన ఆసుపత్రిగా కాకినాడ జీజీహెచ్ కొనసాగుతోంది. ఎక్కువ కేసులు ఇక్కడికే వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడెన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితులు కాకినాడ ఆసుపత్రిలో నెలకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇక్కడన్నీ లోపాలే. కాకినాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా వైద్యుల భర్తీ చేయడం లేదు. ముఖ్యంగా గైనిక్ వార్డులో పూర్తిస్థాయిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో ఉన్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. వారంతా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు.
ఫలితంగా ప్రాణాంతక సమయంలో సరైన వైద్య చికిత్సలందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి, మాతా,శిశు ప్రసూతి విభాగంలో సుమారు 300 పడకలున్నాయి. నిత్యం ఇక్కడ చికిత్స పొందేందుకు గర్భిణులు 500 నుంచి 550 వరకూ వస్తుంటారు. రోజుకి 50 వరకూ ప్రసవాలు జరగుతుండగా 20–25 వరకు సీజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి.ప్రసూతి విభాగంలో ఆరు విభాగాల ఆ«ధ్వర్యంలో చేయాల్సిన పనిని కేవలం మూడు విభాగాల ద్వారానే చేపట్టడంతో దయనీయ పరిస్థితులు నెలకున్నాయి. తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో గైనిక్ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో ఐదుగురు వైద్యులు పనిచేయాల్సి ఉంది. ఈ లెక్కన 27 మంది ఉండాల్సి ఉంది.
ప్రస్తుతం ఇక్కడ మూడు విభాగాలకు కలిపి ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ఎంసీఐ నిబంధనల మేరకు ఒక్కో యూనిట్‌కి 30 బెడ్లతో మూడు యూనిట్లకు 90 బెడ్లుండాల్సి ఉండగా, ప్రస్తుతం 300 బెడ్లున్నాయి. దీనిబట్టి ఇక్కడెంత రద్దీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో సౌకర్యాల్లేకపోవడంతో ప్రసవానికొచ్చిన తల్లులకు గర్భశోకమే మిగులుతోంది.
పూర్తి స్థాయి కమిటీ ఏదీ....సమీక్షలేవీ...?
సాధారణంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలి. వైద్య సేవలపైనా, వైద్యుల పనితీరుపైనా ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మరింత అప్రమత్తం కావాలి. మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకోవాలి. శిశు మరణాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా లోపమెక్కడో గుర్తించి తదననుగుణంగా> మరణాల నియంత్రణకు కృషి చేయాలి. కానీ, కాకినాడ ఆసుపత్రికి అటువంటి యోగం లేదు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకమే జరగలేదు. ముగ్గురు అధికారులతో ‘మమ’ అనిపించేస్తున్నారు.
పాలకుల ఒత్తిళ్ల కారణంగానో...మరేమిటో తెలియదు గాని ఇంతవరకు అçసుపత్రి కమిటీ ఏర్పాటు కాలేదు. దీంతో సమీక్షలు, సమావేశాలకు ఆస్కారం లేకుండా లేకుండాపోయింది. గత రెండున్నరేళ్లుగా ఆసుపత్రి పరిపాలనకు సంబంధించిన సమస్యలపై చర్చించిన దాఖలాలు లేవు. అసలు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఏమాత్రం పట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఈయనొచ్చాక కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో వందల శిశు మరణాలు సంభవించాయి. గతం తెలియకపోయినా ఆయనొచ్చాక చోటుచేసుకున్న మరణాలైనా కదలించాలి. కచ్చితంగా స్పందించి ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి. లోపమెంటో గుర్తించి, శిశు మరణాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. శిశు మరణాలను కలెక్టర్ సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
చిన్నారుల మృతికి కారణాలివీ...
గర్భిణి ప్రసవం కోసం వచ్చే సమయంలో పౌష్టికాహార లోపం, గుండె, ఉదర, శ్వాస కోసం, మెదడు, పక్షవాతం, ఉమ్మనీరు మింగేయడం వంటి ప్రాణాంతక, సంక్లిష్ట పరిస్థితుల్లో శిశువులు చనిపోతున్నారు. ఆ దిశగా ఏం చేయాలో ఆలోచించి వైద్య సేవలందించాలి. దానికి సరిపడా వైద్యుల్లేకపోవడంతో అరకొర వైద్య సేవలందుతున్న పరిస్థితి నెలకుంది. దీంతో శిశువులకు చావు తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోతోంది.
Comments
Please login to add a commentAdd a comment