Henley Passport Index 2023 Report Says Japan Retain Top-Position - Sakshi
Sakshi News home page

Passport: ఆ పాస్‌పోర్టుకు పవరెక్కువ

Published Sat, Jan 14 2023 1:49 AM | Last Updated on Sat, Jan 14 2023 8:42 AM

Henley Passport Index 2023 Reports Says Japan Retained Top-Position - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: మన దేశం నుంచి మరోదేశం వెళ్లాలంటే.. పాస్‌పోర్టు.. వీసా.. ఈ రెండు తప్పనిసరి అని అందరికీ తెలుసు.. వీసా లేకుండా మరో దేశానికి వెళ్లే అవకాశం లేదు. కానీ కొన్ని దేశాలు తమ విమానాశ్రయాల్లో దిగిన తర్వాత వీసా (అరైవల్‌ ఆన్‌ వీసా) మంజూరు చేస్తుంటాయి. ఇంకొన్ని సన్నిహిత, శ్రేయోభిలాష దేశాలు..  వీసా లేకపోయినా పరస్పరం తమ దేశాల ప్రజలు వచ్చిపోవడానికి అనుమతినిస్తుంటాయి. వీసాల సంగతి ఇలావుంటే.. పాస్‌పోర్టుల్లో అత్యంత శక్తివంతమైన (వెరీ పవర్‌ఫుల్‌), శక్తివంతమైన, బలహీనమైన (వీక్‌) పాస్‌పోర్టులు ఉండటం కొంత ఆసక్తిరేకెత్తించే అంశం.

గడిచిన 20 సంవత్సరాలుగా శక్తివంతమైన పాస్‌పోర్టు అందించే దేశాల జాబితాను లండన్‌కు చెందిన అంతర్జాతీయ పౌరసత్వ, నివాస సలహా సంస్థ హెన్లీ అండ్‌ పార్ట్ట్‌నర్స్‌ ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే తాజా జాబితా ప్రకటించింది. ప్రపంచ దేశాల్లో జపాన్‌ పాస్‌పోర్టును అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా తేల్చింది. ఈ మేరకు శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో జపాన్‌ ప్రథమ స్థానంలో ఉండగా, సింగపూర్, దక్షిణ కొరియాలు రెండూ రెండో స్థానంలో, జర్మనీ, స్పెయిన్‌లు మూడో స్థానంలో ఉన్నాయి. ఇక అగ్రరాజ్యాలుగా పరిగణింపబడే అమెరికా, బ్రిటన్, చైనా లాంటి దేశాలు కొన్ని ఆ తర్వాతి స్థానాల్లోనే ఉండటం గమనార్హం. కాగా మనదేశం 59 దేశాలతో 85వ స్థానంలో నిలిచింది.

మొత్తం 199 దేశాలు పాస్‌పోర్టు­లు జారీ చేస్తున్నాయి. అయితే ఒక దేశ పాస్‌పోర్టుతో గరిష్టంగా ఎన్ని దేశా­లకు వీసా లేకుండా వెళ్లొచ్చు లేదా వీసా ఆన్‌ అరైవల్‌ పద్ధతిలో వెళ్లొచ్చనే దానిపై ఆ పాస్ట్‌పోర్టు బలం అంటే అది ఎంత శక్తివంతమైన పాస్ట్‌పోర్టు అనేది ఆధా­ర­పడి ఉంటుంది. అంటే ఎన్ని ఎక్కువ దేశాలకు ఇలా వెళ్లేందుకు అవకాశం ఉంటే ఆ పాస్ట్‌పోర్టు అంత శక్తివంతమైందన్న మాట. ఇందుకు సంబంధించి ఇంటర్నేషనల్‌ ఎయి­ర్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ (ఐఏటీఏ) డేటా ఆధారంగా హెన్లీ సంస్థ పాస్‌పో­ర్టులకు ర్యాంకులు ప్రకటిస్తుంది.

ఈసారి మొదటి స్థానంలో నిలిచిన జపాన్‌ పాస్‌పోర్టుతో గరిష్ట స్థాయిలో 193 దేశాలకు/గమ్యస్థానాలకు వీసా లేకుం­డా లేదా వీసా ఆన్‌ అరైవల్‌ పద్ధతిలో సందర్శించేందుకు అవకాశం ఉంది. సింగపూర్, దక్షిణ కొరియా (రెండో స్థానంలో) పాస్‌పోర్టులతో 192 దేశాలు, జర్మనీ, స్పెయిన్‌ (మూడో స్థానంలో) పాస్‌పోర్టులతో 190 దేశాలను పై పద్ధతిలో సందర్శించే వీలుంది. ఇక ఫిన్లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్‌ నాల్గవ స్థానంలో (189) ఉండగా, ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడెన్‌ (188 దేశాలు),  ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, యూకే (187), బెల్జియం, చెక్‌ రిపబ్లిక్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యూఎస్‌­ఏ (186), ఆస్ట్రేలియా, కెనడా, గ్రీస్, మాల్టా (185), పోలండ్, హంగేరి (184), లుథ్వే­నియా, స్లోవే­కి­­యా (183) వరసగా తొలి 10 స్థా­నాల్లో ఉన్నా­యి. 2014­లో అమెరి­కా, బ్రిటన్‌ దేశాలు మొదటి, రెండు స్థానాల్లో ఉన్నా­యి. కాగా అప్పటి నుంచి ఇప్పటి­వరకు దా­దాç­³# ఎనిమి­దేళ్లుగా ఈ రెండు దేశాలు మళ్లీ ఆ స్థానాలకు చేరుకో­క­­పో­వడం గమనార్హం. కాగా 85వ ర్యాంకులో ఉన్న మన పాస్‌పో­ర్టుతో 59 దేశాలకు ఆ విధంగా వెళ్లొచ్చు.

జీడీపీ తెలుస్తుంది..
జపాన్‌ పాస్‌పోర్టుతో ప్రపంచంలోని 85 శాతం దేశాలకు ఫ్రీ వీసా యాక్సెస్‌ ఉంది. ఈ 85 శాతం దేశాలు ప్రపంచం జీడీపీలో 98 శాతం ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. అదే నైజీరియా పాస్‌పోర్టుతో 46 గమ్యస్థానాలకు (20%) వీసా ఫ్రీ యాక్సెస్‌ ఉంటే.. వాటి ఆర్థిక సామర్థ్యం ప్రపంచ జీడీపీలో 1.5 శాతమే కావడం గమనార్హం. ప్రపంచంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా (25 శాతం), చైనా (19 శాతం)ల వాటా ప్రపంచ జీడీపీలో 44 శాతంగా ఉంది.  

పెట్టుబడిదారుకు ఉపయుక్తం..
ఈ విధమైన పాస్‌పోర్టు సమాచారం అంతర్జాతీయ వ్యాపారులకు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు ఉపయోగపడుతుంది. ఈ ర్యాంకుల ఆధారంగా ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులు, ఇతర పరిస్థితులు తెలుసుకునేందుకు అవకాశం ఉంది. పాస్‌పోర్టు బలానికి, ఆర్థిక శక్తి మధ్య లంకె ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. 

దిగువన అఫ్గానిస్తాన్‌..
అఫ్గానిస్తాన్‌ జారీ చేసే పాస్‌పోర్టుతో కేవలం 27 దేశాలు లేదా గమ్యస్థానాలకు మాత్రమే వీసా రహితంగా లేదా అరైవల్‌ ఆన్‌ వీసా పద్ధతిలో వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ విధంగా ఇది పాస్‌పోర్టులు జారీ చేసే 199 దేశాల్లో అట్టడుగు స్థానాన్ని ఆక్రమించింది. అఫ్గాన్‌తో పోల్చుకుంటే ఇరాక్‌ (29), సిరియా (30), పాకిస్తాన్‌ (33) కాస్త మెరుగ్గా ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement