ఉప ముఖ్యమంత్రి రాజయ్య పై సీఎం కేసీఆర్ ఆగ్రహం
తాటికొండకు తలనొప్పి!
వైద్యశాఖ నిర్ణయాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
అక్రమాల ఆరోపణలతో రాజయ్యకు సంకటం
హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ పోస్టింగ్‌పైనా ఇదే పరిస్థితి
వరంగల్ : వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయాల్లో అక్రమాల ఆరోపణలు ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి. వైద్య, ఆరోగ్య శాఖలో తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ శాఖను పర్యవేక్షిస్తున్న రాజయ్యకు తలనొప్పిగా మారింది. పారదర్శకమైన పాలన విషయంలో పదేపదే సీఎం ప్రకటనలకు.. వైద్య, ఆరోగ్య శాఖలో ఇటీవల తీసుకున్న విధాన నిర్ణయాలకు పొంతనలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పోస్టుల భ ర్తీ, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపికలో అవినీతి ఆరోపణలతో వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిష్ట దెబ్బతిన్నది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నియామకంపైనా ఇదే పరిస్థితి నెలకొంది. మిగతా ఏ శాఖలో లేని విధంగా డిప్యూటీ సీఎం రాజయ్య నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖలోనే ఇలాంటివి జరగడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు ఇబ్బందులు తెచ్చే పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జాతీయ బాలల సంరక్షణ పథకం నిర్వహణ కోసం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో చేపట్టిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక వ్యవహారంపై భారీగా ఆరోపణలు వచ్చాయి. పోస్టుల భర్తీలో నిబంధనలు ఉల్లంఘించడంపై వైద్య సంఘాలు, పారామెడికల్ సంఘాలు, నర్సింగ్ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ విమర్శలను పట్టించుకోకుండా వైద్య, ఆరోగ్య శాఖ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విషయం ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లింది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆరోపణలు, విమర్శలు లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ శాఖ మంత్రిగా రాజయ్య ఈ అంశాలను పట్టించుకోకపోవడంపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కాళోజీ హెల్త్ వర్సిటీపైనా..
ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, జిల్లా ప్రజాప్రతినిధులు పట్టుబట్టి జిల్లాలో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటయ్యేలా కృషి చేశారు. మొదట్లో ఈ విషయంలో ప్రతికూలంగా ఉన్నా ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి ఈ వర్సిటీ జిల్లాకు వచ్చేలా చేయగలిగారు. రాష్ట్రంలోని ఏకైక ఆరోగ్య విశ్వవిద్యాలయంగా దీనికి ప్రత్యేకత ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆరోగ్య విశ్వవిద్యాలయం కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో భాగంగా జనవరి 13న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా డాక్టర్ బి.రాజును నియమిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఐఏఎస్ అధికారిని రిజిస్ట్రార్‌గా నియమించాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. పరిపాలన అనుభవం పెద్దగా లేని ప్రొఫెసర్‌ను ఈ పోస్టులో నియమించడంతో రాజయ్య తీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రిజిస్ట్రార్‌గా రాజు నియామకాన్ని నిలిపివేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాజు నియామకాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తుండడం ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు ఇబ్బందులను తెస్తోంది.