చలాకీగా ఉండే ఓ 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఉన్నట్టుండి ముభావంగా మారిపోయాడు.బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు..ఎవరితోనూ పెద్దగా మాట్లాడటం లేదు.ఎవరితోనూ కలవడం లేదు. అసలు ఇల్లు వదిలి బయటికి రావడం లేదు.
డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయి..కాలేజీకి వెళ్లడం మానేసింది.. అలాగనిస్నేహితులతో షికార్లు, కబుర్లు వంటివి కూడా లేవు.. ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఓ గదిలో కూర్చుండి పోతోంది.. ఏమిటని అడిగితేబాగానే ఉన్నానంటోంది..
.. ఏమైంది ఈ ఇద్దరికి? వారు దారుణమైన ఘటనలేమీ ఎదుర్కోలేదు.. తీర్చలేని ఇబ్బందేమీఎదురుకాలేదు.. కానీ ‘హికికోమొరి’బారినపడ్డారు. అందరికీ దూరంగా ఏకాంతంగా గడిపేస్తున్నారు. అసలు ఏమిటీ ‘హికికోమొరి’? అదేమైనా మానసిక సమస్యా? దానికి కారణాలేమిటి?నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా..
జపాన్‌లో 15లక్షల మందికి..
జపాన్ ఆరోగ్య శాఖ ఇటీవల ఓ సర్వే చేసింది. దాదాపు 15 లక్షల మంది ‘హికికోమొరి’పరిస్థితిలో ఉంటున్నారని గుర్తించింది. నెలలు, సంవత్సరాలుగా వారు ఎవరితోనూ కలవడం లేదని తేల్చింది. వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని చక్కదిద్దడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. దానిపై స్పందించిన పలు స్థానిక సంస్థలు.. ‘హికికోమొరి’లతో మెటావర్స్ వేదిగా సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. దీనికి సంబంధించి భారత్ సహా పలు దేశాల ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి.
ఏమిటీ హికికోమొరి?
సామాజిక జీవనానికి దూరంగా దాదా పు ఒంటరితనంతో కూడిన జీవితాన్ని గడపడమే ‘హికికోమొరి’. 1980వ దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు, ఉపాధి దెబ్బతినడంతో.. తొలిసారిగా ఇలాంటి పరిస్థితిని గుర్తించారు. దానికి ‘హికికోమొరి (అంతర్ముఖులుగా మారిపోవడం)’అని పేరుపెట్టారు. దీనిబారిన పడినవారు తమచుట్టూ తామే గిరి గీసుకుని బతికేస్తుంటారు.
అలవాట్లను మార్చుకుంటారు. మానసిక ఆందోళన (యాంగ్జైటీ), కుంగుబాటు (డిప్రెషన్), అందరి మధ్య ఉన్నా ముభావంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరిలో అయితే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా దీనిని మానసిక సమస్యగా ప్రకటించలేదు.
దీనికి కారణాలేమిటి?
సామాజిక, విద్య, ఉద్యోగ పరమైన ఒత్తిళ్లు, కుంగుబాటు, ఆర్థికపరమైన సమస్యలతో ఆందోళన, వివిధ రకాల వేధింపులు వంటివి ‘హికికోమొరి’పరిస్థితికి దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. ‘‘ఉమ్మడి కుటుంబాలు, సామాజిక సంబంధాలు తగ్గిపోవడం, విద్య, ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ వంటివి కూడా హికికోమొరి సిండ్రోమ్‌కు దారితీస్తాయి. ఇది వారిపై వ్యక్తిగతంగా, పరోక్షంగా సమాజంపైనా వ్యతిరేక ప్రభావం చూపుతుంది’’అని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ విష్ణుప్రియ భగీరథ్ తెలిపారు.
బయటపడేందుకు డబ్బులిస్తూ..
దక్షిణకొరియాలో 19 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న మూడున్నర లక్షల మంది ‘హికికోమొరి’ సమస్యతో బాధపడుతున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ఇటీవల గుర్తించింది. ముఖ్యంగా తొమ్మిదేళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు, ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉందని తేలి్చంది. వారిని ఈ సమస్యనుంచి బయటపడేలా ప్రోత్సహించేందుకు నెలకు సుమారు రూ.40 వేలు (490 డాలర్లు) లివింగ్ అలవెన్స్‌గా ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
కుటుంబం,దగ్గరివారితో పరిష్కారం!
‘హికికోమొరి’బారినపడినవారు అందరికీ దూరంగా, ఏకాంతంగా గడపడం వల్ల మరింతగా మానసిక, శారీరక సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కోసారి ఇవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. దీని బాధితులు మందుల కంటే.. కౌన్సెలింగ్, కుటుంబ సభ్యుల సాంత్వన వంటి మార్గాల ద్వారానే త్వరగా కోలుకుంటారని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో అవసరమైతే డిప్రెషన్ వంటి కొన్ని సమస్యలకు మందులు వాడితే సరిపోతుందని అంటున్నారు. సంస్థలు, కార్యాలయాలు తమ ఉద్యోగుల్లో, విద్యా సంస్థలు తమ విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
భారత్ సహా అన్ని దేశాల్లోనూ..
అన్ని రంగాల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితులకు తోడు కరోనా మహమ్మారి దెబ్బతో ‘హికికోమొరి’పరిస్థితి పెరిగిపోయిందని నిపుణులు చెప్తున్నారు. ‘‘ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు పోవడం, ఉపాధి దెబ్బతినడం, నెలలకు నెలలు లాక్‌డౌన్, కోవిడ్ బారినపడి ఆరోగ్యం దెబ్బతినడం వంటివాటి నుంచి కోలుకోవడానికి చాలా మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు హికికోమొరి బారినపడుతున్నారు..’’అని ఢిల్లీకి చెందిన లైఫ్ కోచ్, సైకాలజిస్ట్ నిఖిలా దేశ్‌పాండే వివరించారు.
వర్క్ ఫ్రం హోం, అన్నిరకాల సరుకుల హోం డెలివరీ వంటివి దీనికి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ఒక్క జపాన్ అనే కాకుండా ప్రపంచదేశాలన్నిటా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని వెల్లడించారు. భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలా తక్కువకావడంతో.. ‘హికికోమొరి’సమస్య తలెత్తినా గుర్తించడం కష్టమని పేర్కొన్నారు.
8%
2017 నాటి ఆస్పెన్ అధ్యయనం ప్రకారం..భారతదేశంలో ఒంటరితనంతో బాధపడుతున్న యువత
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment