సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ కరోనా దండయాత్ర ప్రారంభమైంది. ఒక్కరోజు తేడాలోనే రెట్టింపునకు మించి కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. సోమవారం 482 కేసులు నమోదు కాగా, మంగళవారం ఏకంగా 1,052 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 659 మంది వైరస్ బారినపడ్డారు. సరిగ్గా వారం క్రితం అంటే గత నెల 29న రాష్ట్రంలో 235 కేసులు నమోదు కాగా, ఇప్పుడు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి.
ఇక జీహెచ్‌ఎంసీలో గత నెల 29న 121 కేసులు నమోదైతే, ఇప్పుడు ఐదున్నర రెట్లు పెరిగాయి. మంగళవారం 42,991 మందికి పరీక్షలు చేయగా, 2.44 శాతం మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు 1.26 శాతం వరకే నమోదైన కేసులు, ఒక్కరోజులోనే భారీగా రికార్డు అయ్యాయి. మున్ముందు ఊహించని స్థాయిలో కేసులు పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పాయి. కాగా, తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోగా, ఇప్పటివరకు 4,033 మంది వైరస్‌కు బలయ్యారు.
చికిత్స పొందుతున్నవారు 4,858
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,84,023కి చేరుకుంది. ఇక ఒక్కరోజులో 240 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం 6,75,132 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, ఇళ్లల్లో చికిత్స పొందుతున్నవారు 4,858 మంది ఉన్నారు. మరోవైపు 5,481 మంది కరోనా నిర్ధారణ ఫలితాలు రావాల్సి ఉంది. కాగా, రాష్ట్రంలో మంగళవారం 10 మంది విదేశీయులకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అందులో ఐదుగురు ముప్పున్న దేశాల నుంచి, మరో ఐదుగురు ముప్పులేని దేశాల నుంచి వచ్చినవారున్నారు.
దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 94కు చేరుకున్నాయి. ముప్పున్న దేశాల నుంచి 127 మంది రాగా, అందులో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వాటితో కలిపి మొత్తం 50 జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు రావాల్సి ఉంది. ఇదిలావుండగా, గత రెండ్రోజుల్లో రాష్ట్రంలో 15–18 ఏళ్ల వయస్సు వారికి 84,960 మందికి టీకా వేశారు.
పరీక్షలను పెంచండి
కేసులు భారీగా నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా వైద్యులు, ఇతర సిబ్బంది సెలవులు తీసుకోరాదని అంతర్గత ఆదేశాలు జారీచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలని విజ్ఞప్తి చేసింది. అనుమానం ఉన్నవారు, లక్షణాలున్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మాస్క్‌లు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల జరిమానాను కఠినంగా అమలుచేయాలని పోలీసుశాఖను కోరింది. రాబోయే సంక్రాంతిని ఇళ్లలోనే ఉండి చేసుకోవాలని, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించింది.
40–50% ఒమిక్రాన్ ఉండొచ్చు
రాష్ట్రంలో గత జూన్ తర్వాత ఈస్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇంత వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోందంటే నమోదయ్యే కేసుల్లో దాదాపు 40–50 శాతం వరకు ఒమిక్రాన్ వేరియంట్‌వి ఉండే అవకాశం ఉంది. అయితే చాలా కేసుల్లో పెద్దగా లక్షణాలు ఉండటం లేదు. కేసులు పెరిగినా ఆస్పత్రుల్లో చేరికలు పెరగలేదు.
వైరస్ వ్యాప్తి తీవ్రమైనందున రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 55,810 పడకలను అందుబాటులో ఉంచాం.అందులో ప్రభుత్వంలో 15,339 పడకలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 40,471 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం 1,247 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో 413 మంది ఐసీయూలో ఉన్నారు.
–డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు
Comments
Please login to add a commentAdd a comment