సాక్షి, హైదరాబాద్: పాఠశాలకు వెళ్లే చిన్న వయసు విద్యార్థులు పొగాకు వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 13 నుంచి 15 ఏళ్ల విద్యార్థులు కూడా పొగాకు ఉత్పత్తులు వాడటం, బీడీ, సిగరెట్లు తాగడంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే ఈ వయసు వారు తెలంగాణలో 5.2 శాతం మంది పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారని తేలింది. 13 నుంచి 15 ఏళ్ల వయసు పాఠశాల విద్యార్థులు ఎంత స్థాయిలో పొగాకు వినియోగిస్తున్నారనే దానిపై గ్లోబల్ యూత్ టొబాకో సర్వే (జీవైటీఎస్) జరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే వివరాలను కేంద్రం తాజాగా ప్రకటించింది. మనదేశంలో 2003, 2006, 2009, 2019లో నాలుగు రౌండ్లలో ఈ సర్వే జరిగింది.
పొగాకు వినియోగం, మానేయడం, పడేసిన సిగరెట్ పీకలు తాగడం, మీడియా సందేశాలు, ప్రకటనలు, పొగాకు ఉత్పత్తుల లభ్యత, పొగాకు వినియోగానికి సంబంధించిన పరిజ్ఞానం వంటి అంశాలపై 2019లో సర్వే జరిగింది. దేశవ్యాప్తంగా 987 పాఠశాలల (544 ప్రభుత్వ, 443 ప్రైవేటు)కు చెందిన 97,302 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. అయితే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే జరిగినా రాష్ట్రాల వారీగా అన్ని వివరాలను ప్రకటించలేదు. ఆయా రాష్ట్రాల్లో ఎంత శాతం మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్న సమాచారాన్నే కేంద్రం వెల్లడించింది.
సర్వేలోని ముఖ్యాంశాలు..
►13 నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పొగాకు ఉత్పత్తులను వినియోగించడంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ 20వ స్థానంలో ఉంది.
►అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో అత్యధికంగా 57.9 శాతం చొప్పున పొగాకు ఉత్పత్తులను ఆ వయసు విద్యార్థులు వినియోగిస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యల్పంగా 1.1 శాతం మంది వినియోగిస్తున్నారు.
►దేశవ్యాప్తంగా 9.6 శాతం బాలురు, 7.4 శాతం బాలికలు పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు.
►పట్టణాల్లో 5.5 శాతం మంది, పల్లెల్లో 9.4 శాతం మంది పొగాకు వినియోగిస్తున్నారు.
►7.3 శాతం విద్యార్థులు పొగాకు వినియోగిస్తుండగా, అందులో 8.3 శాతం అబ్బాయిలు, 6.2 శాతం అమ్మాయిలు ఉన్నారు.
►2003లో సిగరెట్ తాగేవారు 4.2 శాతం ఉండగా, 2006లో 3.8 శాతం, 2009లో 4.4 శాతం, 2019లో 2.6 శాతం ఉన్నారు.
►2019లో బీడీ తాగేవారు 2.1 శాతం ఉన్నారు. 2009లో 5.3 శాతం ఉన్నారు.
►ఈ–సిగరెట్ తాగేవారు 2.8 శాతం మంది ఉన్నారు.
►వయసు కారణంగా 54.7 శాతం మంది సిగరెట్ కొనుగోలు చేసేందుకు ఇబ్బందిపడ్డారు.
►పొగతాగే వారిలో 25 శాతం మంది అబ్బాయిలు, 13 శాతం మంది బాలికలు పొగ మానేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే 21 శాతం మంది మానేయాలని భావిస్తున్నారు.
►పొగ తాగే పాఠశాల విద్యార్థుల్లో 78 శాతం మంది దుకాణం, పాన్‌షాప్, వీధి విక్రయ కేం ద్రాల నుంచి సిగరెట్లు లేదా బీడీలు కొనుగోలు చేశారు.
►71 శాతం మంది విద్యార్థులు సిగరెట్ తాగడం తమకు హానికరమని భావించారు.
ఆరోగ్యంపై పెను ప్రభావం
ఆ వయసు విద్యార్థులు పొగాకు వినియోగిస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రత్యక్షంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడి, చాలా జబ్బులకు కారణమవుతుంది. దేశంలో 40 శాతం టీబీ కేసులకు పొగ తాగడమే ప్రధాన కారణం. నోటి, ఊపిరితిత్తుల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment