Deputy Chief THATIKONDA RAJAIAH
-
ఉప ముఖ్యమంత్రి రాజయ్య పై సీఎం కేసీఆర్ ఆగ్రహం
తాటికొండకు తలనొప్పి! వైద్యశాఖ నిర్ణయాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం అక్రమాల ఆరోపణలతో రాజయ్యకు సంకటం హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ పోస్టింగ్పైనా ఇదే పరిస్థితి వరంగల్ : వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయాల్లో అక్రమాల ఆరోపణలు ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి. వైద్య, ఆరోగ్య శాఖలో తాత్కాలిక, ఔట్సోర్సింగ్ నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ శాఖను పర్యవేక్షిస్తున్న రాజయ్యకు తలనొప్పిగా మారింది. పారదర్శకమైన పాలన విషయంలో పదేపదే సీఎం ప్రకటనలకు.. వైద్య, ఆరోగ్య శాఖలో ఇటీవల తీసుకున్న విధాన నిర్ణయాలకు పొంతనలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పోస్టుల భ ర్తీ, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎంపికలో అవినీతి ఆరోపణలతో వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిష్ట దెబ్బతిన్నది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నియామకంపైనా ఇదే పరిస్థితి నెలకొంది. మిగతా ఏ శాఖలో లేని విధంగా డిప్యూటీ సీఎం రాజయ్య నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖలోనే ఇలాంటివి జరగడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు ఇబ్బందులు తెచ్చే పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాతీయ బాలల సంరక్షణ పథకం నిర్వహణ కోసం ఔట్సోర్సింగ్ పద్ధతిలో చేపట్టిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక వ్యవహారంపై భారీగా ఆరోపణలు వచ్చాయి. పోస్టుల భర్తీలో నిబంధనలు ఉల్లంఘించడంపై వైద్య సంఘాలు, పారామెడికల్ సంఘాలు, నర్సింగ్ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ విమర్శలను పట్టించుకోకుండా వైద్య, ఆరోగ్య శాఖ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విషయం ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లింది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆరోపణలు, విమర్శలు లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ శాఖ మంత్రిగా రాజయ్య ఈ అంశాలను పట్టించుకోకపోవడంపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాళోజీ హెల్త్ వర్సిటీపైనా.. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, జిల్లా ప్రజాప్రతినిధులు పట్టుబట్టి జిల్లాలో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటయ్యేలా కృషి చేశారు. మొదట్లో ఈ విషయంలో ప్రతికూలంగా ఉన్నా ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి ఈ వర్సిటీ జిల్లాకు వచ్చేలా చేయగలిగారు. రాష్ట్రంలోని ఏకైక ఆరోగ్య విశ్వవిద్యాలయంగా దీనికి ప్రత్యేకత ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆరోగ్య విశ్వవిద్యాలయం కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో భాగంగా జనవరి 13న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా డాక్టర్ బి.రాజును నియమిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఐఏఎస్ అధికారిని రిజిస్ట్రార్‌గా నియమించాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. పరిపాలన అనుభవం పెద్దగా లేని ప్రొఫెసర్‌ను ఈ పోస్టులో నియమించడంతో రాజయ్య తీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రిజిస్ట్రార్‌గా రాజు నియామకాన్ని నిలిపివేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాజు నియామకాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తుండడం ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు ఇబ్బందులను తెస్తోంది. -
ప్రతిదీ రాజకీయకోణంలో చూడొద్దు
సూర్యాపేటరూరల్ : ప్రతిదీ రాజకీయకోణంలో చూడొద్దని, ఉద్యమంలో జెతైలంగాణ అన్న ప్రతి బిడ్డ, ఉద్యమకారుడు, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేలా ఉండాలని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యంలోని సూర్యాపేట మండలం రాయినిగూడెం వద్ద గల సెవెన్ ఆర్ హోటల్లో కాసేపు ఆగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయాలనే ఆలోచనలో కేసీఆర్ నాయకత్వంలో బడ్జెట్‌ను రూపొందించి సభలో ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. ఎస్సీ వర్గీకణ బిల్లునూ ఆమోదించామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కేవలం హైదరాబాద్ నగరం పరిధిలో ఉన్న ఆస్పత్రులకే బేసిడ్ బడ్జెట్ రూ.582 కోట్లు, ఏరియా ఆస్పత్రి ఒక్కంటికి కోటి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆప్గ్రేడ్కు రూ.30 కోట్లు కేటాయిం చినట్లు వివరించారు. జిల్లా కేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపర్చేందుకు జిల్లాకు రూ.పది కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్ర తి తెలంగాణ బిడ్డ, ఉద్యమకారుడు, అభిమానులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల న్నారు. ఉషామోహ్రా కమిటీ కేంద్రం ఆధీనంలో ఉన్నప్పటికీ, రాజ్యాంగంలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కమల్‌నాథ్ కమిటీ సిఫారసుల మేరకు వైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఆయనకు టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, వై.వెంకటేశ్వర్లు, చినశ్రీరాములు, ఎర్రవీరస్వామిమాదిగ, తూడి నర్సింహారావుతోపాటు వైద్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్ అబద్ధాలకోరు
- హెల్త్ వర్సిటీ తేకుంటే జిల్లాలో తిరగనివ్వం - ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నయీంనగర్ : ‘కేసీఆర్ అబద్ధాలకోరు.. గతంలో ఎన్నో హామీలు ఇచ్చాడు.. ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు.. ఆయన లాంటి వారు మరొకరు లేరు.. తనకు అబద్ధా లు చెప్పడం రాదనడం ఆశ్చర్యంగా ఉంది’.. అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. అణగారిన వర్గా ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆయన ఆదివారం హన్మకొండ నయీంనగర్‌లోని శ్రీసూర్య హైస్కూల్లో విలేకరులతో మాట్లాడారు. డిప్యూటి సీఎం తాటికొండ రాజయ్యను పదవి నుంచి తప్పించడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడనడానికి కాళోజీ జయంతి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. నిండు సభలో రాజయ్యను అవమానించి తన దొరతనాన్ని నిరూపించుకున్నాడని చెప్పారు. శాఖలకు, ప్రాంతాలకు సంబంధం లేకుండా కేసీఆర్ అల్లుడు హరీష్‌రావు, కొడుకు కేటీఆర్, కూతురు కవిత హామీ లు ఇస్తుండగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రాజయ్య హెల్త్యూనివర్సిటీ హామీ ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు. మంత్రి గా ఆయనకు నిర్ణాయాధి కారాలు లేకుండా చేస్తున్నాడని ఆరోపించారు. వరంగల్‌లో వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పా టు చేయకుంటే కేసీఆర్‌ను జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ అవస రం లేదన్న శ్రీహరి, రాజయ్య వ్యాఖ్యలు వారి చేతగాని తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమావేశంలో మందకుమార్ మాదిగ, తిప్పారపు లక్ష్మణ్‌మాదిగ, పుట్ట రవి, ప్రదీప్, యాక య్య, దయాకర్, వీరన్న పాల్గొన్నారు. -
వేళపై గోల..
జిల్లా పరిషత్ : ‘మన జిల్లా.. మన ప్రణాళిక’ రూపకల్పనపై ఆదివారం నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడీగా ప్రారంభమైంది. సమయపాలన, ప్రొటోకాల్ అంశంపై కొందరు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11.45 గంటలకు సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ కిషన్, జేసీ పాసుమి బసు, జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, మునిసిపల్ కమిషనర్ సువర్ణ పండాదాస్ వేదికపై కూర్చున్నారు. సమావేశం ఆరంభం కాగానే గౌరవ సభ్యుడు, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, డోర్నకల్, నర్సంపేట ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, దొంతి మాధవరెడ్డి లేచి.. అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి సభ పదకొండింటికే ప్రారంభం కావాలి. అయితే, డిప్యూటీ సీఎం ఇతర కార్యక్రమాలు చూసుకుని జెడ్పీకి వచ్చేసరికి 45నిమిషాలు ఆలస్యమైంది. దీంతో సయమపాలన పాటించకపోవడంపై గౌరవ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యానికి గల కారణాలపై సీఈఓను ప్రశ్నించారు. అనంతరం ప్రొటోకాల్ అంశాన్ని లేవనెత్తారు. వేదికపైకి వరంగల్ నగర కమిషనర్‌ను ఎలా ఆహ్వానిస్తారంటూ గౌరవసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ వివరణ ఇస్తున్న క్రమంలో ఎంపీ కడియ శ్రీహరి కల్పించుకుని మాట్లాడారు. జెడ్పీ సమావేశాలకు చైర్మన్ అధ్యక్షత వహిస్తారని, ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు, కలెక్టర్, సీఈఓ మాత్రమే వేదికపై కూర్చునే వీలుంటుందని, మరోసారి ఇలాంటి సమస్య ఉత్పనం కావద్దని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు యాకూబ్‌రెడ్డి సభకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. భోజన విరామ సమయం తర్వాత సజావుగా సాగిన సమావేశంలో పలువురు సభ్యులు మన జిల్లా.. మన ప్రణాళికకు పలు సూచనలు చేశారు. రెండు రోజుల పాటు ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ పద్మ ప్రకటించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, మానుకోట ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చందూలాల్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, జెడ్పీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు ఎం.వెంకన్న, ఎస్.శోభన్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు అంజలి ఘటించారు.