కోవిడ్ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. నగర వైద్య చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆస్పుత్రుల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ వినతి మేరకు సిటీ ఆసుపత్రులు రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేశాయి. నగరానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్తకు అందించిన సమాచారంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స ఛార్జీలపై 2020 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత రేట్లను జారీ చేసింది చికిత్స పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు/లేబొరేటరీలు వసూలు చేసే బిల్లులపై పరిమితిని విధించింది. అయితే వాటిని ప్రైవేటు ఆసుపత్రులు ఉల్లంఘించాయి.
దారి చూపిన హెల్ప్‌లైన్
రొటీన్ వార్డు అండ్ ఐసోలేషన్‌లో చేరేందుకు రోజుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.7,500, వెంటిలేటర్‌తో ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించింది. అయితే ఆసుపత్రులు మాత్రం రకరకాల పేర్లు పెట్టి అధిక ఛార్జీలు వేసి బిల్లులు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని రోగుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలొచ్చాయి. గత సంవత్సరం, కోవిడ్–19 రోగులను పదే పదే ఉల్లంఘించినందుకు కనీసం 30 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సల నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఒక హెల్ప్‌లైను ఏర్పాటు చేసి, ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని భావిస్తే ఫిర్యాదు చేయాలని కోరింది.
వెల్లువెత్తిన ఫిర్యాదులు..
కరోనా చికిత్స కోసం ఆసుపత్రులు వివిధ అదనపు బిల్లులను వసూలు చేస్తున్నాయని రోగులు, బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత నెల ఆఖరు వరకు ప్రభుత్వం నిర్ణయించిన చికిత్స ఛార్జీలను ధిక్కరించినందుకు 268 ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 87 ఫిర్యాదులకు రీఫండ్‌లు అందించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసిన బిల్లులను వాపసు చేసే విషయంపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని 87 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రూ. 1.61 కోట్లకు పైగా సొమ్మును రోగులకు వెనక్కి ఇచ్చారు.
అత్యధిక రిఫండ్ ఓమ్ని ఆసుపత్రిదే...
కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆసుపత్రి అత్యధికంగా రూ.27,41,948 రీఫండ్ చెల్లించింది. ఉప్పల్‌లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10,85,000, కొండాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ రూ.10,82,205 రీఫండ్ చేశాయి. బంజారాహిల్స్‌లోని సెంచురీ హాస్పిటల్స్ (రూ.10 లక్షలు), ఎల్‌బీ నగర్‌లోని అంకురా హాస్పిటల్ (రూ.6.1 లక్షలు), ఎల్‌బి నగర్‌లోని దియా హాస్పిటల్ (రూ. 6 లక్షలు), హైదరాబాద్ నర్సింగ్ హోమ్ (రూ.5 లక్షలు), సెక్రటేరియట్‌లోని మెడికవర్ హాస్పిటల్ (రూ.5.7 లక్షలు), కూకట్‌పల్లిలోని ప్రతిమ హాస్పిటల్ (రూ.8.2 లక్షలు) గచ్చిబౌలిలోని సన్‌షైన్ హాస్పిటల్ (రూ.5 లక్షలు) రోగులకు రీఫండ్ చేసిన ఆసుపత్రుల్లో ఉన్నాయి.
(చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!)
Comments
Please login to add a commentAdd a comment