ప్రతిదీ రాజకీయకోణంలో చూడొద్దు
సూర్యాపేటరూరల్ : ప్రతిదీ రాజకీయకోణంలో చూడొద్దని, ఉద్యమంలో జెతైలంగాణ అన్న ప్రతి బిడ్డ, ఉద్యమకారుడు, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేలా ఉండాలని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యంలోని సూర్యాపేట మండలం రాయినిగూడెం వద్ద గల సెవెన్ ఆర్ హోటల్‌లో కాసేపు ఆగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయాలనే ఆలోచనలో కేసీఆర్ నాయకత్వంలో బడ్జెట్‌ను రూపొందించి సభలో ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు.
ఎస్సీ వర్గీకణ బిల్లునూ ఆమోదించామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కేవలం హైదరాబాద్ నగరం పరిధిలో ఉన్న ఆస్పత్రులకే బేసిడ్ బడ్జెట్ రూ.582 కోట్లు, ఏరియా ఆస్పత్రి ఒక్కంటికి కోటి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆప్‌గ్రేడ్‌కు రూ.30 కోట్లు కేటాయిం చినట్లు వివరించారు. జిల్లా కేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపర్చేందుకు జిల్లాకు రూ.పది కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్ర తి తెలంగాణ బిడ్డ, ఉద్యమకారుడు, అభిమానులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల న్నారు.
ఉషామోహ్రా కమిటీ కేంద్రం ఆధీనంలో ఉన్నప్పటికీ, రాజ్యాంగంలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కమల్‌నాథ్ కమిటీ సిఫారసుల మేరకు వైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఆయనకు టీఆర్‌ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, వై.వెంకటేశ్వర్లు, చినశ్రీరాములు, ఎర్రవీరస్వామిమాదిగ, తూడి నర్సింహారావుతోపాటు వైద్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.