ప్రచారం అంతంతే.. | swine flu disease increase in vizag | Sakshi
Sakshi News home page

ప్రచారం అంతంతే..

Published Fri, Jan 30 2015 12:28 AM | Last Updated on Tue, Aug 21 2018 12:23 PM

ప్రచారం అంతంతే.. - Sakshi

ప్రచారం అంతంతే..

స్వైన్‌ఫ్లూపై కొరవడిన స్పందన
కేసు నమోదుతో కదిలిన యంత్రాంగం
విస్త్రృత ప్రచారానికి తాజాగా సన్నద్ధం

 
విశాఖ మెడికల్ : జిల్లాలో స్వైన్‌ఫ్లూపై ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. వారం రోజులుగా జిల్లాలో అనుమానిత కేసు లు నమోదవుతున్నా జిల్లా యం త్రాంగం కేవలం మీడియా ప్రచారానికే పరిమితమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జీవీఎంసీ ఆరోగ్య విభాగాలు ఇటీవల వ్యాధి అవగాహన ప్రచార పోస్టర్, కరపత్రాన్ని ముద్రించి మంత్రి గంటా చేతుల మీదుగా విడుదల చేసి తమ పనైందనిపించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు నగర పరి ధిలో పరిశీలించినా స్వైన్‌ఫ్లూ ప్రచారం తూతూ మంత్రంగా సాగుతోందని చె ప్పవచ్చు.


ఈ లోగా నాలుగేళ్ల బాలుడికి స్వైన్‌ఫ్లూ వ్యాధి  నిర్థారణ కావడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంత్రులు కూడా ఈ వ్యాధి నివారణకు ముందస్తు చర్యలపై గురువారం సమీక్ష నిర్వహించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జీవీఎంసీ వైద్యాధికారుల ప్రచార తీరును తప్పుపట్టారు. నిధులు లేకపోతే సమకూరుస్తాం. కానీ స్వైన్‌ఫ్లూ ప్రచారం మాత్రం అన్ని వర్గాల ప్రజలకు చేరేలా ఆదేశించడంతో వైద్య వర్గాలు మంత్రుల మందలింపుతో మేల్కొన్నాయి.


జిల్లా వ్యాపితంగా ప్రధాన కూడళ్ల వద్ద హోర్డింగ్, ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు సినిమా హాల్స్, లోకల్ టీవీ ఛానల్స్‌లో విస్రృత ప్రచారం గావించడానికి సన్నద్ధమయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి సంయుక్తంగా మాస్ మీడియా ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించేందుకు గురువారం ఉదయం నుంచే నిమగ్నమయ్యారు. పీహెచ్‌సీ పరిధిలోనూ, నగరంలోని అన్ని వార్డుల పరిధిలోని మురికివాడల సైతం స్వైన్‌ఫ్లూ ప్రచార సామగ్రిని ఇంటింటికి పంపిణీ చేసి వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికారి డాక్టర్ జె.సరోజిని, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, నగర పరిధిలోని అన్ని డిస్పెన్సరీల్లో మందులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్టు వారు చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జీవీఎంసీ పరిధిలోని అన్ని స్కూల్స్ విద్యార్థులకు హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.


కాగా గాల్లో తేమ ఎక్కువగా ఉన్న విశాఖ నగరంలో స్వైన్‌ఫ్లూ వైరస్ మరింత శక్తిని పుంజుకుంటోంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రాంతాలకు వైరస్ భయం ఎక్కువగా ఉంటుందని కేజీహెచ్ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ పి వేణుగోపాల్ చెప్పారు. పొడి వాతావరణమైన హైదరాబాద్ కంటే ఈ వ్యాధి తీవ్రత విశాఖలోనే ఎక్కువగా ఉంటుంది. అదృష్టవశాత్తూ రథసప్త మి తర్వాత ఎండలు పెరుగుతుండడంతో వారం పది రో జుల్లోనే స్వైన్‌ఫ్లూ వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

వ్యాధి లక్షణాలు..

మూడు రోజులకు మించిన జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు. వీటితో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం.

వ్యాధి సోకకుండా చేపట్టాల్సిన చర్యలు..


చేతులు తరచూ శుభ్రపరచుకోవాలి  దగ్గినా.. తుమ్మినా నోటికి, ముక్కుకి చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి
జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో(పుణ్యక్షేత్రాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్)సంచరించకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల  కళ్లు, ముక్కు, నోటిని తాకడానికి ముందు చేతులు శుభ్రంగా సబ్బు, లోషన్‌తో శుభ్రం చేసుకోవాలి
కరచాలనం, ఆలింగనం చేసుకోరాదు

వ్యాధి సోకితే..తీసుకోవల్సిన జాగ్రత్తలు..

వ్యాధిగ్రస్తుడు ఎక్కువగా ద్రవపదార్థాలు, పోషకాహారాలు తీసుకోవాలి
రోగులు వాడిన వస్తువుల్ని ఇతరులు తాకరాదు
రోగులు వాడిన వస్తువులు ఎక్కడబడితే అక్కడ పడేయరాదు
వ్యాధిగ్రస్తుడు ఎక్కడిబడితే అక్కడ ఉమ్మి వేయరాదు
నిపుణుల పర్యవేక్షణలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందడం మేలు

వీరిలో వ్యాధి సోకే అవకాశం అధికం..

ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, 65ఏళ్లు పైబడిన వృద్ధులు
{బాంకైటీస్, రక్తపోటు, డయాబెటీస్, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ వ్యాధులు, అధిక బరువు ఉన్నవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది
 
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి

ప్రభుత్వ ఛాతి ఆస్పత్రి, పిల్లలు గర్భిణీలకు చికిత్స అందించే కేజీహెచ్‌లోని ఐసోలేషన్ వార్డుల్లో పూర్తి స్థాయిలో వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూర్చాలి. స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స చేసే సమయంలో సదుపాయాలు లేని కారణంగా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అవసరమైన మందులు వైద్య పరికరాలు కల్పించాలి.చికిత్స చేసే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బందికి వ్యాధి సోకకుండా రక్షణ పరికరాలు సమకూర్చడంతో పాటు కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్‌లో స్వైన్‌ఫ్లూ నిర్థారణ వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలి.

  -డాక్టర్ పి.శ్యామ్‌సుందర్,
 ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
 
 జిల్లాలో స్వైన్‌ఫ్లూ తనిఖీ కేంద్రాలివే..
 
ప్రభుత్వ ఛాతి ఆస్పత్రి, కింగ్ జార్జ్ ఆస్పత్రి, పోర్టు గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రి, పోర్టు ఏరియా ఆస్పత్రి (సాలిగ్రామపురం), స్టీల్‌ప్లాంట్ ఆస్పత్రి, నేవీ ఆస్పత్రి, రైల్వే ఆస్పత్రి, ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి(అనకాపల్లి), ఏరియా ఆస్పత్రి(నర్సీపట్నం), పాడేరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, అరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement