సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరుల ఆరోగ్యవంతమైన జీవనానికి ముందడుగు పడింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పరిశీలించి ఆ వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా ఈ కార్యక్రమాన్ని ములుగు, సిరిసిల్ల జిల్లాలో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు 30 రకాల పరీక్షలు నిర్వహించనుంది.
వాటి ఫలితా లను ప్రత్యేక పోర్టల్‌లో నిక్షిప్తం చేయనుంది. ఆ వ్యక్తికి మాన్యువల్ రిపోర్టులు ఇవ్వడం, ఫలితాల్లో తేడాలను గుర్తిస్తే మందులను ఉచితంగా పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు అవసరమైతే పెద్దాసుపత్రికి రిఫర్ చేయడం జరిగిపోనుంది. కార్యక్రమాన్ని అతి త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నారు.
కీలక పరీక్షలతో ప్రొఫైల్..
హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన వారికే పరిమితం చేశారు. రోగాలు, ఇతర అనారోగ్య సమస్యలు 18 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా నమోదవుతున్నందున ప్రభుత్వం ఈ మేరకు నిర్ధారించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ 30 రకాల పరీక్షలు చేయనుంది. ప్రధానంగా బ్లడ్ గ్రూపింగ్, మూత్రపిండాల పనితీరు, కాలేయం పనితీరుతో పాటు కొలెస్టరాల్, బ్లడ్ షుగర్, బ్లడ్ యూరియా తదితరాలు పరిశీలించనుంది.
పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేయనుంది. ప్రతి పౌరుడికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తుంది. ఈ సంఖ్య ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ప్రొఫైల్ పోర్టల్‌లో వివరాలను నిక్షిప్తం చేస్తుంది. పోర్టల్ రూపకల్పనలో హైదరాబాద్ ఐఐటీ సహకారం తీసుకుంది.
క్షేత్రస్థాయిలో ఇలా..
‘హెల్త్ ప్రొఫైల్’అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్రే కీలకం. కార్యక్రమంలో భాగంగా హెల్త్ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటి సర్వే చేస్తారు. హెల్త్ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ముందుగా కుటుంబానికి చేరుకుని అర్హుల వివరాలు సేకరిస్తారు. వారికి విశిష్ట గుర్తింపు సంఖ్యను జనరేట్ చేసిన తర్వాత శాంపిల్స్ (నమూనాలు) తీసుకుంటారు. వాటిని ప్యాక్ చేసి బ్లడ్ గ్రూపింగ్, సీబీపీ కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు.
మిగతా పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నస్టిక్స్‌కు చేరవేస్తారు. అక్కడ పరీక్షలు ముగిశాక ఉన్నతాధికారు లు, వైద్యనిపుణుల ఆమోదం తర్వాత విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తులకు యూనిక్ డిజిటల్ హెల్త్ కార్డుతో పాటు పరీక్షల ఫలితాల ప్రతులను ఇస్తారు. పరీక్షల్లో లోపాలు గుర్తించిన వారికి మెడిసిన్ కిట్, ఆరోగ్యశాఖ మంత్రి సందేశాన్ని ఇస్తారు. ఇతర జబ్బులున్నట్టు తెలిస్తే జిల్లా ఆస్పత్రి, నగరంలోని ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు రిఫర్ చేసి ప్రత్యేక చికిత్సను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం కృషి చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment