నేటి నుంచి ఫీవర్‌ సర్వే | Fever survey from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఫీవర్‌ సర్వే

Published Wed, Jul 12 2023 4:27 AM | Last Updated on Wed, Jul 12 2023 7:30 AM

Fever survey from today - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల ని­యంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వేను ప్రారంభిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్‌లు రాష్ట్రంలోని 1.63 కోట్ల గృహాలను సందర్శించి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, లక్షణాలున్న వారిని ఈ సర్వే ద్వారా గుర్తించనున్నారు. ఈ సర్వే కోసం సోమవారం ఉన్నతాధికారులు జిల్లాల వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులతో వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సర్వే చేపట్టాల్సిన విధానం, మార్గదర్శకాలను వివరించారు.

కరోనా వ్యాప్తి సమయంలో వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్‌ సర్వేను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సందర్శించి, లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రారంభ దశలోనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా వ్యాధుల నియంత్రణకు సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 49 విడతలు రాష్ట్రంలో సర్వే నిర్వహించారు.

ఇదే తరహాలో ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు సర్వే చేపడుతున్నారు. డెంగీ, మలేరియా, ఇతర సీజనల్‌ వ్యాధులున్న వారిని, లక్షణాలున్నవారిని గుర్తిస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. బాధితులకు మందులు అందిస్తారు. అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పిస్తారు. సీజనల్‌ వ్యాధులను గుర్తించడానికి  ఫీవర్‌ సర్వే యాప్‌లో మార్పులు చేశామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ డాక్టర్‌ రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

గతంలో కరోనా వైరస్‌ ప్రశ్నావళి మాత్రమే ఉండేదని, ప్రస్తుతం డెంగీ, మలేరియా, విష జ్వరాల లక్షణాల ప్రశ్నావళిని అదనంగా చేర్చామని చెప్పారు. ఫీవర్‌ సర్వే నిర్వహణపై అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు మున్సిపల్, పంచాయతీ రాజ్‌ శాఖలను సమన్వయం చేసుకుంటూ వైద్య శాఖ పనిచేస్తోందని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement