సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొందరు వైద్యులు అనేక ఏళ్లుగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారు. వీరందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల అధిపతులకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.రవిచంద్ర ఆదేశాలు జారీ చేశారు. వారి జాబితా తక్షణమే పంపించాలని స్పష్టం చేశారు. డిప్యుటేషన్‌పై ఇతర విభాగాల్లో ఉంటూ.. గడువు ముగిసినా ఇంకా అక్కడే కొనసాగుతున్న వారిని కూడా సొంత శాఖకు పిలిపించాలని ఆదేశించారు. ఎలాంటి సమాచారం లేకుండా అనధికారికంగా సెలవుపై ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
బదిలీ జరిగినా కదలడం లేదు..
కొంతమంది వైద్యులు, స్టాఫ్ నర్సులు డిప్యుటేషన్ రద్దయినా.. కదలకుండా అక్కడే కొనసాగుతూ వేతనాలు తీసుకుంటున్నారు. పదోన్నతులు పొంది బదిలీ అయినా.. వెళ్లడం లేదు. తాజాగా ఆరుగురు ప్రొఫెసర్లకు అదనపు సంచాలకులుగా పదోన్నతి ఇచ్చారు. ఇందులో ఒక్కరు మాత్రమే(విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రిలో) విధుల్లో చేరారు. మిగతా ఐదుగురు విధుల్లో చేరకుండా పాత చోటే ఉన్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎవరు ఎక్కడ వేతనం తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వారందరిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే.. హెచ్‌వోడీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment