సాక్షి, అమరావతి: ఆరోగ్య శాఖలో చేపట్టనున్న సంస్కరణల విషయంలో నిర్దిష్ట కాలపరిమితి, కార్యాచరణతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం డాక్టర్ సుజాతారావు నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి తమ మధ్యంతర నివేదికను అందజేసింది. ఈ నివేదికలోని అంశాలపై కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి చర్చించారు. సంస్కరణలు పకడ్బందీగా అమలు కావాలంటే మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఆగస్టు 30లోగా తుది నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. ఆగస్టు 12న మరోసారి సమావేశమై చర్చిద్దామని అన్నారు. ఆరోగ్య రంగంలో వివిధ అంశాలకు సంబంధించి కచ్చితమైన కాల వ్యవధితో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘104’, ‘108’ వాహనాల కొనుగోలు, ప్రజలకు కంటి పరీక్షలు, హెల్త్‌కార్డుల జారీ తదితర కీలక అంశాలపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.
‘ఆరోగ్యశ్రీ’ విధివిధానాలను ఖరారు చేయండి
రాష్ట్రవ్యాప్తంగా నిర్మించతలపెట్టిన 5 క్యాన్సర్ ఆస్పత్రులకు శంకుస్థాపనలు, నిర్మాణ పనులపై ఒక ప్రణాళిక ఖరారు చేయాలని అ«ధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. విజయనగరం, పాడేరు, గురజాలలో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలపై నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలన్నారు. కిడ్నీ ఆస్పత్రులకు శంకుస్థాపన, పనుల ప్రారంభంపైనా కార్యాచరణ ఉండాలన్నారు. చికిత్స ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం చేయిస్తామంటూ హామీ ఇచ్చామని, దీనికి అవసరమైన విధివిధానాలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో తనిఖీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల మెరుగు కోసం ఒక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఈ పనులన్నీ ఆలస్యం కాకుండా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
పీపీపీ ఒప్పందాలను సమీక్షించాలి
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన నిపుణుల కమిటీ తాము గుర్తించిన సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను మధ్యంతర నివేదికలో ప్రస్తావించింది. గిరిజన ప్రాంతాలతో పాటు మొత్తం 13 జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేశామని, ‘108’, ‘104’ సర్వీసులతో పాటు వివిధ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించామని కమిటీ తెలిపింది. స్విమ్స్, విమ్స్, రిమ్స్, బర్డ్, టీఎంసీలతో పాటు ఏపీ మెడ్‌టెక్ జోన్‌ను కూడా సందర్శించామని వెల్లడించింది. విశాఖపట్నం, తిరుపతిలో వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యామని, గుంటూరు, కడప, నెల్లూరులో కూడా బృందాల వారీగా సమావేశమై వివరాలు తెలుసుకున్నామని ముఖ్యమంత్రికి నివేదించింది. ఆరోగ్య శాఖలో వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. కొత్త అంబులెన్స్‌ల కొనుగోలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ల ఏర్పాటు, సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణ తదితర అంశాలపై కీలక సూచనలు చేసింది. ప్రతి మండలానికీ ఒక ‘108’ వాహనం ఉండాలని పేర్కొంది. మందుల సరఫరాలో లోపాలు ఉన్నాయని, ఆడిట్ కూడా సరిగ్గా లేదని వెల్లడించింది. రాష్ట్రంలో సౌకర్యాలు మెరుగుపడేంత వరకూ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు అనుమతి ఇవ్వాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment