ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్‌నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్‌గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్‌లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు..
‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం.
ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం.
8–15 ఏళ్ల వయసులో ..
పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్‌లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు.
తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్‌కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం.
ఊబకాయమూ సమస్యే
ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్‌ఓ సూచించిన టెస్ట్‌లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్‌ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్‌లో ‘మీ స్కూల్ కరిక్యులమ్‌లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్‌తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్‌గా చేయించాలని సూచిస్తున్నాం.
ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో..
రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్‌లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్‌డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్‌డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది.
పరిష్కారాలూ సూచిస్తున్నాం..
ఎక్కడైతే టెస్ట్‌లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్‌పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.
బాల్య దశ కీలకం
పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్‌డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి.
వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది.
మధ్య తరగతే కీలకం
మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment