సాక్షి, హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే చేపట్టినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో వరద ప్రాంతాలను నాలుగు భౌగోళిక ప్రాంతాలుగా విభజించామన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇక్కడ చేపడుతున్న కార్యకలాపాలను సమీక్షించారని తెలిపారు. ‘‘పారిశుధ్య కార్యకలాపాలను వేగవంతం చేయాలని, దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించాం. మందులు తగినంత నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. సీజనల్ వ్యాధుల నివారణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాం. యాంటీ లార్వా ఆపరేషన్లు, డెంగీ, మలేరియాను గుర్తించడానికి ఏర్పాట్లు చేశాం.
297 హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు నిర్వహించేందుకు 670 మంది అదనపు ఆరోగ్య సిబ్బందిని వరద ప్రభావిత ప్రాంతాలకు పంపాం. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. సహాయక శిబిరాల వద్ద ఆరోగ్య శిబిరాలతో పాటు, గ్రామస్థాయి ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తాం. అన్ని ఇళ్లకు క్లోరిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నాం.
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 24 గంటలు పనిచేసేలా వార్ రూంలను ఏర్పాటు చేశాం. వరద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 64,230 మందికి వివిధ రకాల వైద్య చికిత్సలు చేశాం. అందులో మంగళవారం ఒక్క రోజే 18,558 మందికి వైద్య సాయం అందజేశాం’’ అని శ్రీనివాసరావు ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment