జిల్లాలో సుమారు 21,000 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నట్లుగా అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. కానీ వాస్తవంగా 30,000 మందికిపైగానే ఉన్నట్లు సమాచారం. అయితే జిల్లాలో ఎయిడ్స్‌వ్యాధి నిర్ధారణ, కౌన్సెలింగ్ నిర్వహణ కోసం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సుమారు 12 ఐసీటీసీ (ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్‌సెంటర్)లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలకు వచ్చిన వారికి ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు ఏఆర్‌టీ మందుల కోసం పంపిస్తారు. అక్కడ మరో రెండు రకాల రక్త పరీక్షలను నిర్వహించి సీడీ -4 ఆధారంగా ఏఆర్‌టీ మందులను అందజేస్తారు.
అంతేగాక వారి చిరునామాల ఆధారంగా ప్రతి నెలా మందులను అందజేసేందుకు సమీప ప్రాంతాలలోని లింక్‌డ్ ఏఆర్‌టీ కేంద్రాలకు వెళ్లమని సూచిస్తారు. జిల్లాలోని భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతీయ వైద్యశాలల్లో లింక్‌డ్ ఏఆర్‌టీ సెంటర్లను ఏర్పాటు చేశారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి (నాకో)ద్వారా ఏఆర్‌టీ, లింక్‌డ్ ఏఆర్‌టీ కేంద్రాలకు ప్రతినెలా మందుల సరఫరా జరుగుతుంది. అయితే గడిచిన రెండు నెలలుగా ఏఆర్‌టీ మందుల సరఫరా నిలిచిపోవడంతో ఎయిడ్స్ రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐసీటీకేంద్రాలకు గడిచిన 20 రోజులుగా ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్ల సరఫరా నిలిచిపోయింది.
ఇదిలా ఉండగా సగటున ఒక రోగికి గతంలో నెల రోజులకు సరిపడా మందులు అందజేసిన సంబంధిత అధికారులు ప్రస్తుతం సరఫరా నిలిచిపోయిందంటూ ఐదు రోజులకు మాత్రమే ఇస్తున్నారు. సాధారణంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు ప్రతి రోజూ తన దినచర్యలో భాగంగా ఏఆర్‌టీ మందులను తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. మధ్యలో ఏ మాత్రం నిలిపివేసినా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి నీరసించి మృత్యువాత పడే అవకాశం మెండుగా ఉంటుంది. కాగా ఏఆర్‌టీ మందులు దొరకక రోగులు అల్లాడిపోతున్నారు.
ప్రధానంగా జెఎల్‌ఎన్, ఎస్‌ఎల్‌ఎన్,టీఎల్‌ఎన్,టీఎల్‌ఈ మందుల సరఫరా పూర్తిస్థాయిలో నిలిచిపోయినట్లు సమాచారం. నాకో ద్వారా ఏఆర్‌టీ మందుల సరఫరా నిలిచి పోవడం వల్లే ఎయిడ్స్ రోగులకు అందించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే ఏఆర్‌టీ మందుల సరఫరాను కొనసాగించాలని ఎయిడ్స్ రోగులు కోరుతున్నారు.
వారికి మనోస్థైర్యం ఏదీ?
Published Wed, Oct 23 2013 1:49 AM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM
Advertisement
Advertisement