గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఎందుకు అన్నారో గాని ఈ కాలంలో ఆ మాట పదేపదే వల్లె వేసుకోవాల్సి వస్తోంది. గుడి కన్నా ఇల్లు పదిలం అని కూడా అనుకోవాల్సి వస్తోంది.
బయటకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు మనం ఉంటున్న ఇంటివైపే కన్నెత్తి కొత్తగా చూడాలి. కొత్తగా అలంకరించుకోవాలి. కొత్తగా కొత్త సంవత్సరానికి ఇంట్లో ఉంటూ ఆహ్వానం పలకాలి.
ఎలా చేస్తే బాగుంటుంది?
మళ్లీ కొత్త వేరియంట్ అంటున్నారు. బయటకు వెళ్లొద్దంటున్నారు. జాగ్రత్తగా ఉండమంటున్నారు. పార్టీలను అవాయిడ్ చేయమంటున్నారు. కొన్నిచోట్ల డిసెంబర్ 31న నైట్ కర్ఫ్యూలు అనౌన్స్ చేస్తున్నారు. ఇన్నేల? న్యూ ఇయర్ పార్టీని ఇంట్లోనే ఉండి చేసుకోవడం మేలని నిపుణులు, ఆరోగ్య శాఖ అధికారులు, హితవరులు హితవు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్‌కి ఏ గోవాకో, కేరళకో వెళ్లడం ఆనవాయితీ. ఈసారి మానేస్తే ఏం పోతుంది? లేదంటే కారులో బయలుదేరి సొంత ఊరుకు వెళ్లడం పరిపాటి. వద్దు అనుకోవడం మంచిదే కదా.
సిటీలోని ఏదైనా రిసార్ట్ బుక్ చేసుకొని ఇండియన్ ఐడల్ కొత్త సింగర్స్ పాడే పాటలకు నాలుగు డాన్స్‌లు చేయాలని కోరిక ఉంటుంది. ఈసారి నో అనుకుంటే సరిపోదా? ‘జాన్ హైతో జహా హై’ అని సామెత. అంటే ‘ప్రాణాలు ఉంటే ప్రపంచం’ ఉంటుంది అని అర్థం. ప్రాణాలు ఉండాలేగాని భవిష్యత్తులో బోలెడన్ని న్యూ ఇయర్ పార్టీలు బయట చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వెల్‌కమింగ్ పార్టీకి బెస్ట్ ప్లేస్ ఇల్లే అనుకుందాం ఈసారి. సరిగ్గా ట్రై చేస్తే ఇంట్లోనే మంచి పార్టీ చేసుకోవచ్చు. కొత్త హుషారు తెచ్చుకోవచ్చు. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పొచ్చు. ఏం చేద్దాం.
ఒకటి రెండు కుటుంబాల్ని ఎంచుకోండి
బయట పార్టీ వద్దన్నారు కానీ ఇంట్లో స్నేహితులతో వద్దు అనుకోలేదు. ఏ ఇంటి పార్టీ అయినా మనకు మనం చేసుకుంటే అంత బాగుండదు. మీకు బాగా ఇష్టమైన ఒకటి రెండు కుటుంబాలను పిల్చుకోండి. చాలా రోజులుగా రాని కొడుకు వచ్చినా కూతురు వచ్చినా మరీ మంచిది. బంధువుల కన్నా స్నేహితుల వల్లే సరదా అనుకున్నా సరే. ఆ గెస్ట్‌లను పిలవడం పూర్తి కాగానే పార్టీ పనుల్లో దిగండి.
లైట్లు వెలిగించండి
లైట్లు కొత్త వెలుతురును కాంతిని తెస్తాయి. బయట రెడిమేడ్ సీరియల్ సెట్లు దొరుకుతాయి. అవి తెచ్చి ఇంటి గేటు కు, కాంపౌండ్ వాల్‌కు, ముంగిలిలో ఉన్న చెట్లకు, మొక్కలకు, మిద్దెకు వేలాడ దీసి వెలిగించండి. కొనలేకపోతే ఏ ఎలక్ట్రీషియన్‌కు చెప్పినా ఒక రాత్రికి ఇంతని అద్దె తీసుకొని వేసి పోతాడు. అవి ఒక్కసారి మిలమిలమని వెలగడం ప్రారంభిస్తే ఇంటికి కొత్త కళ పార్టీ కళ వచ్చేస్తుంది. పెరడు ఉంటే అక్కడ రెండు ఫ్లాష్‌లైట్లు వెలిగించండి. వంట పనులకు కూడా పనికి వస్తుంది. దీనికి ముందు ఇల్లు నీట్‌గా సర్దుకోండి. కొత్త కర్టెన్లు వేలాడగట్టినా మంచాల మీద కొత్త దుప్పట్లు పరిచినా కొత్త కళ వచ్చేస్తుంది.
షామియానా వేయండి
షామియానా వేస్తే వచ్చే కళ వేరు. ఇంటి ముందు బుజ్జి షామియానా వేయించండి. పెరడు ఉంటే అక్కడ కూడా చిన్న షామియానా వేస్తే ఆ షామియానా కింద కుర్చీలు వేసుకుని కూచోబుద్ధవుతుంది. ఆ షామియానా కిందే వంట పనులు చేసుకుంటే ఆ హుషారే వేరు. అతిథులు డిసెంబర్ 31 మధ్యాహ్నానికే చేరుకుంటే సాయంత్రం నుంచి వంటలు మొదలెట్టుకోవచ్చు. అందరూ కలిసి సరదాగా వండొచ్చు. పార్టీలో పానీయాలు ఉంటే స్టార్టర్లు, పిల్లలకు స్నాక్స్, మెయిన్ కోర్సు, డిన్నర్ తర్వాత డిజర్ట్‌లు, సరిగ్గా 12 గంటలకు కోయడానికి కేక్ ఇవన్నీ సిద్ధం చేసుకోవడమే ఒక పార్టీ. అదంతా ఎంజాయ్ చేయండి. అదే సమయంలో డైనింగ్ టేబుల్‌ని కూడా అందంగా అలకరించండి. అందమైన ప్లేట్లు బయటకు తీయండి. ఆ పార్టీ... ఆ భోజనం రెండూ గుర్తుండిపోవాలి.
ఫొటో కార్నర్
ఇంట్లో ఏ ప్రాంతంలో మంచి ఫోటోలు వస్తాయో అక్కడ ఒక ఫోటో కార్నర్ ఏర్పాటు చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ 2022 అని రాసిన ఫ్రేమ్ తయారు చేసి దాని వెనుక నిలబడి ఫొటోలు దిగవచ్చు. లేదా అలాంటి అక్షరాలు హ్యాంగ్ చేసిన గోడ దగ్గర అయినా సరే. ఫొటోలు బాగా వచ్చే సెల్‌ఫోన్‌నే వాడండి. అందరూ నవ్వుతూ సంతోషంగా ఫొటోలు దిగండి. రోజులు గడిచిపోతాయి. కాని ఫోటోలు నిలిచిపోతాయి. మన ఇంటి పెద్దలతో తప్పక గ్రూప్ ఫోటో దిగండి.
ఫోన్లు చేయండి
పార్టీ ఒక వైపు నడుస్తుంటుంది. మీరు మీ అయిన వారికి ఆత్మీయులకు వీడియో కాల్స్ చేస్తూ మీ దగ్గరే వారు కూడా ఉన్నట్టు వారి దగ్గర మీరూ ఉన్నట్టు ఫీల్ రానివ్వండి. కెమెరాను ఇల్లంతా జూమ్ చేస్తూ పార్టీ హడావిడి చూపించండి. వారి హడావిడి చూస్తూ జోక్స్ కట్ చేయండి. చాలా రోజులుగా పలకరించని మిత్రులను పలకరించండి. కొత్త సంవత్సరం మన బంధాలు మరింత గట్టి పడాలని కోరుకోండి.
ప్రార్థన చేయండి
కొత్త సంవత్సర ఘడియలు వచ్చాక ఒక ఐదు పది నిమిషాలు మౌనంగా కూచుని ప్రార్థన చేయండి. ప్రార్థన వంటి పదాలు నచ్చని వారు ఈ విశ్వంలోకి పాజిటివ్ ఆలోచనలు పంపండి. అందరూ బాగుండాలని అంతా మంచే జరగాలని కోరుకోండి. మీరు ఎంత గట్టిగా కోరుకుంటే ఈ విశ్వం అంత బాగుంటుంది.
న్యూ ఇయర్ పార్టీకి ఈ పద్ధతిలో రెడీ అయిపోండి. హ్యాపీగా జరుపుకోండి. సురక్షితంగా జరుపుకోండి.
హ్యాపీ న్యూ ఇయర్.
మ్యూజిక్ అండ్ డాన్స్
పార్టీలో మ్యూజిక్ లేకపోయినా డాన్స్ లేకపోయినా అస్సలు బాగోదు. అద్దెకు బాక్సులు దొరుకుతాయి. తెచ్చుకోండి. లేదా సొంతవి ఉంటే రెడీ చేసుకోండి. రకరకాల మ్యూజిక్ యాప్‌లు ఉన్నాయి. వాటి నుంచి మంచి డాన్స్ నంబర్లు ప్లే చేయండి. షామియానా కిందో, ఇంటి డాబా పైనో చిన్న స్టేజ్ కట్టుకుంటే అందరి నృత్యకౌశలం చూసి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు ఫస్ట్ సెకండ్ అని పోటీ పెట్టకండి. వారు ఏ చిన్న కళ ప్రదర్శించినా ఒక బహుమతి ఇవ్వండి. మన ఇంటి పాట వీధికి కళ తెస్తుంది. వీధికి కళ వస్తే ఊరికి వస్తుంది. అలాగని మరీ పెద్దగా సౌండ్ పెట్టకండి. మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండాలి. డిస్ట్రబ్ చేస్తున్నట్టుగా కాదు.
Comments
Please login to add a commentAdd a comment