కార్పొరేట్‌ రేంజ్‌లో నిమ్స్‌ | Telangana: 200 More ICU Beds To Be Set Up At NIMS Says Harish Rao In Hyderabad | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ రేంజ్‌లో నిమ్స్‌

Published Wed, Dec 8 2021 4:22 AM | Last Updated on Wed, Dec 8 2021 4:22 AM

Telangana: 200 More ICU Beds To Be Set Up At NIMS Says Harish Rao In Hyderabad - Sakshi

నిమ్స్‌లో రోగితో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌) : నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలను అందించేందుకు నిమ్స్‌ ఆస్పత్రిలో మరిన్ని మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రూ.154 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నట్టు వెల్లడించారు. రూ. 18 కోట్ల విలువైన రోబోటిక్‌ సర్జరీ వైద్య పరికరాన్ని సమకూర్చాల్సిందిగా ఆంకాలజీ విభాగం వైద్యులు కోరారని, ఆ దిశగా చర్యలు చేపట్టనున్నామని చెప్పారు.

హై రిస్క్‌ గర్భిణుల కోసం ప్రత్యేక గైనిక్‌ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు 200 పడకలతో వార్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో మరో 200 ఐసీయూ పడకలు, 120 వెంటిలేటర్లను సమకూరుస్తామన్నారు. దీంతో ఐసీయూ పడకలు 355కు, వెంటిలేటర్లు 209కు చేరుకుంటాయని చెప్పారు. మంగళవారం నిమ్స్‌లో రూ. 12 కోట్లతో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల అధునిక వైద్య పరికరాలు, సరికొత్త పరీక్ష కేంద్రాలను ఆయన ప్రారంభించారు. నిమ్స్‌ ఆస్పత్రిపై ఆయా విభాగాధిపతులతో సమీక్ష చేశారు. 

నగరంలో మరో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు 
నిమ్స్‌లో ఇప్పటికే 85 శాతం మేర రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని, 15 శాతం మేరకే పేయింగ్‌ రోగులు చికిత్స పొందుతున్నారని మంత్రి చెప్పారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు తీసిపోని విధంగా అవయువ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ఒకేసారి 8 మందికి బోన్‌ మ్యారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ శస్త్ర చికిత్స చేసే సామర్థ్యం నిమ్స్‌ సొంతం చేసుకుందని అన్నారు. బోన్‌ లోపాలు ముందే తెలుసుకునేందుకు బోన్‌ డెన్సిటోమీటర్, జన్యు లోపాలపై సరైన వైద్యం పొందేందుకు జెనెటిక్‌ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారందరికి ఆరోగ్య శ్రీ భోజనాన్ని వడ్డించాలని నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె. మనోహర్‌ను ఆదేశించారు. రోగుల సహాయకులకూ రూ. 5 భోజనం అందుబాటులోకి తేవాలన్నారు. నగరంలో మరో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, టిమ్స్‌ పేరుతో వాటిని నిర్వహిస్తామని తెలిపారు.  

100% వ్యాక్సినేషన్‌పై సెలెబ్రిటీలు ప్రచారం చేయాలి 
రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ను సాధించేందుకు సినిమా, క్రీడా, రాజకీయ మ్రుఖులు ప్రచారం చేయాలని మంత్రి కోరారు. ఒమిక్రాన్‌ నేపథ్యంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రోజూ 30 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని, వాటిని లక్షకు పెంచనున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతానికి 94 శాతం మంది మొదటి డోస్, 48 శాతం రెండో డోస్‌ తీసుకున్నారని చెప్పారు.

ఈ నెలాఖరు నాటికి 70 లక్షల మందికి పైగా రెండో డోస్‌ తీసుకోవాల్సి ఉందన్నారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ప్రతి బెడ్‌కూ ఆక్సిజన్‌ సదుపాయం కల్పిస్తామని, ఇప్పటికే 25 వేల బెడ్స్‌కు ఆక్సిజన్‌ సదుపాయం ఉందని చెప్పారు. మరో 2 వేల బెడ్స్‌కు వారంలో ఈ సదుపాయం కల్పించనున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement