సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టెస్టులు చేయించుకున్న ప్రతి వంద మందిలో తొమ్మిది మందికి పాజిటివ్‌గా వస్తోంది. వైద్యారోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు 8.94 శాతంగా ఉంది. కొత్తగా 6,551 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 4,01,783కు చేరింది. ఇందులో 3,34,144 మంది కోలుకున్నారు. ఇక ఆదివారం ఒక్కరోజే కరోనాతో ఏకంగా 43 మంది మృతిచెందారు. ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,042కు చేరింది.
సెలవుదినం కావడంతో తగ్గిన పరీక్షలు...
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 73,275 కోవిడ్ పరీక్షలు చేశారు. సెలవురోజు కావడంతో సంఖ్య తగ్గింది. ప్రభుత్వ కేంద్రాల్లో 58,626, ప్రైవేటులో 14,649 పరీక్షలు చేశారు. జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల రేటు 1.1 శాతం ఉండగా.. రాష్ట్రంలో 0.5 శాతం ఉంది. రికవరీ రేటు జాతీయ స్థాయిలో 82.6 శాతం ఉండగా.. రాష్ట్రంలో 83.1 శాతం ఉంది. కోవిడ్ బాధితుల్లో 79.9 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో 282 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment