
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో అవకతవకలకు పాల్పడి విచారణ ఎదుర్కొంటున్న పలువురిని కాపాడేందుకు ఆరోగ్యశాఖ విజిలెన్స్ సిబ్బంది యత్నిస్తున్నారు. వీరికి సంబంధించిన ఫైళ్లను ఆధారాలు లేకుండా చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య శాఖలోని ఆయుష్ విభాగంలో కొంతమంది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారు. వీరికి సంబంధించిన ఫైళ్లు సచివాలయంలోని ఆరోగ్యశాఖ విజిలెన్స్ విభాగం పరిధిలో విచారణలో ఉన్నాయి.
అవినీతికి పాల్పడిన కొంతమందికి సంబంధించి కేసులు లోకాయుక్తలోనూ పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో విచారణ పూర్తయితే గానీ పదోన్నతులు, బదిలీలు ఇవ్వడం కుదరదు. ఇలాంటి నిబంధనలను తోసిరాజని, వారికి సంబంధించిన ఆధారాలను పక్కన పెట్టి విచారణను తొక్కి పెట్టేందుకు యత్నిస్తున్నారు. అవకతవకలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు లేకుండా ఉండేందుకు ఫైళ్లను మార్చేస్తున్నారు. కొంతమంది సిబ్బంది విచారణ ఎదుర్కొంటున్న వారితో కుమ్మక్కై ఇలా చేస్తున్నట్టు తెలిసింది.
ఒక దశలో థర్డ్ పార్టీతో (విభాగంతో సంబంధం లేని వ్యక్తులతో) విచారణ చేయాలని సదరు అధికారులపై ఆదేశాలివ్వగా.. ఇప్పుడు అది అవసరమే లేదని రాస్తున్నారు. ఆరోగ్యశాఖ విజిలెన్స్ అధికారులు.. ఆయుష్ అధికారులతో బేరసారాలు సాగించారని, కారుణ్య నియామకాలు, పదోన్నతులు, నిధుల దుర్వినియోగం తదితర విషయాల్లో అవినీతికి పాల్పడిన వారిపై కచ్చితమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.