వేళపై గోల..
జిల్లా పరిషత్ : ‘మన జిల్లా.. మన ప్రణాళిక’ రూపకల్పనపై ఆదివారం నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడీగా ప్రారంభమైంది. సమయపాలన, ప్రొటోకాల్ అంశంపై కొందరు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11.45 గంటలకు సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ కిషన్, జేసీ పాసుమి బసు, జెడ్పీ ఇన్‌చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, మునిసిపల్ కమిషనర్ సువర్ణ పండాదాస్ వేదికపై కూర్చున్నారు. సమావేశం ఆరంభం కాగానే గౌరవ సభ్యుడు, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, డోర్నకల్, నర్సంపేట ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, దొంతి మాధవరెడ్డి లేచి.. అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి సభ పదకొండింటికే ప్రారంభం కావాలి. అయితే, డిప్యూటీ సీఎం ఇతర కార్యక్రమాలు చూసుకుని జెడ్పీకి వచ్చేసరికి 45నిమిషాలు ఆలస్యమైంది.
దీంతో సయమపాలన పాటించకపోవడంపై గౌరవ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యానికి గల కారణాలపై సీఈఓను ప్రశ్నించారు. అనంతరం ప్రొటోకాల్ అంశాన్ని లేవనెత్తారు. వేదికపైకి వరంగల్ నగర కమిషనర్‌ను ఎలా ఆహ్వానిస్తారంటూ గౌరవసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ వివరణ ఇస్తున్న క్రమంలో ఎంపీ కడియ శ్రీహరి కల్పించుకుని మాట్లాడారు. జెడ్పీ సమావేశాలకు చైర్మన్ అధ్యక్షత వహిస్తారని, ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు, కలెక్టర్, సీఈఓ మాత్రమే వేదికపై కూర్చునే వీలుంటుందని, మరోసారి ఇలాంటి సమస్య ఉత్పనం కావద్దని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు యాకూబ్‌రెడ్డి సభకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.
భోజన విరామ సమయం తర్వాత సజావుగా సాగిన సమావేశంలో పలువురు సభ్యులు మన జిల్లా.. మన ప్రణాళికకు పలు సూచనలు చేశారు. రెండు రోజుల పాటు ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ ప్రకటించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, మానుకోట ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చందూలాల్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, జెడ్పీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్లు ఎం.వెంకన్న, ఎస్.శోభన్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు అంజలి ఘటించారు.