
గుజరాత్ సీఎం మార్పు?!
వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో.. ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌ను మార్చి కొత్త వ్యక్తికి ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలని అధికార బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం.
- సీఎం ఆనందీబెన్‌ను పంజాబ్ గవర్నర్‌గా పంపే యోచన?
- ఆరోగ్యశాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్‌కు సీఎం పగ్గాలు!
- వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు మోదీ-షా వ్యూహ రచన
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో.. ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌ను మార్చి కొత్త వ్యక్తికి ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలని అధికార బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలు వ్యూహరచన చేస్తున్నట్లు చెప్తున్నారు. వరుసగా నాలుగు పర్యాయాలు గెలిచిన ఈ రాష్ట్ర ఎన్నికలు పార్టీకి ప్రతిష్టాత్మకమైనవని.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కూడా అయినందున ఆ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని బీజేపీ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో ముందే కసరత్తు మొదలుపెట్టిన అధినాయకత్వం పలు సమావేశాలు నిర్వహించి వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపాయి. అందులో భాగంగా ప్రస్తుత సీఎం ఆనందీబెన్ పటేల్‌ను వేరే రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించటం ద్వారా.. సీఎం పదవిని కొత్త వారికి అప్పగించేందుకు మార్గం సుగమం చేయాలని యోచిస్తున్నట్లు వివరించాయి. ఆమెను పంజాబ్ గవర్నర్‌గా నియమించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. కొత్త సీఎం రేసులో ముందున్న వారిలో నితిన్‌భాయ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ సహా పలు కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న నితిన్‌భాయ్ గత వారం ఢిల్లీ వచ్చి మోదీని కూడా కలిశారు.
పటేల్ ఆందోళనతో మారిన కథ...
రెండేళ్ల కిందట సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనంతరం.. మోదీ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆనందీబెన్‌ను మోదీ వారసురాలిగా ఎంపిక చేశారు. అయితే.. గత ఆగస్టులో రాష్ట్రంలో భారీ స్థాయిలో ముందుకొచ్చిన పటేల్ రిజర్వేషన్ల ఉద్యమంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బీజేపీకి రాష్ట్రంలో సంప్రదాయ ఓటు బ్యాంకుల్లో బలమైన ఓటు బ్యాంకు అయిన పటేల్ వర్గంతో సంబంధాలు ఆ ఆందోళనతో దెబ్బతిన్నాయి. పటేల్ ఉద్యమ నేతలతో చర్చలు జరిపిన ప్రభుత్వ బృందానికి నితిన్ సారథ్యం వహించినట్లు చెబుతున్నారు.
కరువులోనూ గుజరాత్‌లో 95 శాతం పంట
సీఎం ఆనందీబెన్‌కు ప్రధాని ప్రశంస
వర్షాభావం వల్ల వరుసగా రెండేళ్లు కరువు పీడించినా 95 శాతం వ్యవసాయ ఉత్పత్తి సాధించినట్టు గుజరాత్ పేర్కొంది. అందుకు తాము ఏర్పాటు చేసిన వాటర్‌గ్రిడ్ వంటి నీటి వసతుల కల్పనే కారణమంది. కరువు ప్రభావిత రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఈ మేరకు వివరించినట్టు పీఎంఓ వెల్లడించింది. వాటర్ గ్రిడ్ ఏర్పాటు వల్ల నీటి పంపిణీకి 568 ట్యాంకర్లు సరిపోయాయంది.
గుజరాత్ కృషిని మోదీ అభినందించారని సూచించారని పీఎంఓ పేర్కొంది. నీటి పరిరక్షణలో భాగంగా 1.68 లక్షల చెక్‌డ్యామ్‌లు, 2.74 లక్షల వ్యవసాయ చెరువులు, 42.3 బిలియన్ క్యూబిక్ అడుగుల నిల్వ సామర్థ్యం గల 1.25 లక్షల సాగునీటి వసతుల కల్పనతో 6.32 లక్షల హెక్టార్లకు ప్రయోజనం చేకూరినట్టు సీఎం తన నివేదికలో పేర్కొన్నారు. 77 శాతం ఇళ్లకు కుళాయిలతో నీటి సరఫరా చేశామన్నారు. దీనివల్లే తీవ్ర కరువులోనూ సాధారణ ఉత్పత్తితో పోలిస్తే 95 శాతం పంట సాధించినట్టు తెలిపారు.