ఫీ వర్రీ
ఉట్నూరు : వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ వ్యాధులతో వణికిపోతుంది. చినుకుపడితే అడవిబిడ్డలను వ్యాధులు ముసురుకుంటాయి. జ్వరాలు, మలేరియా, అతిసారం, కలరా వ్యాధులు రోజుకు ఇద్దరు, ముగ్గురిని బలితీసుకుంటాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వందల సంఖ్యలో గిరిజనులు మృత్యువాత పడతారు. వేల సంఖ్యలో మంచం పడుతా రు. ఏటా అధికారులు మాత్రం ముందస్తుగా చర్యలు తీసుకోవడం లేదు. చనిపోయినపుడే హడావుడి చేసి చేతులు దులుపుకోవడం అలవాటై పోయింది. ఈ ఏడాది కూడా వర్షాకాలం సమీపిస్తుండటంతో గిరిజనులు భయపడుతున్నారు. ఏ గడపలో రోదనలు వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నారు. ఐటీడీఏ, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు ముందస్తుగా చర్యలు తీసుకోలేదు.
గతం గుణపాఠం నేర్పుతున్నా..
2010 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జ్వరాలు, ఇతర వ్యాధులతో దాదాపు 661 మంది గిరిజనులు మృతిచెందారు. సుమారు 14,376 మంది అతిసార బారిన పడ్డారు. మరో 2,067 మందికి మలేరియా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇంతమంది చనిపోతున్నా ఏటా అధికారులు తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్నారు. శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. వ్యాధుల సీజన్ ప్రారంభమైదంటే అధికారులు ర్యాఫీడ్ ఫీవర్ సర్వేలు నిర్వహించి, ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు. అంతేగాని నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఏజెన్సీలో పారిశుధ్యం లోపించడం, క్లోరినేషన్ కానరాక పోవడం వల్ల వ్యాధులు ప్రబలుతున్నా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతోంది.
సర్కార్ వైద్యం అంతంతే..
జిల్లా వ్యాప్తంగా 8.74 లక్షల గిరిజన జనాభా ఉంది. వీరికి 31 పీహెచ్‌సీలు, 186 ఆరోగ్య ఉప కేంద్రాలు, మూడు సీహెచ్‌సీలు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తు న్నా వ్యాధులు అదుపులోకి రావడం లేదు. ఆయా కేం ద్రాల్లో 235 పోస్టులు ఖాళీగా ఉన్నా ఐటీడీఏ అధికారులు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాగా, ఉన్న వైద్యులు, సిబ్బంది కూడా 80స్థానికంగా ఉండ టం లేదు. గిరిజనుల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ప్రారంభించిన ఫిన్ పాయింట్ అశించించి ఫలితాలలు ఇవ్వడం లేదు. దీంతో గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై అంచనా వేయడంలో యంత్రాంగం విఫలం అవుతోంది.
నిధుల్లేవ్.. దోమ తెరల్లేవ్..
ప్రభుత్వం ఏటా ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ద్వారా ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.75లక్షలు, సీహెచ్‌సీకి రూ.2 లక్షలు, ప్రతి సబ్‌సెంటర్‌కు అన్‌టైడ్ ఫండ్స్ కింద రూ.10 వేల చొప్పున విడుదల చేస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇప్పటివరకు నిధుల జాడ లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 31 పీహెచ్‌సీలకు రూ.54.25 లక్షలు, మూడు సీహెచ్‌సీలకు రూ.6 లక్షలు, 186 సబ్‌సెంటర్లకు రూ.18.60 లక్షల అన్‌టైడ్ నిధులు విడుదలకావాలి. ఈ నిధులు విడుదలైతే అయా కేంద్రాల్లో అత్యవసర మందుల కొనుగోళ్లు, కేంద్రాల నిర్వహణ, సౌకర్యాల కల్పనకు అవకాశం ఉంటుంది. కానీ నిధులు విడుదల కాకకపోవడంతో ఆస్పత్రులు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
ముఖ్యంగా ఏజెన్సీలో దోమల బెడదతో ఏటా మలేరియా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దోమల బెడద నుంచి గిరిజనులను రక్షించడానికి ప్రభుత్వం ఏడేళ్లుగా దోమతెరలు పంపిణీ చేయడం లేదు. అధికారులు 1.65 లక్షల దోమ తెరలు అవసరం అని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దోమ తెరలు రాకపోవడంతో ఏజెన్సీలో దోమల బెడద పెరిగి మలేరియా పాజిటీవ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలోనైనా వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి.
ఈ చర్యలు తీసుకుంటే మేలు..
* ఏజెన్సీ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. వ్యాధుల సీజన్ కావడంతో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలి.
* పల్లెల్లో పారిశుధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మంచినీటి పథకాల్లో క్లోరినేషన్ చేయాలి.
* పెంట కుప్పలను నివాసాలకు దూరంగా వేసుకునేలా అవగాహన కల్పించాలి.
* ర్యాపీడ్ ఫీవర్ సర్వేల ద్వారా గుర్తించిన వారికి సత్వరమే వైద్యం అందించాలి.
* పల్లెల్లో నిర్వహించే 104, ఇతర వైద్య శిబిరాల్లో గిరిజనులు పాల్గొనేలా చూడాలి.
* గిరిజన గ్రామాల్లో మొబైల్ వైద్య బృందాలు విస్తృతంగా పర్యటించేలా చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఫిన్‌పాయింట్ కార్యక్రమం అమలు అయ్యేలా చూడాలి.
గిరిజన జనాభా : 8.74 లక్షలు ఆరోగ్య కేంద్రాలు : 220 ఆరేళ్లలో మృతులు : 660 అతిసార బాధితులు : 14,376 మలేరియా కేసులు : 2,067 ఆస్పత్రుల్లో ఖాళీలు : 235